mt_logo

జే.ఏ.సి త్రాసులో తులసిదళం అని మరువకండి!

తెలంగాణ ఉద్యమంలో (జాయింట్ ఆక్షన్ కమిటీలు) జే.ఏ.సిలు ఏర్పడటం ఒక చారిత్రక పరిణామం. ఈ ప్రక్రియకు డిసెంబర్ 2009లో ఉస్మానియా విద్యార్ధులు శ్రీకారం చుట్టారు. అన్ని అజెండాలను, ఇజాలను పక్కనపెట్టి ఒక్క తెలంగాణ కొరకే అన్ని విద్యార్ధి సంఘాలు ఉస్మానియా స్టూడెంట్ జే.ఏ.సి అనే పేరుతో ఒక్కతాటి కిందికి వచ్చారు. విద్యార్ధి ఉద్యమాన్ని కదం తొక్కించి చరిత్ర సృష్టించారు.

డిసెంబర్ 23, 2009 నాడు కేంద్రం తెలంగాణకు అడ్డుపుల్ల వేస్తూ రెండో ప్రకటన చేసినప్పుడు కేసీయార్ కూడా తెలంగాణ రాజకీయ పక్షాల ఐక్యతకు చొరవ చూపి, జానారెడ్డితో సమావేశమై తెలంగాణ రాజకీయ జే.ఏ.సి నెలకొల్పడం జరిగింది.

రాజకీయ జే.ఏ.సికి ప్రొఫెసర్ కోదండరాంను చైర్మన్ గా ఎన్నుకోవడం నిజంగా ఒక గొప్ప నిర్ణయం. అప్పటికే దశాబ్దంపైగా తెలంగాణ విద్యావంతుల వేదిక పేరు మీద తెలంగాణ ఉద్యమంలోను, అంతకు ముందు పౌరహక్కుల ఉద్యమంలోనూ పనిచేసిన కోదండరాం, ఏ విధంగా చూసినా ఈ పదవికి అర్హుడు. ఆయన తెలంగాణ పది జిల్లాల్లోని ఉద్యమకారులకు సుపరిచితుడు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యుడు.

తెలంగాణ ఉద్యమం గురించే కాక జాతీయ, అంతర్జాతీయ సామాజిక, రాజకీయ, ఆర్ధిక విషయాలపై అనర్గళంగా మాట్లాడగల వాక్చాతుర్యం, విశ్లేషించి రాయగల నైపుణ్యం,, నిరాడంబర జీవితం, వివాదాలకు దూరంగా ఉండే తత్వం – అన్నీ కలగలిసిన అద్భుత వ్యక్తిత్వం – ఇదీ కోదండరాం అంటే.

మొదట కొన్నాళ్లు జే.ఏ.సిలో ఉన్నట్టు నటించిన కాంగ్రెస్, తెదేపాలు తొందరగానే తమ అసలు రంగులు బయటపెట్టుకున్నాయి. టీ.ఆర్.ఎస్. బీజేపీ, న్యూ డెమోక్రసి మాత్రం ఇప్పటికీ జే.ఏ.సిలో కొనసాగుతున్నాయి.

పాలమూరు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత టీ.ఆర్.ఎస్ శ్రేణులు రాజకీయ జే.ఏ.సిపై కొంచెం గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా పరకాలలోనూ బీ.జేపీ. టీ.ఆర్.ఎస్ పోటీ పడుతుండటంతో జే.ఏ.సి మళ్లీ తటస్థ పాత్రనే పోషించవలసిన ఆగత్యం ఏర్పడింది.

రాజకీయ జే.ఏ.సి అనే అలోచనకు బీజం వేసిందే తామని, ఇప్పుడు ఆ జే.ఏ.సి తమకు మద్ధతు ఇవ్వకపోవడం ఏమిటనే టీ.ఆర్.ఎస్ ఆవేదనలో అర్థం ఉంది. అయితే అంతమాత్రాన జే.ఏ.సిని, ప్రొఫెసర్ కోదండరాంను దూరం చేసుకునే అలోచన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆత్మహత్యాసదృశ్యం కాగలదు.

మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్, బీజేపీల మధ్య సయోధ్య కుదర్చడానికి తెలంగాణా రాజకీయ జే.ఏ.సి చాలా శ్రమించింది. అయినా ఇరుపార్టీలూ పోటీకే మొగ్గు చూపడంతో రాష్ట్ర జే.ఏ.సి తటస్థంగా ఉండిపోయింది. టీ.ఆర్.ఎస్ పోటీచేసిన అన్ని చోట్లా ప్రచారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం మహబూబ్ నగర్ కు మాత్రం దూరంగానే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జే.ఏ.సి మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపిందని వార్తలు వచ్చాయి.

మొన్నటి తెలంగాణ ఉప ఎన్నికల్లో అయిదు చోట్ల టీ.ఆర్.ఎస్, మరొక చోట బీజేపీ గెలిచినట్టు బయటికి కనిపిస్తున్నా, ఆ గెలుపు వెనుక తెలంగాణా రాజకీయ జే.ఏ.సి ఒక అదృశ్యశక్తిలా ఉన్నదన్నది తిరుగులేని వాస్తవం.

తెలంగాణ ప్రజలందరూ అనేక దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నా, 2009 డిసెంబర్ కు పూర్వం ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం పరిమిత విజయాలనే సాధించింది. దీనికి ప్రధానంగా రెండు మూడు కారణాలు ఉన్నాయి:

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగతంగా బలహీనంగా ఉండటం, ప్రజల్లో తెలంగాణ కావాలని బలంగా ఉన్నా తెలంగాణ ఓటు కాంగ్రెస్, తెదేపాల మధ్య చీలిపోతుండటం, తటస్థుల ఓట్లు టీ.ఆర్.ఎస్ కు పడకపోవడం వంటివి.

జే.ఏ.సి ఉద్యమంలో క్రియాశీలకంగా మారడం వల్ల కొన్ని లాభాలు కలిగాయి. మామూలుగా రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి ఉండని ఉద్యోగులు, విద్యార్ధులు, విద్యాధికులు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి జే.ఏ.సి దోహదపడింది.

టీ.ఆర్.ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసి పార్టీల పట్ల తెలంగాణ ప్రజల్లో ఒక సానుకూల వైఖరి రావడానికి కూడా జే.ఏ.సినే కారణం.

ఇక ప్రపంచంలో ఎక్కడైనా ఏ పార్టీకి చెందని తటస్థులు ప్రతి నియోజకవర్గంలో 25% వరకూ ఉంటారని అంచనా. తెలంగాణలో కూడా ఏ పార్టీకి చెందని వారు అదే మొత్తంలో ఉంటారు. ఇవ్వాళ ప్రొఫెసర్ కోదండరాం వంటి ప్రజాస్వ్యామ్యవాది నేతృత్వం వహిస్తున్నాడు కాబట్టే వీరంతా ఇప్పుడు జే.ఏ.సి ఎవరికి చెబితే వారికి ఓటు వేసే దశకు చేరుకున్నారు.

జే.ఏ.సి పిలుపునందుకుని అనేక ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు. అదే పిలుపు ఒక రాజకీయ పార్టీ ఇస్తే ఇంతటి స్పందన ఉండేది కాదు.

గతంలో ఒక సారి ట్యాంక్ బండ్ పై మానవహారానికి జే.ఏ.సి పిలుపునిస్తే కొన్ని వందల ప్రజా సంఘాలు తరలి వచ్చాయి. అందులో వామపక్ష ప్రజా సంఘాల నుండి మొదలుకొని ఉద్యోగ సంఘాలు, విద్యార్ధి సంఘాలు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ముస్లిం ప్రజా సంఘాలు, ఎన్.జీ.వోలు, న్యాయవాదులు, డాక్టర్లు, మెడికోలు…ఒకరేమిటి సమస్థ తెలంగాణ సమాజ ప్రతినిధులు తరలివచ్చారు. మిలియన్ మార్చ్ రోజు కూడా అదే జరిగింది.

కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అయినా, బీజేపీ అయినా ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఇది తమ గెలుపే అనుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది.

తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక ను ఏర్పాటు చేసి పదకొండేళ్లుగా మడమ తిప్పకుండా ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తున్నది తెలంగాణ రాష్ట్ర సమితి , దాని అధ్యక్షుడు కే.సి.ఆర్ నాయకత్వపటిమ వల్లనే ఉద్యమం ఇంత స్థాయికి చేరుకున్నదన్న దానిలో ఎవరికీ సందేహం లేదు. కానీ మన గమ్యం అయిన రాష్ట్ర సాధన జరగాలంటే దానికి ప్రజలందరి ఆమోదం ఉన్న రాజకీయ జే.ఏ.సి వంటి విస్తృత వేదిక ఆవశ్యకత మాత్రం ఉన్నది.

తెలంగాణ ఉద్యమాన్ని సార్వజనీనం చేసింది తెలంగాణ రాజకీయ జే.ఏ.సి. రాష్ట్రం ఎప్పుడొస్తుందో తెలియక దిగులుచెందుతున్న కోట్లాదిమందికి చీకట్లో చిరుదివ్వెలా కనపడుతున్నది రాజకీయ జే.ఏ.సి.

ప్రత్యర్ధుల దాడులెన్ని చేసినా ఇవ్వాళ ఉద్యమం చెక్కుచెదరలేదంటే కారణం రాజకీయ జేయేసి అన్న ఉక్కు కవచమే అని రాజకీయ పార్టీలు మరువరాదు.

జే.ఏ.సిలో కొనసాగడం అటు తెలంగాణకు, ఇటు తమ పార్టీ భవిష్యత్తుకు మంచిదని గ్రహించడం ఇరుపార్టీలకు మంచిది. విడిగా చూస్తే జే.ఏ.సి బలం కనపడకపోతుండవచ్చు. కానీ అది త్రాసులో తులసిదళం వంటిదన్న నిజం మాత్రం టీ.ఆర్.ఎస్, బీజేపీలు మరువరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *