mt_logo

వాషింగ్టన్ రాష్ట్రం సియోటెల్ నగరంలో ఘనంగా తెలంగాణ తీన్మార్

ఈ నెల్ 11వ తారీకున వాషింగ్టన్ రాష్ట్రంలోని సియోటెల్ నగరంలో 2వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ తీన్మార్ పేరుతో వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పూర్తిగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పూర్తిగా తెలంగాణ కళాకారులతో ఉర్రూతలూగించే తెలంగాణ ఆటా పాటలతో సభ మొత్తం దద్దరిల్లింది.

సాయంత్రం ఆరు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో, జయ జయహే తెలంగాణ గీతంతో సభ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన కవి గాయకుడు గోరటి వెంకన్న, మాట్ల తిరుపతి, తేలు విజయ, మాటకారి మంగ్లి, యువ సంగీత దర్శకుడు కార్తీక్‌లు తమ మాట ముచ్చట్లతో, ఆట పాటలతో ప్రేక్షకులకు తెలంగాణ గ్రామీణ వాతావరణం, ఉద్యమ  నేపథ్యం, అభివృద్ధిలో తెలంగాణం మల్లోకసారి యాదికి తెచుకున్నరు. స్టేజి మీద కాకతీయ కళా తోరణంతో సభకు పూర్తి నిండుదనం వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ మీద మాట్ల తిరుపతి, సంక్షేమ కార్యక్రమాల మీద గోరటి వెంకన్న మాట పాటకు, తేలు విజయ బతుకమ్మ పాటకు, కార్తిక్ సంగీత విభావరికి ప్రేక్షకులు చప్పట్లతో కళాకారులను ఉత్తేజ పరిచారు.

బంజారా సంస్కృతి సంప్రదాయాల్ని గొప్పగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న మాటకారి మంగ్లి మాటలకు సంతోషపడి ఆమెతో ఫోటోలు దిగటానికి ఇండియా నుండి అమెరికా వచ్చిన పెద్దలతో పాటు, అమెరికాలో పుట్టి పెరిగిన తెలంగాణ పిల్లలు ఉత్సాహం చూపారు.

సుమారు 1000 మంది ఈ సభకు హాజరయిన నేపథ్యంలో వాటా సంస్థ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసారు. ఈ సభలో పూర్తిగా తెలంగాణ వాతావరణం కోసం కష్టపడ్డ కవులను, గాయకులను, వాటా ఈసీ మెంబర్స్, వాలంటీర్స్ చేసిన కృషిని ప్రేక్షకులు తమ హర్శద్వానాలతో అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *