mt_logo

టీఆర్ఎస్ లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ఎమ్మెల్యే కే యాదయ్య ఆదివారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి రాజకీయాలు చేసుకోవడం మంచిదికాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తులన్నీ ఒకే తాటిపైకి రావలసిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయని, మన రాష్ట్రం మనకు వచ్చింది. మనం అన్ని విధాలుగా బాగుపడాలి. తెలంగాణ సమాజం మొత్తం పెద్ద ఆశతో టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు చూస్తుందని, తప్పకుండా ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరి తీరాలని కేసీఆర్ అన్నారు.

మూడేళ్ళ తర్వాత రెప్పపాటు కూడా కరెంట్ పోదని, కరెంటు కోత లేకుండా చేస్తామని, నాలుగో సంవత్సరం పూర్తయ్యేసరికల్లా ప్రతి ఇంటికీ నల్లాను పెట్టించి కృష్ణా, గోదావరి జలాలు అందిస్తామని సీఎం పేర్కొన్నారు. మంచినీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు కూడా అడగదని, హైదరాబాద్ చుట్టూ వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌస్ కల్టివేషన్, హార్టికల్చర్ చేపట్టామని, డ్రిప్ ఇరిగేషన్ లో ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందిస్తామని చెప్పారు.

చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య కోరికలన్నీ న్యాయమైనవేనని, నూటికి నూరు శాతం వాటిని తీర్చి ప్రజల్లో ఆయన పేరును నిలబెడతామని, శంకర్ పల్లి, చేవెళ్లలో మంచి ఆస్పత్రులు కావాలన్నది న్యాయమైన కోరికని, తప్పకుండా వాటిని నెరవేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ, 60 ఏళ్ల పోరాటం, అమరుల త్యాగఫలితంగా తెలంగాణ వచ్చిందని, తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిష్పక్షపాతంగా కృషి చేస్తున్నారని, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షించడం వల్లే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *