mt_logo

కాడి ఎత్తేసిన ప్రతిపక్షాలు. భారీ విజయం దిశగా టీఆర్ఎస్

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం గమనిస్తే ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయి అని పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సభలతో రాష్ట్రం అంతా కలియ తిరుగుతుంటే, ఆయన వేగాన్ని అందుకునే ప్రతిపక్ష నాయకులే కరువయ్యారు. కాంగ్రెస్ నుండి రాహుల్, బీజేపీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఒకటి రెండు సభల్లో మొక్కుబడిగా పాల్గొన్నా, వారు పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి.

మండుటెండను కూడా లెక్కజేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం అంతటా సభల్లో ప్రసంగిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే టీఆర్ఎస్ పార్టీకి 16 కు 16 సీట్లు కట్టబెట్టాలని స్పష్టంగా వివరిస్తున్నారు. ఇన్నాళ్లూ జాతీయ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, మన రాష్ట్రం కొరకు కొట్లాడే మన పార్టీ ఎంపీలు లోక్ సభలో ఉండాలని గట్టిగా ప్రజలకు చెబుతున్నారు. ఈ ప్రసంగాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.

విభజన చట్టంలో హామీలను కూడా బీజేపీ అమలు చేయలేదు అని, ఉన్న ఒక్క ఎంపీని కొన్నాళ్లు కేంద్ర మంత్రి చేసి, ఆ తరువాత ఆయనను అవమానకరంగా ఆ పదవినుండి తొలగించిన బీజేపీ మీద తెలంగాణ ప్రజలు ఆల్రెడీ పీకల దాకా కోపం మీద ఉన్నారు. దీనికి తోడు నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల నష్టపోయిన వ్యాపార వర్గాలు, అసంఘటిత రంగంలోని వారు ఈసారి బీజేపీకి ఓటు వేసేది లేదు అంటున్నారు.

ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే నానాటికీ తీసికట్టు అన్నట్టు తయారైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 19 ఎమ్మెల్యేలు మాత్రమే గెలవగా అందులో పది మంది నెల తిరక్కుండానే టీఆర్ఎస్‌లో చేరడంతో తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు అయ్యింది.

రాష్ట్ర నాయకులుగా చెప్పుకునే ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తాము పోటిచేస్తున్న నియోజకవర్గాలు దాటి ఒక్కరోజు కూడా బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. మల్కాజిగిరిలో రేవంత్, నల్గొండలో ఉత్తం ఇద్దరూ ఎదురీదుతున్నారు. గౌరవప్రదమైన ఓటమి దిశగానే వారి ప్రచారం కొనసాగుతోంది.

మరో వైపు టీఆర్ఎస్ నుండి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాలు – మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ఆయన రోడ్ షోలకు జనం విరగబడుతున్నారు. రెండేళ్ల క్రితం జీ్‌హెచ్ఎంసీ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేసినట్టుగానే హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో కేటీఆర్ ఒంటిచేత్తోనే స్వీప్ చేసే విధంగా ప్రచారాన్ని ముందుండి నడుపుతున్నారు.

అదే ప్రతిపక్ష అభ్యర్ధులు పైస్థాయి నాయకత్వం అండలేకుండానే, ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపి అభ్యర్ధులు అక్కడక్కడ ఇరవై, ముప్పై మందిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు అధికార టీఆర్ఎస్ సభలు, రోడ్ షోల్లో వేలాది సంఖ్యలో జనం కనపడుతున్నారు. నిన్న మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి బలరాం నాయక్ విలేకరులతో మాట్లాడుతూ మా హై కమాండ్ మమ్మల్ని వదిలేసింది అని నిర్వేదంగా చెప్పుకోవడం తెలంగాణలో ప్రతిపక్షాల స్థితికి అద్ధం పడుతుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *