అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవమిది!!

సినీ ప్రపంచంలో వేణు నక్షత్రం ప్రకాశించింది. అంతర్జాతీయ ఇండిపెండెంట్ మూవీ ఫెస్టివల్‌లో తెలంగాణ సినిమా రెండు అవార్డులు గెలుచుకుంది. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన తురుంఖాన్ వేణు నక్షత్రం చేతిలో రంగుల వెలుగులద్దుకుని రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆరో వరల్డ్ మ్యూజిక్ అండ్ ఇండిపెండెంట్ మూవీ ఫెస్టివల్‌లో వేణు నక్షత్రం నిర్మించి, దర్శకత్వం వహించిన లఘు చిత్రం “ఎంతెంత దూరం” జ్యూరీ ప్రశంసలందుకుని ఉత్తమ దర్శకత్వం(వేణు నక్షత్రం), ఉత్తమ నటుడు(భూపాల్) అవార్డులు గెలుచుకుంది. మన సినిమాకు అంతర్జాతీయ గౌరవం అందుకున్న సందర్భంగా వేణు నక్షత్రం నడిచిన (ఎంతెంత) దూరం విశేషాలు ఆయన మాటల్లో..

మా నాన్న హెడ్‌మాస్టర్. మాది మెదక్ జిల్లా సిద్దిపేట.. హైస్కూల్ చదువు వరకు మామూలుగానే సాగిపోయింది. ఇంటర్ చదివేప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలసై ఆసక్తి చూపేవాడిని. కాలేజీ రోజుల్లో కవితలు రాశాను. నేను రాసిన కథలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మా అన్నయ్య ఆర్టిస్ట్. సైన్‌బోర్డ్‌లు రాస్తూ ఉండేవాడు. ఆయనకు నేనూ సహకరించేవాడిని. అలా పెయింటింగ్‌లో ప్రవేశం దొరికింది. మా పెదనాన్న నాటకాలు వేసేవాడు.

అందువల్ల నాకు నాటకంపై, కళలపై ఇంకా ఆసక్తి పెరిగింది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. మంజీరా రచయితల సంఘంలో చేరి, సాహితీ సభలకు వెళ్లేవాడిని. ప్రజాసాహితికి కథలు, కవితలు, ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడిని. ఇలా సాహిత్యం, కళలతో నా కాలేజీ జీవితం సహవాసం చేసింది.

బీఎస్సీ పూర్తయింది. నాన్న బీఈడీలో చేర్పించిండు. ఫీజు కట్టాం. నాకు ఇష్టంలేక మానేశాను. బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాను. ఉద్యోగం రాలేదు. ఓ ప్రైవేటు కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్‌గా ఏడాది పాటు పనిచేశాను. ఆ తర్వాత ఎంసీఏలో చేరాను. 1997లో ఎంసీఏ పూర్తయింది. ఆరు నెలల తర్వాత అమెరికాలో ఉద్యోగానికిపోయాను. వరల్డ్‌వైడ్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగం. వాళ్లు చెప్పింది వేరు, చేసింది వేరు. విలాసవంతమైన జీవితమంటూ ఊరించి చివరికి ఎనిమిదిమందిని సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉంచారు. ఆ ఉద్యోగం మానేశాను. ఇంకో కంపెనీలో చేరాను. ఇలా నాలుగు కంపెనీల్లో మారాను.

హాలీవుడ్‌లో అవకాశం..
2008లో నేను ఉండే బిల్డింగ్ పక్కన స్టేట్ ఆఫ్ ప్లే మూవీ షూటింగ్ జరుగుతోంది. నటించాలనే ఆసక్తితో, అవకాశం కోసం అడిగాను. ఫొటోగ్రాఫర్ల గుంపులో నీవూ ఓ ఫొటోగ్రాఫర్‌గా నటించే అవకాశం ఉందన్నారు. ఫొటోతో, వివరాలు జతచేసి దరఖాస్తు చేశాను. అనుకోకుండా గుంపులో గోవిందయ్య క్యారెక్టర్ కాకుండా గొప్ప యాక్టర్లతో ఒక డాక్టర్‌గా నటించే అవకాశం ఇచ్చారు.

ఆ చిత్రంలో రస్సెల్ బ్రోన్, రేచల్ మెక్ ఆడమ్స్‌తో కలిసి నడిచే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆర్లింక్సన్ అనే ఇండిపెండెంట్ మీడియా గ్రూపులో చేరాను. అందులో చేరి ఎడిటింగ్, వీడియో ప్రొడక్షన్, స్టూడియో ప్రొడక్షన్ నేర్చుకున్నాను.

బతుకమ్మ కథ.. వేణు స్క్రీన్ ప్లే!
సినిమాల్లో పనిచేస్తూనే సినిమా నిర్మాణంపై అధ్యయనం చేశాను. సినిమా నిర్మాణంలోని అనేక విభాగాల్లో పనిచేశాను. ఒక మంచికథ దొరికితే సినిమాతీద్దాం అనే ఆలోచనతో ఉద్యోగం చేసుకుంటూ కథ కోసం అన్వేషిస్తున్నాను. చిన్నప్పటి నుంచి సాహితీ ప్రియుడిని కావడంతో అమెరికాలో ఉన్నా ఆన్‌లైన్‌లో తెలుగు దినపత్రికల్లోని సాహిత్య వ్యాసాలు, కథలు, కవితలు చదివేవాడిని. ఇలా చదువుతున్న క్రమంలో ఓ రోజు నమస్తే తెలంగాణ పత్రిక ఆదివారం రోజున పాఠకుల కోసం అందించే బతుకమ్మలో తురుంఖాన్ అనే కథ చదివాను. అది నాకు బాగా నచ్చింది. ఆ కథా రచయిత పసునూరి రవీందర్‌ను సంప్రదించాను.

ఆయన ఈ కథను షార్ట్‌ఫిలింగా తీస్తానని చెప్పగానే అంగీకరించారు. ఆ కథకు నేనే స్క్రీన్‌ప్లే, మాటలు రాసుకున్నాను. ఆ కథలో లేని మరికొన్ని సన్నివేశాలను జోడించాను. ఈ కథలో ముఖ్యమైన క్యారెక్టర్ ముత్తయ్య. ప్రతిభావంతుడైన దళిత విద్యార్థికి తండ్రి.. అగ్రకులానికి చెందిన భూస్వామి ఇంట్లో పాలేరు ముత్తయ్య. ఈ క్యారెక్టర్‌కు సరైన నటుడి కోసం మూడు నెలలు అన్వేషించాను. భూపాల్ సరైన నటుడని భావించాను. అప్పటికే ఆయన నటించిన కొమురం భీం, దాసి చూశాను. ఫోన్‌లో ఆయనతో మాట్లాడాను. ఆయన నాకు నచ్చిన స్క్రిప్ట్ అయితేనే చేస్తానన్నారు. పంపించిన గంటలోనే కాల్ చేసి ఈ చిత్రంలో తప్పక నటిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయాలని సూచనలు చేశారు.

ఆణిముత్యాలకు కొదువలేదు..
ఇబ్రహీంపట్నం నాయినంపల్లిలోని ఒక స్లమ్ ఏరియాలో షూటింగ్ పూర్తి చేశాం. విష్ణుకిషోర్ సంగీతం సమకూర్చారు. సినిమా బాగా వచ్చింది. ఎంతెంతదూరం పేరుతో జనం ముందుకు వచ్చిన ఈ లఘు చిత్రానికి స్పందన కూడా అంతే బాగా వచ్చింది. ఉస్మానియాలో తొలి ప్రదర్శనకు అపూర్వ స్పందన లభించింది. ఆ తర్వాత లమాకాన్‌లో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ద్వితీయ చిత్రం అవార్డు గెలుచుకుంది.

ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులు గెలుచుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఇకముందు కూడా ఇలాంటి చిత్రాలు తీస్తాను. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమిది. తెలంగాణ సినీ పరిశ్రమలో ఎంతోమంది ఆణిముత్యాల్లాంటి ప్రతిభావంతులకు కొదువలేదు. అలాంటి నటులను ప్రపంచానికి పరిచయం చేస్తూ, తెలంగాణ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఇకముందూ కృషి చేస్తాను.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Related Articles

  None Found

3 Responses

 1. ganeshbabu chebolu says:

  venu garu,
  prathibha tapana vunna variki avakasalaku kodave ledu.
  adi yeppudu yela vastundi annadi jeevitham lo ravalsi vunte tappaka vachestundi.
  mee laghu chitram jury award geluchukunnanduku meeku hardhika subhakanshalu.
  ide spoorthitho marinni manchi chitralu teeyalani manasara deevisthu

  with elderly blessings
  ganeshbabu chebolu,hyderabad

 2. Venu Nakshathram says:

  Thank You Mission Telangana for publishing the NT article.
  Thank You Ganesh babu for nice feedback. Planning to make a feature film sreegeetham. Need all your blessings and encouragement !
  Thanks
  Venu Nakshathram

 3. J R Janumpalli says:

  Congratulations Venu!Great recognition to your effort.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *