ఐదేండ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ ప్రగతి: కోటి ఎకరాల మాగాణం దిశలో ప్రయాణం

  • March 2, 2020 4:43 pm

By: శ్రీధర్ రావు దేశ్ పాండే,
(ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకాధికారి)

ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్ రావు స్మారకోపన్యాసం (27 ఫిబ్రవరి, 2020)

ఐదేండ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ ప్రగతి: కోటి ఎకరాల మాగాణం దిశలో ప్రయాణం  

ఉపోద్ఘాతం:
ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్ రావు స్మారక ఉపన్యాసం మీరు ఇవ్వాలని ప్రొఫెసర్ రేవతి గారు ఫోన్ చేసి అడిగినప్పుడు సంతోషపడినాను. జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవమనే భావన కలిగింది. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ళలో జనార్ధన్ రావు గారి ఉపన్యాసాలు కొన్ని విన్నాను. పత్రికల్లో వ్యాసాలు చదివాను. తెలంగాణ ప్రాంతం పరాయీకరణకు గురి అవుతున్న పరిస్థితులను, అంతర్గత వలస దోపిడీని విశ్లేశిస్తూ ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు, వ్యాసాలు మాలాంటి ఉద్యమ కార్యకర్తలకు ఆయుధాలను అందించాయి. తెలంగాణతో పాటు, ఆదివాసీల పరాయీకరణపై ఆయన చేసిన పోరాటాలు అనితరసాధ్యమైనవి. తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రంగా ఏర్పడితే తప్ప పరాయీకరణ నుంచి, అంతర్గత వలస దోపిడీ నుంచి తెలంగాణ విముక్తం కాదని జనార్ధన్ రావు గారు బలంగా నమ్మి రాజకీయ కార్యారణకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ఆయన చొరవ కూడా ఉందని మిత్రులు చెప్పారు. నీళ్ళు నిధులు నియామకాల్లో సామాజిక న్యాయం పునాదిగా తెలంగాణ వాదాన్ని నిర్మించడంలో, విస్తృతంగా ప్రచారం చేయడంలో జనార్ధన్ రావు విశేష కృషి చేసారు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆదివాసీల ఉన్నతి కోసం ఆయన పడిన తపన మనం అందరం స్మరించుకొని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకపోవాల్సి ఉన్నది. ఆ లక్ష్యం కోసమే ఆయన స్మారకోపన్యాసాలను ఏర్పాటు చేస్తున్నారని నేను భావిస్తున్నాను.    

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు అయ్యింది. జనార్ధన్ రావు గారి ఆశయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన అన్న ప్రధానమైన ఆశయం నెరవేరింది. తెలంగాణ పరాయీకరణ నుంచి, అంతర్గత వలస దోపిడీ నుంచి తెలంగాణ విముక్తం అయ్యిందా? అయ్యే దిశలో ప్రయాణిస్తున్నదా ? అన్నవి కీలక ప్రశ్నలు.  ప్రొ. రేవతి గారు సాగునీటి రంగంలో సమస్యలు, సవాళ్ల గురించి, తెలంగాణ సాధించిన అభివృద్ది మాట్లాడమని చెప్పారు. నా ఉపన్యాసంలో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సాగునీటి రంగం స్థితిగతులు. రెండు –  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగునీటి రంగంలో ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు, సాధించిన అభివృద్ధి. మూడు –  సాగునీటి ప్రాజెక్టుల ప్రభావాలు.  

మీ అందరికి తెలుసు.. వర్తమాన తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్  లైన్ “నీళ్ళు – నిధులు – నియామకాలు”. 1969 ఉద్యమంలో ఉద్యోగాల దోపిడి, నిధుల దోపిడి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అందుకే ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించినారు. వారికి తోడుగా తెలంగాణ బుద్దిజీవులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆనాటికి నీరు ఒక అంశంగా ముందుకు రాలేదు. గ్రామాల్లో చెరువులు ఇంకా కళకళలాడుతూ ఉన్నాయి. వ్యవసాయ సంక్షోభం ఇంకా రైతాంగాన్ని తాకలేదు. వ్యవసాయ సంస్కృతిలో బతుకుతున్న సబ్బండ వర్గాలు ఇంకా ఆ సంక్షోభానికి గురికాలేదు. తెలంగాణలో అనాదిగా కొనసాగుతున్న స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంక బతికే ఉన్నది. వృత్తి కులాలకు, వ్యవసాయ కూలీలకు బతుకు తెరువు గ్రామాల్లో దొరికే పరిస్తితి ఉన్నది. అందుకే గ్రామాల్లో ఉన్న విశాల ప్రజానీకానికి ఉద్యమ చైతన్యం చేరలేదు. ఒక అగ్ని పర్వతంలా ఎగిసిన ఉద్యమం 9 నెలలు తెలంగాణను స్తంభింపజేసింది. అయితే రాజకీయ నాయకత్వపు విద్రోహానికి ఉద్యమం కుప్పకూలిపోయింది. అది మళ్ళీ పునర్జీవనం పొందడానికి 25 ఏండ్లు పట్టింది. ఈ 25 ఏండ్లలో తెలంగాణలో గుణాత్మకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఆర్థిక, సాంస్కృతిక జీవనానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ విధ్వంసం అయ్యింది. చెరువులు, మోటబావులు ఎండిపోయినాయి. చెరువుల నిర్వహణను సీమాంధ్ర వలస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. చెరువులు  పూడికలతో నిండిపోయి కబ్జాలకు గురి అయినాయి. తెగిపోయిన మట్టి కట్టలను పునరుద్దరించలేదు. కూలిపోయిన తూములను మరమ్మతులు చేయలేదు. చెరువులకు నీటిని తీసుక వచ్చే కట్టు కాలువలు, వాగులు ఆక్రమణలకు గురి అయితే పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రభుత్వాల సాగునీటి పాలసీ అంతా కూడా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలను నెరవేర్చేందుకే ఉద్దేశించబడింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణానికే పెద్ద పీట వేసి తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన మైనర్ ఇర్రిగేషన్ ని నిర్లక్ష్యం చేసినారు. నిజానికి మైనర్ ఇర్రిగేషన్ తెలంగాణకు మేజర్ ఇర్రిగేషన్ అన్న స్పృహ సీమాంధ్ర పాలకులకు లేనేలేదు. 

1996 లో వర్తమాన తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకునే సమయానికి తెలంగాణ గ్రామాలు వల్లకాడుల్లాగా మారిపోయినాయి. రైతుల ఆత్మహత్యలకు నిలయమైనాయి. వేల సంఖ్యలో గ్రామీణ ప్రజలు బతుకు తెరువు వెతుక్కుంటూ పట్నాలకు, దూరప్రాంతాలకు కూలీలుగా వలసబోయినారు. భూమి ఉన్న చిన్న సన్న కారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, వృత్తి కులాలవారు ఈ వలస ప్రజల్లో ఉన్నారు. సాగునీటి సదుపాయం లేదు. ప్రభుత్వ పరపతి లేదు. అదే సమయంలో ప్రపంచీకరణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు తెలంగాణను చితక్కొట్టినాయి. తెలంగాణ ఉద్యమ చైతన్యంలో నీటి దోపిడి అనివార్యంగా ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. తలాపున గోదావరి కృష్ణా నదులు పారుతున్నా తెలంగాణకు ఈ నీటి గోస ఎందుకు? అన్న ప్రశ్న గ్రామీణ ప్రజలను తట్టి లేపింది. నీటి దోపిడి అంశం ఉద్యమానికి విశాల ప్రజానీకం మద్దత్తు కూడగట్టింది. ఈ ప్రజా పునాది కారణంగానే ఉద్యమం సుధీర్గ కాలం మనగలిగింది. రాజకీయ నాయకత్వాన్ని మెడలు వంచి తన వైపు నిలబెట్టుకోగలిగింది. అంతిమంగా విజయాన్ని అందుకోగలిగింది.

విలీనానికి పూర్వం సాగునీటి రంగం:
1956 కు పూర్వం నిజాం ప్రభుత్వం , హైదారాబాద్ సంస్థాన  ప్రభుత్వం తెలంగాణలో అనేక భారీ, మద్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులను నిర్మించింది. మనకు  అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 20వ శతాబ్దం ఆరంభం నాటికి తెలంగాణలో 21000 చెరువులు, వాటి కింద 8 లక్షల ఎకరాలు సాగులో ఉండేవి. 1956 లో విలీనం నాటికి అవి 33000 లకు పెరిగి వాటి కింద 12 లక్షల ఎకరాలు సాగులో ఉండేవని తెలుస్తున్నది. 1930నాటికే నిజాం ప్రభుత్వం అనేక మేజర్, మీడియం ప్రాజెక్టులను నిర్మించింది. ఘన్ పూర్ ఆనకట్ట (మెదక్ జిల్లా), డిండి ప్రాజెక్టు, పెండ్లిపాకల (నల్గొండ జిల్లా), వైరా, పాలేరు ప్రాజెక్టులు (ఖమ్మం జిల్లా), శనిగరం, అప్పర్ మానేరు (కరీంనగర్ జిల్లా), రాయని పల్లి, సింగభూపాలం, కోయిల్ సాగర్, సరళాసాగర్ (మహబూబ్ నగర్ జిల్లా), సదర్మాట్, స్వర్ణ, కడెం (ఆదిలాబాద్ జిల్లా), నిజాంసాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా), ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మీరాలం చెరువు (హైదారాబాద్ జిల్లా). ఇవికాక నిజాం ప్రభుత్వం గోదావరి పై 400 టీఎంసీల పోచంపాడు (కుష్టాపురమ్) ప్రాజెక్టును, 350 టీఎంసీల ఇచ్చంపల్లి ప్రాజెక్టును, మంజీరా నదిపై 38 టీఎంసీల దేవనూరు ప్రాజెక్టును, కృష్ణా నదిపై 132 టీఎంసీల నందికొండ ప్రాజెక్టును, 54.4 టీఎంసీల అప్పర్ కృష్ణా ప్రాజెక్టును, తుంగభద్ర నదిపై 65 టీఎంసీల తుంగభద్ర ఎడమ కాలువ, రాజోలి బండ మళ్ళింపు పథకము, భీమా నదిపై 100 టీఎంసీల భీమా ప్రాజెక్టును ప్రతిపాదించింది. మొత్తంగా 1365 టిఎంసీల కృష్ణా గోదావరి జలాలను వినియోగించుకొనేందుకు ప్రతిపాదనలు ఉన్నవి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో కొన్ని ప్రాజెక్టులను లిస్టులోంచి తొలగించారు. కొన్నింటి సామర్థ్యాన్ని కుదించారు. మరికొన్నింటిని సుషుప్తావస్థలో ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తరువాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ తీవ్ర వివక్షకు లోనైంది. ఆ వివరాలు కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణలో ప్రాజెక్టులు ప్రారంభమై ఏళ్ళు గడుస్తున్నా పూర్తికాని పరిస్తితి కనబడుతున్నది. నీటి కేటాయింపులు కాగితాలకే పరిమితం అయినాయి.

పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు):
400 టిఎంసీల నిలువ సామర్థ్యంతో, తెలంగాణలోని ఏడు జిల్లాలలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసిన ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత 112 టీఎంసీలకు కుదించబడింది. 9 లక్షల ఎకరాలకు నిర్మాణం జరిగింది. కాల క్రమేణా నిలువ సామర్థ్యం 86 టీఎంసీలకు పడిపోయింది. 9700 క్యూసెక్కుల ప్రవాహాన్ని మోసుకుపోవలసిన కాకతీయ కాలువ అతి కష్టం మీద 6000 క్యూసెక్కులు తీసుకువెళ్ళుతున్నది. మొదటి దశ ఆయకట్టుకే నీరు సరిపోవడం లేదు. రెండో దశ కాలువలు తవ్వి పెట్టినా నీళ్ళు రాని పరిస్తితి. 1964లో ప్రారంభమయిన ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణం ఇంకా దేకుతూనే ఉన్నది. 1990లో ప్రారంభమైన శ్రీరాంసాగర్ కాలువ పూర్తి అయినా, మిడ్ మానేరు లాంటి బ్యాలెంసింగ్ జలాశయాలు పూర్తి కాక పోవడంతో వరద కాలువ ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. గత  ప్రభుత్వాల  నిర్లక్ష్య వైఖరి వల్ల,  సుప్రీంకోర్టులో వాదనా వైఫల్యాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా మహారాష్ట్ర బాబ్లీ బ్యారేజీని నిర్మించింది.

నందికొండ ప్రాజెక్టు (నాగార్జునసాగర్ ప్రాజెక్టు):
హైదారాబాద్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై నందికొండ వద్ద 132 టీఎంసీల నిలువ సామర్థ్యంతో నల్గొండ, ఖమ్మం జిల్లాలలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 1954లో ఆంధ్ర రాష్ట్రంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాలు చెరి 132 టిఎంసీలు వినియోగించుకోవడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ప్రతిపాదించినారు. కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి, 132 టిఎంసీలు ఎడమ కాలువ ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీరు అందించాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత ఎడమ కాలువకు 106.2 టీఎంసీలు మాత్రమే కేటాయించబడింది. ఈ కేటాయింపులు కూడా తరువాతి కాలంలో కాలువ అలైన్ మెంట్ మార్చడం ద్వారా, డిజైన్ లను మార్చడం ద్వారా 86 టీఎంసీలకు తగ్గించారు. ఒప్పందం ప్రకారం రెండు కాలువలు చెరి 132 టిఎంసీలు మోసుకుపోవలసి ఉండగా డిజైన్లలో వివక్ష కారణంగా అది సాధ్యం కాలేదు. కుడి కాలువ వెడల్పు 241 అడుగులు ఉండగా ఎడమ కాలువ వెడల్పు 95 అడుగులే పెట్టడం వివక్షకు తార్కాణం. ప్రతిపాదనల ప్రకారం ఎడమ కాలువ నల్లగొండ, ఖమ్మం జిల్లాలలోని ఆయకట్టుకు మాత్రమే నీరు అందించాలి. అయితే కాలువ నిర్మాణం జరిగే సమయంలో కుట్ర పూరితంగా కృష్ణా జిల్లాకు పొడిగించినారు. దీనివల్ల తెలంగాణ 43 టిఎంసీల కృష్ణా నది జలాలను తెలంగాణ  కోల్పోవలసి వచ్చింది.

రాజోలిబండ మళ్లింపు పథకం: 
1944లో కుదిరిన ఒప్పందం ప్రకారం కేసి కెనాల్ కు రాజోలి బండ కాలువకు తుంగభద్ర నీటిలో సమాన వాటా రావాలి. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్షా పూరితంగా పెట్టిన డిమాండ్ల కారణంగా కేసి కెనాల్ కు 39.9 టిఎంసీలు దక్కగా, రాజోలి బండకు 17.10 టిఎంసీలు (15.9 టిఎంసీలు మహబూబ్ నగర్ కు) మాత్రమే దక్కాయి. కేసి కెనాల్ ఆయకట్టును 2.78 లక్షల ఎకరాలుగా నిర్ధారించగా, రాజోలిబండ ఆయకట్టును 92,900 ఎకరాలుగా (87,000 ఎకరాలు మహబూబ్ నగర్ కు) నిర్ధారించారు. ఇది రాజోలిబండకు ఎదురైన మొదటి అన్యాయం. రాజోలిబండ నిర్మాణం జరిపేటప్పుడు ఏర్పాటు చేసిన పది తూముల్లో ఏడింటిని మూసివేసి మూడింటిని అట్లాగే తెరిచి ఉంచడం వల్ల రాజోలిబండకు న్యాయంగా దక్కవలసిన వాటా ఎప్పుడు దక్కలేదు. 15.9 టిఎంసీల తుంగభద్ర జలాలను మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ తాలుకాలలో 87,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన రాజోలిబండ కాలువ గత 15 సంవత్సరాల్లో సగటున 6.8 టిఎంసీలకు మించి దక్కలేదని రికార్డులు చెపుతున్నాయి. అదే సమయంలో 39.9 టిఎంసీలు వాడుకోవాల్సిన కేసి కెనాల్ సగటున 55 టిఎంసీలు ఉపయోగించుకున్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. సుంకేశుల అనకట్టను కేసి కెనాల్ ను ఆధునీకరించిన ప్రభుత్వం తెలంగాణలో కరువు ప్రాంతంగా మారిన మహబూబ్ నగర్ జిల్లాలోని పాత కాలువ రాజోలిబండను నిర్లక్ష్యం చేసింది. ఈ నిర్లక్ష్య వైఖరి , పక్షపాత వైఖరి కారణంగా మొన్నటికి మొన్న బృజేష్ కుమార్ ట్రిబ్యునల్ అసలు జాడ పతా లేని రాజోలి బండ కుడి కాలువకు 4 టిఎంసీలను కేటాయించడం జరిగింది. రాజోలిబండకు ఎడమ వైపున మహబూబ్ నగర్ జిల్లా , కుడి వైపున కర్నూల్ జిల్లా. రాజోలిబండ కుడికాలువ కోసం పట్టు బట్టి 4 టిఎంసీలు సాధించుకున్న ప్రభుత్వం సుంకేశుల బ్యారేజి నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రయోజనం కల్పించే ఎడమ కాలువను ఎందుకు డిమాండు చేయలేదు. ఇది వివక్ష కాదా?

జూరాల ప్రాజెక్టు:
బచావత్ ట్రిబ్యూనల్ సానుభూతితో 17.84 టీఎంసీలను కృష్ణా నదిపై జూరాల ప్రాజెక్టుకు కేటాయింపులు జరిపింది. జూరాల పూర్తి నిల్వ సామర్థ్యం 9.54 టిఎంసిలు, నికర నిల్వ సామర్థ్యం 5.83 టిఎంసిలు. అయితే చాలా కాలం పాటు ఎఫ్‌ఆర్‌ఎల్ దాకా భూసేకరణ జరపక పోవడం చేత జూరాలలో 5 టిఎంసీలకు మించి నింపడం సాధ్యపడ లేదు. 2009 వరకు ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలోని భూములకు నష్ట పరిహారం చెల్లించకపోవడం చేత జూరాల ప్రాజెక్టు ఈ నష్టాన్ని భరించవలసి వచ్చింది. తెలంగాణ ఉద్యమం కారణంగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఎఫ్ ఆర్ ఎల్ వరకు జలాశయాన్ని నింపుతున్నారు. 

1956 కు ముందు మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా జలాల్లో కేటాయింపులు 175 టిఎంసీలు. (భీమా-100, అప్పర్ కృష్ణా 56, తుంగభద్ర ఎడమ కాలువ పొడగింపు 19 టిఎంసీలు). విలీనం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా పొందిన కేటాయింపులు 53.74 టిఎంసీలు మాత్రమే. (రాజోలిబండ 15.9, జూరాల 17.84, భీమా ఎత్తిపోతల పథకం 20 టిఎంసీలు). కృష్ణా, తుంగభద్ర, భీమా, డిండి లాంటి పెద్ద నదులు ప్రవహిస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు మహబూబ్ నగర్ జిల్లాకు శాపంగా మారి దేశంలోనే అత్యధిక కరువు పీడిత 10 జిల్లాలలో ఒకటిగా మిగిలింది. తెలంగాణ ఒక రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే మహబూబ్ నగర్ జిల్లాకు ఈ దుర్గతి పట్టి ఉండేది కాదు.

ఇచ్చంపల్లి & పోలవరం ప్రాజెక్టులు:
ఇచ్చంపల్లి ప్రాజెక్టును దశాబ్దాలుగా అంతర రాష్ట్ర సమస్యలను చూపెట్టి కోల్డ్ స్టోరేజీలో పెట్టినారు. ఇచ్చంపల్లికి సమకాలీనమైన పోలవరం ప్రాజెక్టును మాత్రం అంతర రాష్ట్ర సమస్యలు, ముంపు సమస్యలు, పర్యావరణ సమస్యలు, కోర్టు కేసులు ఎన్ని ఉన్నా మొండిగా ప్రభుత్వం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. ఇచ్చంపల్లి తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి వివక్ష. పోలవరం ఆంధ్ర ప్రాజెక్టు కాబట్టి వల్లమాలిన ప్రేమ. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేసుకున్న గత ప్రభుత్వ పాలకులు తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టును సాధించలేకపోయినారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతున్న కారణంగా తాటిపూడి, పుష్కర, చాగల్ నాడు, వెంకటాపురం ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించింది. ఇచ్చంపల్లికి బదులుగా దేవాదులను తెలంగాణలో ప్రారంభించింది. దేవాదుల ఇంకా దేకుతూనే ఉన్నది. తాటిపూడి , పుష్కర, ఛాగల్ నాడు, వెంకటనగరం ఎత్తిపోతల పథకాలు పూర్తి అయి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాయి. 

రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి, పోలవరంకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన తాటిపూడి పుష్కర తదితర ఎత్తిపోతల పథకాలు పూర్తి అయి నిర్దేశిత ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నా, ఎన్ని అడ్డంకులు, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినాడు. మరి తెలంగాణ ప్రజల చిరకాల డిమాండ్ అయిన ఇచ్చంపల్లి మాత్రం ప్రారంభించలేదు. (విభజన తర్వాత మారిన పరిస్థితుల్లో, కఠినమైన పర్యావరణ, భూసేకరణ  చట్టాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చంపల్లికి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించక తప్పలేదు.) 

నిజాంసాగర్ & సింగూర్ ప్రాజెక్టులు:
నిజాంసాగర్ ప్రాజెక్టు మంజీరా నదిపై నిజాం ప్రభుత్వం తెలంగాణలో నిర్మించిన భారీ ఆనకట్ట. ఆనాటికి ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు. 2.75 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవలసిన ప్రాజెక్టు పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోయి 1.50 లక్షల ఎకరాలకు కూడా నీరివ్వలేకపోతున్నది. నిజాంసాగర్ కు సింగూర్ ప్రాజెక్టు నుంచి రావలసిన 8 టిఎంసిలు సక్రమంగా రాకపోవడం చేత నిజాం సాగర్ ఆయకట్టు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తమ స్వంత ఖర్చుతో భూగర్భ జలాలను తోడుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. సింగూర్ నుండి హైదారాబాద్ నగరానికి ఉన్న కేటాయింపులు 4 టీఎంసీలు, మంజీరా బ్యారేజీ నుండి 2 టిఎంసిలు మొత్తం కలిపి 6 టిఎంసిలు మాత్రమే. కానీ హైదారాబాద్ నగరంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన వలస కాలనీలకు తాగు నీరు అందించడానికి సింగూర్ నీటిని మొత్తంగా హైదారాబాద్ తాగునీటి అవసరాలకే ప్రభుత్వం కేటాయించింది. 

అలీసాగర్, గుత్పా ఎత్తిపోతల పథకాలను నిర్మించి 5 టీఎంసీల గోదావరి నీటిని శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి తరలించి కొంత న్యాయం చేసినప్పటికీ ఆ మేరకు కాకతీయ కాలువకు గండి పడింది. అట్లనే సింగూర్ నుంచి ఘన్ పూర్ ఆనకట్టకు కూడా సక్రమంగా నీరు అందకపోవడం చేత మేదక్ జిల్లాకు కూడా అన్యాయం జరుగుతున్నది. సింగూర్ ప్రాజెక్టును హైదరాబాద్ తాగునీటి కోసమే అంకితం చేయడం వల్ల మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. (తెలంగాణ ప్రభుత్వం ఈ స్థితిని మార్చి సింగూరు జలాశయం నుంచి సింగూరు కాలువ కింద ఆయకట్టుకు, ఘన్ పూరు ఆనకట్ట కింద ఆయకట్టుకు, నిజాం సాగర్ ఆయకట్టుకు నీరు అందిస్తున్నది.) 

చిన్న చెరువుల వ్యవస్థ విధ్వంసం:
తెలంగాణలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం నుంచి అనాదిగా సాగుతున్నది. చెరువుల కింద వ్యవసాయమే తెలంగాణలో జీవనాధారంగా ఉన్నది. కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లఖ్నవరం, ఘణపురం, బయ్యారం వంటి సముద్రాలను తలపించే చెరువులు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. వారి తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కూడా తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి వ్యవసాయ విస్తరణకు తోడ్పాటునందించారు. పటం చెరువు, హుసేన్ సాగర్, ఇబ్రాహీంపట్నం, ఉదయ సముద్రం, పానగల్లు, ధర్మసాగరం చెరువుల్లాంటివి తెలంగాణలో ఎన్నో. ప్రతి ఊరికి కనీసం ఒక్క చేరువన్న ఉండేది. ఒకటి కన్న ఎక్కువ చెరువులు ఉన్న ఊర్లు కూడా తెలంగాణలో అనేకం ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో అనాదిగా ఉన్న ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్లక్ష్యం చేసి విధ్వంసానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి పాలసీ సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే విధంగానే తయారయ్యింది. భారీ మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణం మీదనే దృష్టి కేంద్రీకరించడం వల్ల తెలంగాణలోని చెరువుల వ్యవస్థ నిర్వహణ పట్ల, వాటి అభివృద్ధి పట్ల వివక్ష చూపడం వల్ల పూడికలతో నిండిపోయి, గండ్లు పడిపోయి, కబ్జాలకు గురయి వేలాది చెరువులు కనుమరుగయ్యాయి. ఇప్పటికీ అనేక చెరువులు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. చెరువుల వ్యవస్థ విధ్వంసం వలన స్వయంపోషక గ్రామాలుగా పరిడవిల్లిన తెలంగాణ గ్రామాలు కరువు పీడిత గ్రామాలుగా మారినాయి. వలసలకు, ఆత్మహత్యలకు నిలయమైనాయి. వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. తెలంగాణ గ్రామాల నుంచి లక్షలాది మంది ప్రజలు, పొట్ట చేత పట్టుకుని, ముంబాయి, బివండి, అహ్మదాబాద్, సూరత్, మరియు గల్ఫ్ దేశాలకు వలస పోయినారు. చిన్ననీటి చెరువుల  కింద కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు ఉన్న 265 టిఎంసి లలో 90 టిఎంసి లకు మించి వాడుకునే పరిస్థితి లేదు.

తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన కృష్ణా గోదావరి జలాలు దక్కి ఉంటే , చిన్న నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి సక్రమంగా జరిగి ఉంటే తెలంగాణలో బతుకు చిత్రం భిన్నంగా ఉండేది. ఫజల్ అలీ కమీషన్ సిఫారసుల మేరకు తెలంగాణ ఒక రాష్ట్రంగా కొనసాగి ఉంటే నదీ జలాల్లో తన వాటాను తను వినియోగించుకొని ఉండేది. అనాది ఆధారాలైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను సక్రమంగా నిర్వహించుకుని ఉండేది. చిన్న చెరువులను మరింత అభివృద్ధి పరుచుకుని ఉండేది. ఫజల్ అలీ వ్యక్తం చేసిన అభిప్రాయం ఈ విధంగా ఉంది. 

When plans for future development are taken into account, Telangana fears that the claims of this area may not receive adequate consideration in Vishalandhra. The Nandikonda and Kushtapuram (Godavari) projects are, for example, among the most important which Telangana or the country as a whole has to be undertaken. Irrigation in the coastal deltas of these two great rivers however, also being planned. Telangana, therefore, does not wish to lose its present independent rights in relation to the utilization of the waters of the Krishna and Godavari.” (Para 377 of SRC Report, 1955)

విలీనం వలన తెలంగాణ ఆ అవకాశాన్ని కోల్పోయింది. వనరుల వినియోగంపై హక్కును కోల్పోయింది. అందుకే తెలంగాణ స్వయంపాలన కోరుకున్నది.

తెలంగాణలో సాగునీటి రంగ అభివృద్ది – ప్రభుత్వ ప్రణాళికలు:
జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కే‌సి‌ఆర్ నాయకత్వంలో తెలంగాణ  ప్రభుత్వం సాగునీటి రంగంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి పథకాలు రూపొందించింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని సవరించడానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నది. కృష్ణా, గోదావరీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసం పోరాటం ఒక ఎత్తు. ఆ నీటిని  వినియోగించుకునేందుకు ప్రాజెక్టులని కట్టుకోవడం మరొక ఎత్తు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ అంశంలో ఒక సంవత్సరం పాటు నిపుణులతో మేధోమథనం చేసి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా, ప్రాజెక్టుల్లో ఉన్నసాంకేతిక సమస్యలని, అంతర రాష్ట్ర సమస్యలని పరిష్కరిస్తూ, ఇతర అడ్డంకుల్ని తొలగిస్తూ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ / రీ డిజైన్ ని చేపట్టినారు. ఉద్యమ సమయంలో ముందుకు వచ్చిన డిమాండ్లను నెరవేర్చే క్రమంలో మరికొన్నికొత్త ప్రాజెక్టులను చేపట్టింది. 

60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో సాగునీటి  రంగంలో తెలంగాణ అనుభవించిన వివక్ష కారణంగా జరిగిన నష్టాన్ని పూరించవలసిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. సాగునీటి రంగం అభివృద్ది మీదనే తెలంగాణ పునర్నిర్మాణం ఆధారపడి ఉన్నదన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. తెలంగాణలో వ్యవసాయాభివృద్ది జరిగితే తెలంగాణలో ప్రజల వలసలు ఆగిపోతాయి. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. వ్యవసాయం పుంజుకుంటే గ్రామంలో అనేక వృత్తి కులాలు బతుకుతాయి. వ్యవసాయాభివృద్దికి ప్రభుత్వ పరపతి సహాయం పెరగాలి. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు లభించాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమృద్దిగా దొరకాలి. పంటలకు నిలువ మరియు మార్కెట్ సౌకర్యం ఉండాలి. అయితే సాగునీటి సరఫరా జరగకుండా పైవన్నీ అందుబాటులో ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం సమసిపోదు. అందువలన అన్నింటికన్న అత్యంత కీలకమైనది సాగునీటి సరఫరా. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు గంపెడు ఆశలు ఉన్నాయి. ప్రజలకు ఏమి కావాలి? ప్రతి ఊరికి కనీసం ఒక సాగునీటి వనరు, ఒక తాగునీటి వనరు కావాలి. అది ఎట్లా సాధ్యమో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 

జలయజ్ఞం ఫైఫల్యాలు – ప్రభుత్వ సమీక్ష:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2005 లో  జలయజ్ఞం లో భాగంగా తెలంగాణలో 19 భారీ ప్రాజెక్టులని, 12 మధ్యతరహా ప్రాజెక్టులని, 2 ప్రాజెక్టుల అధునీకీకరణ (నిజాంసాగర్ & నాగార్జునసాగర్), వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి కరకట్టల నిర్మాణం ప్రతిపాదించి  ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ఏర్పడే దాకా అంటే జూన్ 2014 వరకు వీటిల్లో మూడే ప్రజెక్టులు పూర్తి అయినాయి. అవి నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన అలిసాగర్ ఎత్తిపొతల పథకం, అర్గుల రాజారాం గుత్పా ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన గడ్డెన్నవాగు (సుద్దవాగు) మధ్యతరహాప్రాజెక్టు. గడ్డెన్న వాగు డ్యాం పనులు పూర్తి అయినాయే తప్ప కాలువలు పూర్తి కాలేదు. ముంపు గ్రామాల నష్టపరిహారం, పునరావాసం పూర్తికానందున డ్యాం నిర్మాణంపూర్తి అయినా ఎఫ్ ఆర్ ఎల్ వరకు నీటిని నింపడం సాధ్యం కాలేదు. కాలువలు పూర్తి కానందున ఆయకట్టుకు నీరందించలేకపోయినారు. ఇక మిగతా ప్రాజెక్టులు 10 సంవత్సరాలు గడిచినా అనేక సమస్యల్లో కూరుకుపోయి నత్తనడక నడిచినాయి. భూసేకరణ జరగక, అటవీ అనుమతులు పొందక, రైల్వే, రోడ్డు క్రాసింగులను సమన్వయం చేయక, అంతర రాష్ట్ర సమస్యలను పరిష్కరించక, కాంట్రాక్టు చేపట్టిన ఏజెన్సీల ఒప్పంద సమస్యలు, బిల్లుల చెల్లింపులు, కేంద్ర జల సంఘం లేవనెత్తిన సాంకేతిక అంశాలపై నివేదికలు సమర్పించక, ప్రాజెక్టుల డిజైన్లను సకాలంలో పూర్తి చేయక ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. జలయజ్ఞం ప్రతిపాదిత లక్ష్యాలను అందుకోలేకపోయింది. వేల కోట్ల రూపాయలు ఖర్చుఅయినా ప్రాజెక్టులు ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకోలేకపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల స్థితిగతులను ఇంజనీరింగ్ నిపుణులతో కూలంకషంగా సమీక్షించింది. పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించందుకు అన్ని చర్యలు తీసుకున్నది.

1. జలయజ్ఞంలో ప్రాజెక్టులు నత్తనడక సాగడానికి భూసేకరణ అనేది ప్రధాన అవరోధం అని ప్రభుత్వం గుర్తించింది. ఈ అంశాన్ని వెంటనే పరిష్కరించకపోయినట్లైతే ప్రాజెక్టుల పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి ఉన్నత స్థాయిలో సమీక్షించింది. మేధోమధనం సాగించింది. ఆ మేధోమధనంలో నుంచే ల్యాండ్ ప్రొక్యూర్ మెంట్ పాలసీని ప్రకటించింది. జి.ఒ .123 తేదీ: 30.07.2015 ని ప్రభుత్వం జారీ చేసింది. జిల్లా స్థాయిలో ల్యాండ్ ప్రొక్యూర్ మెంట్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ భూ యజమానులతో, రైతులతో సంప్రదింపులు జరిపి వారు స్వచ్చందంగా భూమిని ప్రభుత్వానికి అప్పగించేందుకు సంసిద్దం చేస్తారు. ఈ జి.ఒ మంచి ఫలితాలనిచ్చింది. దశాబ్ద కాలంగా అవరోధంగా ఉన్నభూసేకరణ సమస్య సమసిపోయింది. బిట్లు బిట్లుగా ఉన్న భూసేకరణ జరిగింది. ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంది. జలయజ్ఞం పనులే కాదు మైనర్ ఇర్రిగేషన్ పనులు కూడా గాడిలో పడినాయి.

2. అటవీ శాఖతో ప్రతీ వారం అటవీ అనుమతులపై అటవీ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరగడానికి ఏర్పాట్లు జరిగినాయి. అటవీ అనుమతులు పొందడానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి అటవీ అనుమతులు పొందడానికి సమర్పించవలసిన సమాచారాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడినాయి.

3. రైల్వే శాఖ వారితో, రోడ్డు భవనాల శాఖతో ఉన్నత స్థాయి సమావేశాలు జరిగినాయి. ఆ తర్వాత వారితో నిరంతర చర్చలు జరిగినాయి. ఫలితంగా రైల్వే క్లియరెన్స్ లు, రోడ్డు క్లియరెన్స్ లు పొందడం పనులు ముందుకు సాగడం జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడివాగు ప్రాజెక్టు ఎడమ కాలువ పనులన్నీ పూర్తి అయినా రైల్వే క్రాసింగ్ పనులు పూర్తి కాకపోవడంతో దాని కింద ఉన్న 1700 ఎకరాలకు సాగు నీరు అందించలేకపోయినాము. ఈ సంప్రదింపుల ఫలితంగా మత్తడివాగు రైల్వే క్రాసింగ్ పనులు పూర్తి అయినాయి. ఈ ఏడు ఖరీఫ్ లో ఎడమ కాలువ కింద పూర్తి ఆయకట్టుకు నీరివ్వడానికి మార్గం సుగమం అయ్యింది. అట్లనే మహబూబ్ నగర్ నెట్టెంపాడు ప్రాజెక్టులో, దేవాదుల ప్రాజెక్టులో, ఎల్లంపల్లి ప్రాజెక్టులో రైల్వే క్రాసింగ్ పనులు పూర్తి అయినందున ఆ కాలువల కింద ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఏర్పడింది. రోడ్డు భవనాల శాఖతో నిరంతరం జరుగుతున్న సమన్వయం వలన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన రాయపట్నం హై లెవెల్ వంతెన నిర్మాణం పూర్తి అయినందున ఎల్లంపల్లిలో ఎఫ్ ఆర్ ఎల్ వరకు నీటిని నిల్వ చేసుకోవడానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. సింగూరు కాలువ ముంబాయి జాతీయ రహదారి క్రాసింగ్ కి అడ్డంకి తొలగిపోయింది.

4. 2005 లో ప్రారంభమైన జలయజ్ఞం ప్రాజెక్టులు పైన పేర్కొన్న వివిధ కారణాల వలన జాప్యం జరగడంతో అనివార్యంగా కాంట్రాక్టింగ్ సంస్థలు ధరల పెరుగుదలని అమలు చెయ్యమని డిమాండ్ చెయ్యడం ప్రారంభించినారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఈ రకమైన డిమాండ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు జలయజ్ఞం ప్రాజెక్టుల ప్యాకేజీలకు ధరల పెరుగుదలని అనుమతిస్తూ జి.ఒ నంబరు 13 ని జారీ చేసింది. అయితే రాజకీయ కారణాల వలన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేసినందున రాష్ట్రంలో గవర్నరు పాలన వచ్చింది. గవర్నరు జి.ఒ నంబరు 13 ని అమలుని నిరోధిస్తూ జి.ఒ1 ని జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యపై దృష్టి సారించక తప్పలేదు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ ఒక నెల పాటు మూడు నాలుగు సమావేశాలు నిర్వహించి జలయజ్ఞం పనులని ప్యాకేజీ వారీగా సమీక్షించింది. అధికారులు అందజేసిన సమాచారాన్ని విశ్లేశించింది. ప్యాకేజీల ప్రస్తుత కాంట్రాక్టులను రద్దు చేసి కొత్త రేట్లతో అంచనాలని తయారుచేసి టెండర్లు పిలవడం వలన ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారాన్ని, పనుల్లో కొత్త కాంట్రాక్టర్లతో ఏర్పడే సాంకేతిక సమస్యలని, ఒప్పందాల రద్దు వలన తలెత్తే న్యాయపరమైన వివాదాలను విష్లేశించింది. ధరల పెరుగుదలని అనుమతిస్తే పడే భారాన్ని అంచనా వేసింది. అన్నింటిని బేరీజు వేసిన తర్వాత ధరల ధరల పెరుగుదలని అనుమతించడమే అన్ని విధాలా శ్రేయష్కరమని సబ్ కమిటీ భావించి మంత్రి వర్గానికి సిఫారసులతో నివేదికను సమర్పించింది. మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసులని అమోదించిన తర్వాత జి.ఒ నంబరు 146 తేదీ 8.10.2015 ని ప్రభుత్వం జారీ చేసింది. ధరల పెరుగుదలని అనుమతించిన తర్వాత ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత కింద ఈ ఖరీఫ్ లో ఆయకట్టుకు నీరుఅందించాలనుకున్న మహబూబ్ నగర్ ప్రాజెక్టుల (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్) పనులు వేగవంతం అయినాయి. ఈ ఖరీఫ్ పంట కాలానికి పాక్షికంగా ఈ నాలుగు ప్రాజెక్టుల కింద నాలుగున్నర లక్షల కొత్త ఆయకట్టుకు నీరు అందించడానికి ఏర్పాట్లు జరిగినాయి. అట్లే ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం, గొల్లవాగు, నీల్వాయి, పి పి రావు, ర్యాలివాగు తదితర మధ్యతరహా ప్రాజెక్టుల్లో కూడా పాక్షికంగా ఆయకట్టుకు నీరు అందించడానికి ఏర్పాట్లు పూర్తి అయినాయి.

5. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాజెక్టులపై సమీక్షలు జరుపుతున్న క్రమంలో జలయజ్ఞంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల్లో సాంకేతిక అపసవ్యతలు, మరికొన్ని డిజైన్ల లోపాలు, నీటి లభ్యత, అమలులో ఎదురవుతున్న సమస్యలు, అంతర రాష్ట్ర సమస్యలు, వన్యప్రాణి కేంద్రాలు, బొగ్గు గనులు ప్రాజెక్టులకు అవరోధాలుగా మారనున్నయని ప్రభుత్వం గ్రహించింది. వీటిని రీ ఇంజనీరింగ్ చేస్తే తప్ప మరో పరిష్కారం లేదని ప్రభుత్వం భావించింది. గంటల తరబడి కొన్ని నెలల పాటు ముఖ్యమంత్రి స్వయంగా ఇంజనీరింగ్ నిపుణులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేషమై సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాపులు, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ సహాయంతో చర్చించిన అనంతరం ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి, ఖమ్మం జిల్లాలో చేపట్టిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్, ఎసారెస్పీ వరద కాలువ, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ ద్వారా కొత్త ప్రతిపాదనలని సిద్ధం చేయడం జరిగింది. వీటిని కూడ ప్రభుత్వం మరొక క్యాబినెట్  సబ్ కమిటీకి నివేదించింది. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ భాగంగా కొత్త బ్యారేజీలు, జలాశయాలు, పంపుహౌజ్ లు, టన్నెళ్ళు, కాలువలు నిర్మాణం చేయాలి. పాత జలాశయాల నిల్వసామర్థ్యం పెంచడం, పంపుల సామర్థ్యం పెంచడం… ఇట్లా ప్రాజెక్టుల స్వరూప స్వభావాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సబ్ కమిటీ రీ ఇంజనీరింగ్ వలన ఎదురయ్యే పలు సమస్యలని కూలంకషంగా చర్చించి ఎటువంటి న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా రీ ఇంజనీరింగ్ ప్రతిపాదనలని అమలు చెయ్యడానికి ప్రణాళిక సిద్దం చేసి మంత్రివర్గానికి నివేదించింది. ఈ ప్రతిపాదనలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

6. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కోసం పోరాటాన్ని కొనసాగించడం, కృష్ణా జలాల పున: పంపిణీ కోసం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు, సుప్రీంకోర్టు ముందు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ లోపున గత ప్రభుత్వాలు పరిపాలనా అనుమతులు ఇచ్చి అటకెక్కించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండీ ఎత్తిపోతల పథకాలని వరద జలాల ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు, డిండీ ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

సాగునీటి రంగ అభివృద్ధి వ్యూహాలు – పురోగతి:
తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉన్న పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనబడుతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తక్షణమే ఉద్యమ ఆకాంక్ష అయిన సాగునీటి రంగంపై దృష్టి సారించింది. పైన వివరించినట్టు ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం ఫైఫల్యాలను సమీక్షించుకొని ప్రాజెక్టులను పూర్తీ చేసుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకున్నది. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని సోర్సుల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు, మొత్తంగా రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు తయారు చేసుకున్నది. కృష్ణా గోదావరీ నదీ జలాల్లో తెలంగాణ వాటా సుమారు 1400 TMC ల నీటిని పూర్తిగా వినియోగంలోకి తేవాలని సంకల్పించింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం నాలుగంచల వ్యూహాన్ని అనుసరించింది.

1. తెలంగాణ గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు అనాది ఆధారాలుగా ఉన్న 46,500 చెరువులను దశల వారీగా పునరుద్దరించడం.

2. గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వలన పూర్తి కాకుండా పెండింగ్ లో పడిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, వాటిలో కొన్నింటిని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకొని పూర్తి చేసుకోవడం.

3. గత ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం.

4. గత ప్రభుత్వాల కాలంలో నిధులు లేక, నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురికాబడి శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం.

పైన వివరించిన నాలుగంచెల వ్యూహం ఈ ఐదేండ్ల కాలంలో ఎట్లా అమలు అయినదో, వాటి ఫలితాలు ఎట్లున్నవో సమీక్షించుకుందాం.

(1) మిషన్ కాకతీయ: చెరువుల పునరుద్దరణ 
చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మిషన్ కాకతీయ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం 20% చెరువులని రాజకీయాలకు అతీతంగా అన్నీ జిల్లాల్లో, అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అన్నీ మండలాల్లో మిషన్ కాకతీయ అమలు కావాలని ఇంజనీర్లకు ఆదేశాలిచ్చింది. స్థానిక ప్రజలను, ప్రజా పతినిధులను సంప్రదించి వారికి అవసరమైన చెరువులను పునరుద్దరణకు ఎంపిక చేయడం జరిగింది. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం మైనర్ ఇర్రిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసింది. జిల్లాకు ఒక సర్కిల్ (సూపరింటెండింగ్ ఇంజనీర్) కార్యాలయాన్ని, ప్రతీ రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక డివిజన్ (ఎగ్జిగ్యుటివ్ ఇంజనీర్) కార్యాలయాన్ని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ (డిప్యూటి ఎగ్జిగ్యుటివ్ ఇంజనీర్) కార్యాలయాన్ని, ప్రతీ మండలానికి ఒక సెక్షన్ (అసిస్టెంట్ ఎగ్జిగ్యుటివ్ ఇంజనీర్) కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున చెరువుల పునరుద్దరణ కార్యక్రమం కనుక మైనర్ ఇర్రిగేషన్ కు  ఇద్దరు చీఫ్ ఇంజనీర్లను నియమించింది. టెండర్ల ప్రక్రియను 90 రోజుల నుండి 15 రోజులకు కుదించడం జరిగింది. చెరువుల పునరుద్దరణ ఎస్టిమేట్లకు పరిపాలనా అనుమతులను వేగంగా మంజూరు చెయ్యడం జరిగింది. చెరువుల ఎంపిక దగ్గర నుంచి అమలు దాకా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పూడిక మట్టి పొలాల్లో చల్లుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై రైతాంగానికి అవగాహన కల్పించడం జరిగింది. వ్యవసాయ, రెవెన్యూ, అటవీ, మత్స్య, భూగర్భ జల శాఖల సేవలను ఈ కార్యక్రమంలో సమర్థవంతంగా వినియోగించుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఈ అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటిలను ఏర్పాటు చేసి ఆయా శాఖల పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సమన్వయ విధానాల కారణంగా మిషన్ కాకతీయ అమలు ప్రక్రియ వేగవంతం అయ్యింది. వేలాది మంది ప్రజలు, రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమం నిజమైన ప్రజా ఉద్యమంగా మారింది. రైతులు తమ స్వంత ఖర్చులతో పూడిక మట్టిని తరలించుకుపోయి తమ పొలాల్లో చల్లుకున్నారు. మెరుగైన దిగుబడి సాధించుకున్నారు. రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గింది. తెలంగాణ ప్రాంతంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మంచినీటి  చేపల ఉత్పత్తి చేస్తున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ చోటు సంపాదించింది. నాలుగేండ్లలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలు సాధించిన సంగతిని నాబార్డ్ వారి అధ్యయనం తేటతెల్లం చేసింది. దేశ వ్యాప్తంగా అందరి చేత ప్రశంసలు అందుకున్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్, దేశంలో వ్యవసాయ విప్లవానికి పితామహుడిగా పేరున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అరవింద్ పనగారియా లాంటి ప్రముఖులు మిషన్ కాకతీయను కొనియాడారు. సెంట్రల్ బోర్డ్ అఫ్ ఇర్రిగేషన్ & పవర్ (CBIP) వారు మిషన్ కాకతీయను ఉత్తమ పథకంగా ఎంపిక చేసి అవార్డును ప్రధానం చేసింది. మిషన్ కాకతీయ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఏ ఫలితాలను, ఏ మార్పులను ఆశించిందో అవి సాకారం అయినాయి. సెప్టెంబర్, 2019 మొదటి వారంలో ఇండోనేషియా బాలి ద్వీపంలో International Commission on Irrigation and Drainage వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో కూడా మిషన్ కాకతీయకు ప్రసంశలు లభించాయి. మిషన్ కాకతీయపై ప్రశంసా పత్రం ఆ సదస్సులో సమర్పించడానికి ఎంపిక కావడం విశేషం. 

మిషన్ కాకతీయ నాలుగు దశల పురోగతి:
మిషన్ కాకతీయలో మొదటి దశలో 7968 చెరువుల పునరుద్దరణ పూర్తి కాగా వాటి కింద 6.74 లక్షల ఎకరాలు, రెండవ దశలో 7842 చెరువుల పునరుద్దరణ పూర్తి కాగా వాటి కింద 5.40 లక్షల ఎకరాలు, మూడవ దశలో 3918 చెరువుల పునరుద్దరణ పూర్తి కాగా వాటి కింద 2.03 లక్షల ఎకరాలు, నాలుగవ దశలో 1742 చెరువుల పునరుద్దరణ పూర్తీ కాగా వాటి కింద 88 వేల ఎకరాలు, మొత్తం  నాలుగు దశల్లో కలిపి మొత్తం 21,436 చెరువుల కింద 15.05 లక్షల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. చెరువుల్లో 8.42 టి‌ఎం‌సిల నీటి నిల్వ సామర్థ్యం పునరుద్దణ జరిగింది. చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం నాలుగు దశల్లో 4,352 కోట్లు ఖర్చు చేసింది. చిన్న నీటి వనరుల అభివృద్ధి కోసం ఇన్ని నిధులు కర్చు చేయడం ఒక కొత్త చరిత్ర. 1.05 లక్షల ఎకరాలు చెరువుల కింద కొత్తగా సాగులోకి వచ్చాయి. 165 చిన్న నీటి ఎత్తిపోతల పథకాల కింద గడచిన నాలుగేండ్లలో కొత్తగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం, 27 వేల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించడం జరిగింది.

(2) పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి:
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత ప్రాజెక్టుల పెండింగ్ సమస్యలను విశ్లేషించింది. ప్రాజెక్టులు నత్తనడక సాగడానికి ప్రధాన అవరోధమైన భూసేకరణ సమస్యని పరిష్కరించి ల్యాండ్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ జి.ఒ 123 తేదీ 30.07.2015 ని ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత 2013 భూసేకరణ సవరణ చట్టాన్నిరూపొందించింది. ఈ చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. దశాబ్ద కాలంగా అవరోధంగా ఉన్నభూసేకరణ సమస్య సమసిపోయింది. ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకున్నాయి. రైల్వే శాఖ, రోడ్డు భవనాల శాఖల నుండి 11 ప్రాజెక్టుల క్రాసింగ్ లకు క్లియరెన్స్ లు పొందడంతో క్రాసింగ్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నవి. కేంద్రం నుంచి రావలసిన అటవీ, పర్యావరణ, ఇతర అనుమతులని సాధించడం జరిగింది. 

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో మహారాష్ట్రాతో పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంతర రాష్ట్ర వివాదాలను తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ముంబాయి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో చర్చించారు. ఈ చర్చల అనంతరం ప్రాణహిత, గోదావరి, పెన్ గంగా నదులపై ప్రాజెక్టులని నిర్మించుకోవడానికి మహారాష్ట్రాతో చారిత్రాత్మక ఒప్పందంపై  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేసారు. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరిని విడనాడి ఇచ్చి పుచ్చుకునే విధానం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నందు వలన ఈ ఒప్పందం దేశానికి ఆదర్శంగా మారింది. ఈ ఒప్పందం ఫలితంగా ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద, గోదావరిపై మేడిగడ్డ వద్ద, పెన్ గంగా నదిపై చనాక కోరాట వద్ద బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఈ బ్యారేజీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరంలో మేడిగడ్డ, చనాక కోరాట బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తి పోయడానికి పనులు ప్రణాళికాబద్దంగా జరుగుతున్నాయి.

ఈ ఐదేండ్లలో కల్వకుర్తి, డా. బి ఆర్ అంబేడ్కర్ ప్రాణహిత, కాళేశ్వరం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం), పాలమూరు రంగారెడ్డి, పెన్ గంగ కాలువ, చనాక కోరాట బ్యారేజీ, తుపాకులగూడెం, సీతారామా లాంటి కీలక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు సాధించడం చెప్పుకోదగిన విశేషం. గతంలో ప్రాజెక్టులకు అనుమతులు తేవడం ఓ ప్రహాసనం. అయితే  తెలంగాణ ప్రభుత్వం అనుమతులు సాధించే క్రమంలో కేంద్ర సంస్థలను పరుగులు పెట్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క సంవత్సరంలోనే 10 కీలక అనుమతులు పొందడం ఒక రికార్డు. 

ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని నెలల పాటు ఇంజనీరింగ్ నిపుణులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమై సర్వే ఆఫ్ ఇండియావారి మ్యాపులు, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ సహాయంతో అధ్యయనం చేసిన అనంతరం ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి, ఖమ్మం జిల్లాలో చేపట్టిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్, ఎసారెస్పీ వరద కాలువ, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసి, కొత్త ప్రతిపాదనలతో ప్రాజెక్టుల పనులను కొనసాగుతున్నాయి. 

ఈ ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం 12 పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసింది. మరో 11 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంది. వీటి ద్వారా కొత్తగా 16.65 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం, మరో 2.97 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ) ఎత్తిపోతల పథకాల కింద 2016-17 సంవత్సరంలో 4.5 లక్షల ఎకరాలకు, 2017-18 సంవత్సరంలో 6.50 లక్షల ఎకరాలకు, 2018-19 సంవత్సరంలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినందున, 700 పైబడి  చెరువులని నింపినందున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధ్భతమైన ఫలితాలు కానవస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పంట దిగుబడి రైతులకు వచ్చింది. జిల్లా నుంచి వలసలు ఆగిపోయినాయి. వలసలు వెళ్ళిన వారు స్వంత  ఊర్లకు తిరిగి వస్తున్నారు. జిల్లాలో ఒక స్పష్టమైన ఆర్ధిక, సామాజిక మార్పు కనబడుతున్నది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై చూపించిన శ్రద్ద వల్లనే సాధ్యమయ్యింది. 2018 సంవత్సరంలో మొదటిసారిగా కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. రాజోలిబండ డైవర్షన్ స్కీం  కింద 60 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి గత డిసెంబర్ లో ఆర్ డి ఎస్ కాలువలోకి నీటిని ఎత్తిపోయడం జరిగింది. 

సింగూరు కాలువలను పూర్తి చేసి మెదక్ జిల్లాలో 2017 లో 30 వేల ఎకరాలకు, 2018 లో 40 వేల ఎకరాలకు  సాగునీరు అందించడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాలో నీరివ్వడం ఇదే తొలి సారి.  

కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసం సమస్యలను పరిష్కరించి, రాయపట్నం బ్రిడ్జ్ ని నిర్మింపజేసి 20 టి‌ఎం‌సిల పూర్తి స్థాయి నిల్వ సాధించగలిగాం. ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా 25 వేల ఎకరాలకు, చెరువులను నింపినందున మరో 37,000 ఎకరాలు స్థిరీకరణ జరగింది. 2016 లో ఎస్.ఆర్.ఎస్.పి రెండవ దశ కాలువల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాలకు నీటిని తరలించి వందలాది చెరువులను నింపడం జరిగింది. 

ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 100 చెరువులను నింపడం, శ్రీరాంసాగర్ రెండో దశలో ఉన్న DBM-60 కాలువ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కాలువ కింద ఉన్న మొత్తం 58 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలేరు పాత కాలువను 4 నెలల్లో పునరుద్దరించి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. 

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మతు, ఆధునీకీకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవన పథకం పనులు కూడా వేగంగా పూర్తి అయినాయి.  కాళేశ్వరం నీళ్ళను వరదకాలువ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాశయానికి రివర్స్ పంపింగ్ చేయడానికి ఇంజనీర్లు ప్రాజెక్టును సిద్దం చేసినారు. శ్రీరాంసాగర్  నుంచి దిగువ మానేరు వరకు ఉన్న 5 లక్షల ఎకరాలకు, దిగువ మానేరు కింద  ఉన్న 4 లక్షల ఎకరాలకు, శ్రీరాంసాగర్ రెండో దశలో ఉన్న 4 లక్షల ఎకరాలకు, సరస్వతి కాలువ కింద 40 వేల ఎకరాలకు, లక్ష్మి కాలువ కింద ఉన్న 25 వేల ఎకరాలకు, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఒక లక్ష ఎకరాలకు, సదర్ మాట్ ఆనకట్ట కింద ఉన్న 15 వేల ఎకరాలకు 2019 నుంచి నికరంగా నీరు అందుతుంది. మిడ్ మానేరు జలాశయాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి 25 టి‌ఎం‌సిల నీటి నిల్వకు సిద్దం చేయడం జరిగింది. కాళేశ్వరం నీరు  మిడ్ మానేరుకు ఈ సంవత్సరం(2019) చేరినాయి కనుక మిడ్ మానేరు కింద 70,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. 

నాగార్జునసాగర్ లో లెవల్ కాలువ పంపు హజ్ పనులు పూర్తి అయిన కారణంగా 2018 లో అనేక చేరువులని నింపి చెరువుల కింద ఆయకట్టును కాపాడడం జరిగింది. LLC కింద 50,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతో కాలువ పనులు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం త్వరలోనే నీటి సరఫరాకు సిద్ధం అవుతున్నది. ఈ పథకంలో కీలకమైన బ్రాహ్మణ వెల్లెంల జలాశయం, పంప హౌజ్, సర్జ్ పూల్, టన్నెల్ నిర్మాణం పూర్తి అయినాయి. కాలువల తవ్వకం కొనసాగుతున్నది. త్వరలోనే ఈ ప్రాజేక్యు ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులను నింపడానికి, 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు మిగిలిన పనులు సాగుతున్నాయి.

(3) కాళేశ్వరం/పాలమూరు రంగారెడ్డి/డిండీ/సీతారామా ఎత్తిపోతలు:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2008 లో ప్రారంభమైనా తెలంగాణ ఏర్పడే నాటికి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు, అటవీ సమస్యలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు. ఇలా అనేక సమస్యల్లో కూరుకుపోయి ఈ ప్రాజెక్టు అటకెక్కింది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని కూలంకషంగా సమీక్షించింది. తొలుత మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేసింది. అయితే మహారాష్ట్ర తమ భూభాగంలో ముంపును అనుమతించలేమని, తుమ్మిడిహట్టి బ్యారేజి ఎఫ్‌ఆర్‌ఎల్ ని 152 మీల నుంచి 148 మీకు తగ్గించమని కోరింది. అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద 165 టి‌ఎం‌సిల నీటి లభ్యత మాత్రమే ఉందని, అందులో కూడా భవిష్యత్తులో పై రాష్ట్రాలు వాడుకునే 63 టి‌ఎం‌సి ల నీరు కలిసి ఉందని కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. తుమ్మిడిహట్టి వద్ద నుంచి తరలించగలిగే నీటి పరిమాణాన్ని పున:సమీక్షించుకొమ్మని ప్రాజెక్టు అధికారులకు సూచన చేసింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉందని, ప్రాజెక్టు అవసరాలకు తగినంత ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, మరికొన్ని కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలని కూడా కేంద్ర జల సంఘం సిఫారసు చేసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తెలంగాణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, నీటి ప్రవాహాలు తగ్గిపోయిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ ఆయకట్టుని స్థిరీకరించడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ అవసరమయ్యింది. గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వద్ద బ్యారేజిలు, పంపు హౌజ్ లు నిర్మించి రోజుకు 2 టి‌ఎం‌సిల నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లికి చేర్చడం, అక్కడి నుంచి మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ తదితర జలాశయాలకు నీటిని తరలించి 13 జిల్లాల్లో 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు, 26.76 లక్షల స్థిరీకరణకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. దీనికి తోడు హైదారాబాద్ నగరానికి, దారి పొడుగునా ఉన్న వందాలది గ్రామాలకు  తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. సుమారు 50 వేల మంది కార్మికులు, వందలాది మంది ఇంజనీర్లు ప్రాజెక్టు పనుల్లో శ్రమిస్తున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు  బ్యారేజీలు, పంప హౌజ్ , సర్జ్ ఫూల్స్, టన్నెళ్ళు, గ్రావిటీ కాలువలు, పైప్ లైన్లు , గేట్ల తయారీ, బిగింపు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ లైన్లు .. ఇట్లా ఏక కాలంలో ప్రాజెక్టుకి సంబందించిన అనేక పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1 & లింక్ 2 పనులని జూన్ నెలాఖరు కల్లా పూర్తి చేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు జలాశయానికి నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు 2019 లోనే  నీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. పంపుల వెట్ రన్ జయప్రదంగా పూర్తి  అయ్యింది. 2019 లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు కాళేశ్వరం నీరు సరఫరా అయ్యింది. శ్రీరాంసాగర్ రెండో దశ 4 లక్షల ఎకరాల  ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరిగింది. ఆయకట్టు పరిధిలో ఉన్న 600 పైగా చెరువులను కాళేశ్వరం నీటితో నింపడం జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న వరుస బ్యారేజిల వలన 150 కిమీ గోదావరి నది సజీవం కాబోతుంది. గోదావరి నదిలోనే 56 టి‌ఎం‌సిల నీటి నిల్వ ఉంటుంది. వ్యవసాయం, చేపల పెంపకం, టూరిజం, జల రవాణా, పరిశ్రమల స్థాపన వంటి రంగాలలో అనూహ్యమైన ఆర్థిక ప్రగతి జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్ ఇంజన్ లాగా మారబోతున్నది. నిజాం  హైదరాబాద్ రాజ్య పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ గా మార్చాలని కలగన్నాడు. నిజానికి దేశ స్వాతంత్య్రమునకు పూర్వమే హైదరాబాద్ రాజ్యం ఒక సమగ్రమైన గోదావరి వ్యాలీ అభివృద్ధి పథకాన్ని(Godavari Valley Development Plan) తయారు చేసింది. అమెరికాలోని టెన్నేసి వ్యాలీ అథారిటీ వారి అభివృద్ధి నమూనా ఈ అభివృద్ధి ప్లాన్ కు స్పూర్తిగా నిలచింది. ఈ పథకంలో డ్యాంలు,  జలాశయాలు, కాలువల వ్యవస్థ, జల విద్యుత్ మరియు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మించాలని సంకల్పించారు. ఆదిలాబాద్,  కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, పరిశ్రమల స్థాపనకు నీరు అందించాలని భావించారు. 1951 లో హైదరాబాద్ రాష్ట్ర  ప్రభుత్వం ప్రచురించిన Projects For Prosperity: The Story of Hyderabad’s Bid For Self-sufficiency through Irrigation and Power Projects” అన్న పుస్తకంలో గోదావరి  వ్యాలీ అభివృద్ధి ప్లాన్ ప్రతిపాదనల్ని సమగ్రంగా చర్చించారు. ఈ పుస్తక రచయిత శ్రీ సాదత్ అలీ ఖాన్. ఈ ప్లాన్ రూపొందించడంలో ఆనాటి ప్రజా పనుల శాఖా మంత్రి నవాబ్ జైన్ యార్ జంగ్ బహాదూర్, సెక్రెటరి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ కీలక పాత్ర పోషించారు. 1956 లో తెలంగాణ, ఆంద్ర ప్రాంతాల విలీనం అనంతరం తెలంగాణ సాగునీటి రంగం సంక్షోభంలోకి నెట్టబడింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాధాన్యతలు మారిపొయినాయి. ఆ క్రమంలో హైదరాబాద్ రాష్ట్రం రూపొందించిన గోదావరి వ్యాలీ అభివృద్ధి ప్లాన్ బుట్ట దాఖలు అయ్యింది. ఇప్పుడు 70 ఏండ్ల తర్వాత కాళేశ్వరం  ప్రాజెక్టు మరో రూపంలో “సమీకృత  గోదావరి వ్యాలీ అభివృద్ధి పథకం (Integrated Godavari Valley Development Plan)” గా మన ముందుకు వచ్చింది. వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, టూరిజం, పట్ణాణాభివృద్ది, పర్యావరణం, దేశీయ జల రవాణా తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణ సమగ్ర వికాసానికి దోహదం చేసే ఒక ప్రగతి రథంగా(Growth Engine) మారబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్దం అయ్యింది. ఇదంతా తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడినందు వల్లనే సాధ్యం అయిందనేది నిర్వివాదాంశం. 

మహబూబ్ నగర్ , రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం, ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు, తాగునీరు అందించడానికి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తోంది. రాబోయే రెండేండ్లలోఈ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. పాలమూరు ప్రాజెక్టుకు నిదులను సమకూర్చడానికి జాతీయ బ్యాంకులు, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు సమకూరుస్తున్నవి.

(4) ప్రాజెక్టుల ఆధునీకీకరణ:
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల కాలంలో తెలంగాణ ప్రాజెక్టులు దారుణమైన నిర్లక్ష్యానికి లోనై నిర్వహణ లేక కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయకట్టు సగానికి సగం పడిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. కాలువల్లో పూర్తి మోతాదులో డిస్చార్జ్ పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం తెలంగాణలో పాత సాగునీటి ప్రాజెక్టులను పునరుద్దరించాలని, ప్రాజెక్టుల్లో పెరిగిపోతున్న ఈ గ్యాప్ ఆయకట్టుని తగ్గించాలని సంకల్పించింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఘన్ పూర్ ఆనకట్ట కాలువల ఆధునీకీకరణ పనులని పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరందించడం జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకీకరణ కోసం ప్రభుత్వం 1000 కోట్లను నిధులను మంజూరు చేసింది. శ్రీరాం సాగర్ రెండో దశ కాలువల లైనింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేసింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. సదర్ ఘాట్ ఆనకట్ట ఆధునీకీకరణ, సాత్నాల, చెలిమేలవాగు, స్వర్ణ  ఆధునీకీకరణ పనులు పూర్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 ప్రాజెక్టుల ఆధునీకీకరణ కోసం ప్రధాన మంత్రి కృషి సీంచాయి యోజన పథకంలో ఒక భాగమైన Incentivization స్కీంలో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయానికి ప్రతిపాదించడం జరిగింది. 34 డ్యాముల పునరుద్దరణ కోసం DRIP (Dam Rehabilitation and Improvement Project) పథకంలో 675 కోట్ల అంచనా వ్యయం తో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయానికి ప్రతిపాదించడం జరిగింది. 

(5) సాగునీటి శాఖలో సంస్కరణలు: 
సాగునీటి శాఖలో ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాఖను పునర్ వ్యవస్థీకరించింది. కొన్ని కొత్త చీఫ్ ఇంజనీర్ల యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈపిసి కాంట్రాక్ట్ పద్దతిని, మొబిలైజేషన్ అడ్వాన్సులను రద్దు చేసింది. క్వాలిటి కంట్రోల్, డిజైన్స్ విభాగాలని పటిష్టం చేసింది. సాగునీటి శాఖలో అంచనాల అనుమతులు పొందే ప్రక్రియను సరళతరం చేసింది. వివిధ స్థాయిల్లో ఇంజనీర్ల అధికారాలను పెంచింది. ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా 4 విడతల్లో 600 పైగా సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్  జూనియర్ ఇంజనీర్ల నియామకాలు జరిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సంస్థలైన IIIT, IITH, BITS, ISRO, NABARD, ICRISAT తదితర సంస్థలతో MoU లు కుదుర్చుకుంది. సెక్రెటరియట్ లో  ఫైళ్ళ సత్వర పరిష్కారానికి ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ ని వినియోగించడం, మిషన్ కాకతీయ పథకాన్ని మొత్తంగా ఆన్ లైన్ లోనే పారదర్శకంగా  నిర్వహించడం, చెరువులన్నింటిని Geo Tagging చేయించడం జరిగింది. 

(6) ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం:
మిషన్ కాకతీయ విజన్ జయప్రదం కావాలంటే చెరువుల్లో కనీసం 10 నెలల పాటు నీరు నిలువ ఉండాలి. రెండు పంటలకు నీరు అందాలి. భూగర్భ జలాలు పైకి రావాలి. ఇందుకు చెరువులను భారీ మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేసినప్పుడే సాధ్యం అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్రంలో గత నాలుగేండ్ల పాలనా కాలంలో అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి చేసుకొని 2019 జూన్ / జూలై నెలల్లో నీరు సరఫరాకు సిద్దం అవుతున్నాయి. తెలంగాణకు జీవ ధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు 2019 లోనే అందుబాటులోకి రానున్నాయి. 2019 సంవత్సరాంతానికి మరిన్ని ప్రాజెక్టులు నీటి సరఫరా సిద్దం అవుతాయి. వీటిని చెరువులతో అనుసంధానం చేయడం ద్వారా చెరువులన్నీ రెండు పంటలకు నీరివ్వగలిగే స్థితి వస్తుంది. మైనర్ ఇర్రిగేషన్ కోసం గోదావరి బేసిన్ లో 165 tmc లు, కృష్ణా బేసిన్ లో 90 tmc లు, మొత్తం 255 tmc నీటిని పూర్తిగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేసారు. మొదటి దశలో ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి 3 వేల తూముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. అక్టోబర్ నెలాఖరు వరకు తూముల నిర్మాణం పూర్తి చేయాలని ప్రాజెక్టుల ఇంజనీర్లను ఆదేశించింది.

(7) వాగుల పునర్జీవన పథకం – చెక్ డ్యాంల నిర్మాణం:
చెరువుల అనుసంధానం తో పాటూ తెలంగాణ రాష్ట్రంలోని ఆన్ని ప్రధాన వాగులు, వంకలు పునర్జీవనం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తి అవుతున్న కారణంగా దాదాపు రాష్ట్రమంతా (కొన్ని ఎత్తైన ప్రాంతాలు మినహా) కమాండ్ ఏరియాగా మారబోతున్నది. ఈ ప్రాజెక్టుల ద్వారా భూములకు సాగునీరు అందుతుంది. వారి నుండి వచ్చే పడవాటి నీరు (Regenerated water) తిరిగి ఈ వాగుల్లోకి చేరుతాయి. వీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసుకోగలిగితే ఆ ప్రాంతాల్లో ఆ వాగులు పునర్జీవనం చెంది భూగర్భ జలాలు రీచార్జ్ కావడంతో పాటు అనేక రకాలుగా ఈ నీరు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంలోనికి రానున్నాయి. ఈ పడవాటి నీటిని, వర్షపు వొడిసి పట్టడానికి చెక్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ, పంచాయతిరాజ్ శాఖ వారు వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను చెక్ డ్యాంలతో సహా నిర్మించాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చినందున ఆ శాఖలు కూడా చెక్ డ్యాం ల నిర్మాణాలు చేపట్టినాయి. 

గౌరవ ముఖ్యమంత్రి సూచించిన ఈ రెండు కార్యక్రమాల అమలు కోసం సాగునీటి శాఖ విస్తృత అధ్యయనం చేసింది. సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాపులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (NRSA) వారి ఉపగ్రహ చిత్రాల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ విజయ్ ప్రకాశ్, కాడా కమీషనర్ మల్సూర్  నేతృత్వంలో ఇంజనీర్ల బృందం క్షేత్ర స్థాయిలో మైనర్ ఇర్రిగేషన్, ప్రాజెక్టుల ఇంజనీర్లతో సమాచార సేకరణ సేకరణ చేసి విశ్లేషణ జరిపినారు. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానికి సమగ్రమైన మార్గ నిర్దేశాలను తయారుచేసి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజనీర్లకు అందజేసినారు. ప్రతీ మండలానికి ఒక ఇర్రిగేషన్ చిత్రపటాన్ని రూపొందించి క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు అందజేయడం జరిగింది. తూముల నిర్మాణానికి, ఫీడర్ చానళ్ళ పునరుద్దరణకు అంచనాలు రూపొందించే పని జరుగుతున్నది. రాష్ట్రం మొత్తంలో ఉండే నదులను, వాగులను, వంకలను 8 స్థాయిల్లో (Orders) వర్గీకరించడం జరిగింది. 4 నుంచి 8 స్థాయి కలిగిన వాగులను పెద్ద వాగులుగా పరిగణించాలి. ఇవి రాష్ట్రంలో 683 ఉన్నట్టు, వాటి పొడవు 12,183 కిలోమీటర్లు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. పూర్తి అయిన  ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉండే వాగులపై ప్రథమ ప్రాధాన్యతలో చెక్ డ్యాం లను ప్రతిపాదించాలని సూచించడం జరిగింది. రెండవ దశలో ఒకటి రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోబోతున్న ప్రాజెక్టుల కమాండ్ ఏరియాల్లో ఉండే వాగులపై చెక్ డ్యాంలను ప్రతిపాదించాలని సూచించారు. మొదటి దశలో 1200 చెక్ డ్యాం ల నిర్మాణం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 వేల తూములు, 1235 చెక్ డ్యాం ల నిర్మాణానికి 4296 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జి.ఓ నంబరు 8 ని జారీ చేసింది. ఈ పనులు కొనసాగుతున్నాయి.

(8) ప్రాజెక్టుల నీటి నిర్వహణ / యాజమాన్యం: 
ప్రాజెక్టుల కాలువల కింద ఒక టి‌ఎం‌సి నీటికి ఎన్ని ఎకరాలు సాగు అవుతాయి? తరి పంటలకైతే 5 నుంచి 6 వేల ఎకరాలు, ఆరుతడి పంటలకైతే 10 వేల ఎకరాలు అనేది అందరికీ తెలిసిన జవాబు. కానీ ప్రపంచంలో నీటి నిర్వాహణలో అనేక సాంకేతిక పద్దతులు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక టి‌ఎం‌సికి 13 వేల ఎకరాల పైబడి తరి పంటలను, 15 వేల నుంచి 20 వేల ఎకరాల ఆరు తడి పంటలను పండించడం సాధ్యం అవుతున్నది. మెరుగైన నీటి యాజమాన్య పద్దతులు అమలు చేయడం, వరి సాగులో పంట కాలం తక్కువగా ఉండే వరంగల్, జగిత్యాల, శ్రీ వరి లాంటి వంగడాలని ప్రోత్సహించడం, ఆయకట్టులో మైక్రో ఇర్రిగేషన్ పద్దతులను అవలంభించే విధంగా రైతులను చైతన్య పరచడం, ఆరుతడి పంటలను, కూరగాయల సాగును ప్రోత్సహించడం, పూలు, పండ్ల తోటలను పెంచేందుకు ప్రోత్సహించడం తదితర చర్యల ద్వారా ఒక tmc కి 13 వేల ఎకరాలను సాగు చెయ్యడం అసాధ్యం ఏమీ కాదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో piped irrigation పద్దతిని అవలంభించి ఒక tmcకి 15 నుంచి 20 వేల ఎకరాల సాగు సాధిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్ కాలువల కింద వారాబంది (on&off), కింద నుంచి పైకి (Tail to Head) పద్దతులని సమర్థవంతంగా అమలు చేసినందున వరి పంటకే ఒక tmc కి 13 వేల ఎకరాలు సాగుబడి సాధ్యం అయింది. పంట దిగుబడి పెరిగింది. టెయిల్ టు హెడ్ పద్దతిన నీటి సరఫరా చేసినందువలన గత 20 ఏండ్లుగా ఎన్నడూ నీరు పారని చిట్ట చివరి భూములకు నీరు పారించగలిగినారు. ఎకరానికి 35 బస్తాలు వరి పండించే పరిస్థితి నుంచి ఎకరాకు 50 బస్తాలు పైచిలుకు వరి దిగుబడిని రైతులు  సాధించారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ & డ్రైనేజ్ వారు ఈ కృషిని గుర్తించి సెప్టెంబర్, 2019 లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పత్రాలు సమర్పించమని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లను ఆహ్వానించింది. 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఈ వినూత్న ప్రయోగం సఫలం కావడం శుభ సూచకం. గతంలో  రైతులు కూడా వరి పంటకు పొలంలో నిలువ నీరు ఉండాలన్న తప్పుడు అవగాహనతో ఉండేవారు. కాని ఆన్ & ఆఫ్ పద్దతిలో కూడా వరి పంట చేయవచ్చునని, అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. నీటి కొరత ఉన్న ఈ కాలంలో దుబారాను తగ్గించి పొదుపుగా వాడుకోవడం, నీటి నిర్వహణలో జోక్యం చేసుకోకుండా, కాలువలను తెగ్గొట్టకుండా క్రమశిక్షణ పాటించగలిగితే సాగునీటి ప్రాజెక్టుల్లో ఇంజనీర్లు చివరి భూములకు కూడా నీరు అందించడానికి కృషి చేస్తారు. అది వారు శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నిరూపించి చూపారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఎత్తిపోతల పథకాల నుంచి ఖరీదైన  నీటి సరఫరా జరుగుతుంది కనుక ఆయకట్టు రైతులు ఈ క్రమశిక్షణ పాటించాలి. ఇంజనీర్లు మెరుగైన నీటి నిర్వహణ పద్దతులను అవలంభించాలి. 

అదే సమయంలో భారీగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం ప్రభుత్వం సమగ్రమైన ప్రణాలికను తయారు చేస్తున్నది. 75 లక్షల ఎకరాలు ఎత్తిపోతల పథకాల కింద ఉన్నందున వీటి  నిర్వహణ కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నది. 

తలసరి నీటి నిల్వ పెరుగుదల:
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులకు అనేక కారణాలు ఉన్నప్పటికీ అడవుల నరికివేత ప్రధానమైన కారణంగా ముందుకు వచ్చింది. ఈ మార్పులు ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యావసాయిక దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మియాన్మార్ తదితర దక్షిణాసియా దేశాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు వర్షాకాలం నాలుగు నెలలు వర్షపాతం ఉండేది. ఇప్పుడు సగటు వర్షపాతంలో తగ్గుదల లేకపోయినా వర్షం కురిసే దినాలు సుమారు 25 నుంచి 30 రోజులకు పడిపోయింది. వర్షం నెల, నెలన్నర రోజులు అసలే కురువదు. కురిస్తే రెండు మూడు రోజుల్లో భారీ కుండ పోత వర్షం కురిసిపోతుంది. అనంతరం మళ్ళీ వర్షం పత్తా ఉండదు. ఈ దోబూచులాట మనం గత కొన్నెండ్లుగా చూస్తూనే ఉన్నాము. ఈ పరిస్థితి సంవత్సరం కూడా మన అనుభావంలోంకి వచ్చించి. జూన్, జూలై నెలల్లో వర్షం లేక కరువు పరిస్థితులను చూసాము. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తీవ్రమైన వర్షపాతం, నదుల్లో వరద భీభత్సం చూసాము. అక్టోబర్ నుంచి తిరిగి ఎండలు దంచి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఈ 25, 30 రోజుల్లో కురిసే భారీ వర్షపు నీటిని వొడిసిపట్టే జలాశయాలు దేశంలో తగినంత లేవు. ఈ కారణంగా దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంటున్నది. కరువులు – వరదలు – కరువులు ప్రతీ ఏడూ పునరావృతం అవుతున్నాయి. భారత దేశంలో తలసరి నీటి లభ్యత (Per Capita Water Availability), తలసరి నీటి నిల్వ సామర్థ్యం (Per Capita Storage Capacity) మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ . వివరాలు కింది పట్టికలో చూడవచ్చు.


పై పట్టికలోని సమాచారం ఆధారంగా విశ్లేశిస్తే..  సంవత్సరానికి తలసరి నీటి లభ్యత 1700 ఘనపు మీటర్లకు తగ్గితే అది నీటి ఒత్తిడికి (Water Stress) సూచిక. 1000 ఘనపు మీటర్లకు తగ్గితే అక్కడ నీటి సంక్షోభం (Water Scarcity) ఏర్పడిన దానికి సూచన. ఈ సూచికకు నాలుగింతల ఎక్కువగా రష్యాలో తలసరి నీటి లభ్యత, తలసరి నీటి నిల్వ ఉన్నది. ఈ కారణంగా రష్యా నాలుగేండ్ల వరుస కరువులను తట్టుకోగలుగుతుంది. అదే విధంగా ఆస్ట్రేలియా మూడేండ్ల వరుస కరువులను తట్టుకోగలుగుతుంది. భారత్ లో తలసరి నీటి లభ్యత, తలసరి నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్న కారణంగా 3, 4 నెలల కంటే మించి కరువును ఎదుర్కోలేదు. దేశంలోని అన్ని ప్రధాన నదులపై తగినంత నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు లేవు. గంగా, బ్రహ్మపుత్ర లాంటి అత్యధిక నీటి లభ్యత ఉన్న నదులపై కూడా తగినంత నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు లేవు. ఈ నీరంతా సముద్రంలోనికి వెళ్లిపోతున్నది. గంగా నదిలో ఏటా సుమారు 18,000 TMC (75 % విశ్వసనీయత) లు లభ్యమవుతాయి. తలసరి నీటి లభ్యత లెక్క గడితే అది 900 క్యూబిక్ మీటర్లు. బ్రహ్మ పుత్రా నదిలో ఏటా సుమారు 18,600 TMC ల నీటి లభ్యత ఉంటె తలసరి నీటి లభ్యత 12,000 క్యూబిక్ మీటర్లు. బ్రహ్మపుత్రా నది బేసిన్లో జనాభా గంగా బేసిన్ తో పోల్చినప్పుడు చాలా తక్కువ. అయితే దేశంలోనే అత్యధిక నీటి లభ్యత ఉన్న ఈ నదులపై తగినంత నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాల నిర్మాణం జరగక పోవడం చేత అపారమైన ఈ నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ రెండు నదులతో పోలిస్తే గోదావరి, కృష్ణా నదులు నీటి లభ్యత తక్కువ కానీ తలసరి నీటి నిల్వ సామర్థ్యం వీటి కంటే మెరుగ్గా ఉన్నది. 18,600 TMC నీటి లభ్యత ఉన్న బ్రహ్మపుత్రా నది పై నికర నిల్వ సామర్థ్యం( Live Storage Capacity) కేవలం 84.72 TMC లంటే నమ్మశక్యం కాదు. కానీ అదే నిజం. అదే విధంగా 18 వేల TMC ల నీటి లభ్యత ఉన్న గంగా నదిపై నికర నిల్వ సామర్థ్యం 1992.68 TMC లు. 4156 TMC ల నీటి లభ్యత ఉన్న గోదావరి నదిపై నికర నిల్వ సామర్థ్యం 1541 TMC లు. 3143 TMC ల నీటి లభ్యత ఉన్న కృష్ణా నదిపై నికర నిల్వ సామర్థ్యం 1920 TMC లు. గంగా నది కంటే కొద్దిగా తక్కువ. తగినంత నీటి నిల్వ సామర్థ్యం లేని కారణంగా  నాలుగు నెలల వర్షా కాలంలో గంగా, బ్రహ్మపుత్రా ఇతర ఉత్తర భారత నదులకు కరువులు-వరదలు-కరువులు పరిస్థితి ని ఎదుర్కోక తప్పటం లేదు. ఈ సంవత్సరం కూడా ఈ పరిస్థితి ఎదురయ్యింది. 

దేశంలో ఉన్న అన్ని ప్రధాన నదులపై తగినంత నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాల నిర్మాణం జరగనట్టయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల రాబోయే దశకాల్లో దేశం తీవ్ర నీటి సంక్షోభం, తద్వారా ఆహార భద్రతకు సంబందించిన సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుందని సాగునీటి రంగ నిపుణుడు, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ శ్రీ ఎ.బి పాండ్యా అభిప్రాయపడినారు. తెలంగాణ రాష్ట్రం ఈ అంశంలో సరి అయిన దిశలోనే ప్రయాణిస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేసే సమయంలో జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. వర్షాకాలం గడచిపోయిన తర్వాత మన నదుల్లో నీటి ప్రవాహాలు ఉండవు. ఆ సమయంలో మన వ్యవసాయ, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలను తీర్చేవి ఈ జలాశయాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో తగినంత నిల్వ సామర్థ్యం ఏర్పాటు చేయాలన్న అంశంపై దృష్టి పెట్టలేదు. ప్రాణహిత చేవెళ్లలో 16 TMC లు, కల్వకుర్తిలో 4 TMCలు, నెట్టెంపాడులో 11 TMCలు, భీమాలో 8.50 TMCలు,  దేవాదులలో 8 TMCలు, ఎఎం ఆర్ పి లో 13 TMC మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 141 TMCలు, పాలమూరు రంగారెడ్డి లో 68 TMCలు, డిండీ లో 25.56 TMC నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలను ముఖ్యమంత్రి ప్రతిపాదించడం జరిగింది. ఎక్కడ అనుకూలత ఉంటె అక్కడ జలాశయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి స్థలాల అన్వేషణ చేయాలని అధికారులను ఆదేశించినారు. కడెం నదిపై 5.36 tmc ల కుప్టి ప్రాజెక్టును ఆమోదించినారు. గోదావరిపై సదర్ మాట్, తుపాకులగూడెం ఆనకట్టల నిర్మాణం జరుగుతున్నది. కాళేశ్వరంలో భాగంగా మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ళ ఆనకట్టలు ఇప్పటికే  పూర్తి అయినాయి. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం కోసం మహారాష్ట్రాతో ఒప్పందం కుదిరింది. అక్కడ బ్యారేజి నిర్మాణం కోసం అధ్యయనం జరుగుతున్నది. చనాక కోరాటా బ్యారేజి లో పిప్పల్కోటి, గోమూత్రి జలాశయాలను ఆమోదించినారు. సీతారామ ప్రాజెక్టుకు నికరంగా నీటి సరఫరా కోసం దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంచి అక్కడ గోదావరి నదిపై నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి అధ్యయనం జరుగుతున్నది. దేవాదుల ప్రాజెక్టులో 10 TMC ల లింగంపల్లి జలాశయాన్ని ఆమోదించినారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్ లో ఉన్న జలాశయాల్లో సుమారు 500 TMC నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉన్నది. ఇవన్నీరాష్ట్రంలో తలసరి నీటి లభ్యతను, తలసరి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాడానికి దోహదం చేసేవి. ఈ అంశంపై అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చకు అనుకూలంగానే సాగుతున్న ప్రక్రియ ఇది. 

(9) సాగునీటికి బడ్జెట్ కేటాయింపులు/నిధుల సమీకరణ/నీటి కేటాయింపులు:
బడ్జెట్ లో సాగునీటి శాఖకు గత మూడు సంవత్సరాలుగా 25 వేల కోట్ల అత్యధిక నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టుల పనులను సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టులకు జాతీయ బ్యాంకుల ద్వారా నిధులు సమకూరుస్తున్నది. దేవాదుల ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 38 టి‌ఎం‌సి ల నుంచి 60 టి‌ఎం‌సిలకు పెంచింది. కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులను 25 నుంచి 40 టి‌ఎం‌సి లకు పెంచింది. గోదావరిలొ తెలంగాణ వాటా 954 టి‌ఎం‌సిల నీటిని సంపూర్ణంగా వాడుకోవడానికి ప్రణాళికలు తయారు చేసి ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు, సుప్రీం కోర్టు ముందు వాదనలు కొనసాగిస్తోంది. 

(10) పొరుగు రాష్ట్రాలతో సత్సంబందాలు: 
కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం కావడానికి అత్యంత కీలకమైనది మహారాష్ట్రతో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం. ముఖ్యమంత్రి స్వయంగా రెండు సార్లు ముంబాయి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో పరస్పర సహకారమే లక్ష్యంగా చర్చలు జరిపి ఒప్పందానికి అనుకూలంగా మార్చినారు. ఇటువంటి ఒప్పందం ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేదు కనుకనే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం పదేండ్లు ముందుకు కదలలేదు. ఈ చారిత్రాత్మక ఒప్పందం కారణంగా పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి  నదులపై చనాకా కొరట, తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజిల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఈ మూడింటిలో మేడిగడ్డ బ్యారేజి పూర్తి కాగా చనాకా కొరట బ్యారేజి నిర్మాణం చివరి దశలో ఉన్నది. మహారాష్ట్రతో ఈ అంతర్రాష్ట్ర ఒప్పందమే కేంద్రం నుంచి ప్రాజెక్టుకు అనుమతులు రాబట్టడానికి ప్రాతిపదిక అయ్యింది. మహారాష్ట్రాతో ఒప్పందం నదీ జలాల వివాదాల పరిష్కారానికి దేశానికి ఒక మార్గనిర్దేశనం చేసింది. ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ప్రదర్శిస్తే దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కూడా పరిష్కారం అవుతాయని ఈ ఒప్పందం నిరూపించింది. ఇదే విధమైన ఇచ్చి పుచ్చుకునే వైఖరితో కర్నాటక ప్రభుత్వంతో వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తున్నది ప్రభుత్వం.

(11) ఐదేండ్లలో సాగునీటి ప్రగతి సూచికలు:
సాగునీటి రంగంలో ప్రగతిని, ఉమ్మడి రాష్ట్రంలో 2004 -14 వరకు  పదేళ్ల పాలనలో జరిగిన ప్రగతితో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. ఉమ్మడి రాష్ట్ర  పాలకుల హయంలో సాగునీటి ప్రాజెక్టుకు చేసిన ఖర్చు, సాధించిన ప్రగతి కింది పట్టికలో చూడవచ్చు

i) ప్రాజెక్టులపై  నిధుల ఖర్చు 

ii) ఆయకట్టు సాధనలో వృద్ది:


iii) పంటల దిగుబడిలో వృద్ది:

మార్కెటింగ్ శాఖ సేకరించిన వివరాలు నిజంగా విస్తుగొలిపేలా ఉన్నాయి.

iv) చేపల ఉత్పత్తిలో వృద్ది:
తెలంగాణ మత్స్య శాఖ 2018 లో ప్రచురించిన నివేదిక చేపల ఉత్పత్తిలో గణనీయమైన వృద్దిని సాధించిందని ధృవీకరిస్తున్నది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 2,70,209 టన్నులని, వాటి విలువ రూ. 2565 కోట్లు అని నివేదిక పేర్కొన్నది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 2,94,209 టన్నుల చేపల ఉత్పత్తి సాధ్యం అయ్యిందని నివేదిక పేర్కొన్నది. వీటి విలువ సుమారు రూ. 2942 కోట్లు. ఒక సంవత్సరంలోనే 24,174 టన్నుల చేపల ఉత్పత్తి పెరిగిందని నివేదిక పేర్కొన్నది. రాష్ట్రంలో మంచినీటి  రొయ్యల ఉత్పత్తిలో కూడా గణనీయమైన వృద్ది సాధ్యం అయ్యిందని నివేదిక స్పష్టం చేసింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రొయ్యల ఉత్పత్తి  7783న్నులు ఉంటె, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అది 9998 టన్నులకు పెరిగిందని నివేదిక పేర్కొన్నది. అంటే 2,215 టన్నుల అదనపు ఉత్పత్తి సాధ్యం అయ్యింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమంలో వేలాది చెరువులను పునరుద్దరించడం, అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చెయ్యడం, రాష్ట్రం జలాశయాలను నిర్మించడం ప్రధాన కారణం అని నివేదిక పేర్కొన్నది. పూడికలు తీసి చెరువులను పునరుద్దరించడం వలన చెరువుల్లో 9-10 నెలల పాటు నీరు నిలువ ఉండే పరిస్థితి ఏర్పడిందని, దానితో చేపల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని నివేదిక పేర్కొన్నది. దానికి తోడూ మత్స్య పరిశ్రమ అభివృద్దికి విధానపరమైన నిర్ణయాలు చేపల ఉత్పత్తి పెరగడానికి దోహదం చేసిందని నివేదిక పేర్కొన్నది. ప్రభుత్వం చేపల పెంపకందారులకు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 70 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిందని, మత్స్యకారులకు వలలు, వాహన సౌకర్యాలు కల్పించడం, ఆధునిక  కేజ్ కల్చర్ విధానాలకు మత్స్యకారులను ప్రోత్సహించడం వంటి విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయని, మత్స్యకారుల ఆదాయాలు పెంచాయని నివేదిక పేర్కొన్నది. ఇటీవల పార్లమెంట్ స్తాయీ సంఘం పార్లమేంట్ లో ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం దేశంలో చేపల ఉత్పత్తిలో 65 % మంచినీటి చేపల వ్యవసాయం ద్వారానే వస్తున్నాడని పేర్కొన్నది. తెలంగాణలో 25 వేల జలాశయాలు ఉన్నాయని, వాటి ఉపరితల విస్తీర్ణం 5.73 లక్షల చదరపు కిలోమీటర్లు. దీనితో తెలంగాణ మంచినీటి చేపల ఉత్పత్తిలో 5 వ స్థానంలో నిలచిందని పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదిక పేర్కొన్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత అంతా కూడా సముద్ర చేపల ఉత్పత్తి మీదనే ఉన్నది తప్ప తెలంగాణలో విస్తారమైన మంచి నీటి చేపల ఉత్పత్తిపై దృష్టి సారించలేదు. తెలంగాణ రాష్ట్రం ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి నీటి చేపల ఉత్పత్తిలో గణనీయమైన వృద్దిని సాధించగలిగింది. దానికి సాగునీటి శాఖ అభివృద్ధి చేసిన జలాశయాలు అధరువులుగా ఉనాయి.

v) భూగర్భ జలాల మట్టం పెరుగుదల:
భూగర్భ జలాల వృద్దిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని భూగర్భ జల శాఖ వారి అధ్యయనంలో తేలింది. భూగర్భజల శాఖ వారు ప్రతీజిల్లాలో మిషన్ కాకతీయ అమలవుతున్న ఒక మైక్రో బేసిన్ ని తమ అధ్యయనానికి ఎన్నుకున్నారు. వాటి అధారంగా భూగర్భజలాలపై మిషన్ కాకతీయ ప్రభావాలను అంచనా వేయడం జరిగింది. 2016 మే నెల నుంచి సెప్టెంబరు దాకా వారి అధ్యయన ఫలితాలను క్రోడీకరించినారు. 

ఆదిలాబాద్ జిల్లాలో మే నెలలో 12.04 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 3.12 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 8.92 మీ పెరిగింది. 

– కరీంనగర్  జిల్లాలో మే నెలలో 13.68 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 4.55 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 9.13 మీ పెరిగింది. 

– ఖమ్మం జిల్లాలో మే నెలలో 10.12 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 4.62 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 5.50 మీ పెరిగింది. 

– మహబూబ్ నగర్ జిల్లాలో మే నెలలో 24.31 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 22.50 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 1.81 మీ పెరిగింది. 

– మెదక్ జిల్లాలో మే నెలలో 17.85 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 2.68 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 15.17 మీ పెరిగింది. 

– నల్లగొండ జిల్లాలో మే నెలలో 18.57 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 8.94 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 9.63 మీ పెరిగింది. 

– నిజామాబాద్ జిల్లాలో మే నెలలో 20.30 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 10.06 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 10.24 మీ పెరిగింది. 

– రంగారెడ్డి జిల్లాలో మే నెలలో 30.70 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 24.41 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 6.29 మీ పెరిగింది. 

– వరంగల్  జిల్లాలో మే నెలలో 14.19 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 5.09 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 9.10 మీ పెరిగింది. రాష్ట్ర సరాసరి చూసినప్పుడు  భూగర్భ జల మట్టం 8.42 మీ పెరిగినట్టుగా తేలింది. 

– మెదక్ జిల్లాలో అత్యధికంగా 15.17 మీ, అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో 1.81 మీ భూగర్భ జల మట్టం పెరిగినట్టుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 

ఉపసంహారం:
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గడచిన ఐదేండ్లలో సాగునీటి రంగంలో గొప్ప విజయాలు చేకూరినాయి. తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు నెరవేరే దారిలో ప్రాజెక్టుల పురోగతి సాగుతున్నది. తెలంగాణ కోటి ఎకరాల మాగానంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో సాగునీటి శాఖ ముందుకు సాగుతున్నది. మానవాభివృద్ది సూచికలలో అగ్రగామిగా నిలచింది. ఈ సందర్భంలో 2011 లో జాతీయ అభివృద్ధి మండలి (National Development Council) తమ పదకొండవ ప్రణాళికా నివేదికలో కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్ ఘర్ లు తమ మాతృ రాష్ట్రాలతో పోల్చినప్పుడు Gross State Domestic Product పెరుగుదలపై ఈ విధంగా వ్యాఖ్యానించింది.

“అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి అణిగిపోయి ఉండటం వలన ఈ ప్రాంతాలు వెనుకబడి పోయినాయి. ఈ ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడగానే వీటిల్లోని సహజంగా నిబిడీకృతమై ఉన్న సమస్త సృజనాత్మక శక్తులు వికాసం చెంది ప్రజలని కార్యోన్ముఖులని కావించాయి.తమ ప్రాంత అభివృద్దికి ప్రణాళికాబద్దమైన పరిపాలనా కూడా బయటి పెట్టుబడులని రాష్ట్రంలోకి ఆకర్షించి ఆర్ధిక ప్రగతికి దోహదం చేసి ఉంటుంది. వనరుల వినియోగం కూడా అందుకు ఊతం ఇచ్చింది”. ఈ వ్యాఖ్యానం తెలంగాణకూ అక్షరాలా వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను, ప్రకృతి వనరులను, మానవ నిర్మిత వనరులను అత్యంత సృజనాత్మకంగా వినియోగం చేస్తున్నది. సాగునీటి రంగం అపూర్వంగా వికాసం చెంది రాష్ట్ర సమగ్రాభివృద్దికి దోహదం చేస్తున్నది. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత, సంకల్పబలం తోడయ్యింది. 

***

REFERENCES: 

1. Adithya Dahagama, Leon Espira, John Monnat with Hassan Bukhaari, Sara Cole, Shamitha Keerthi and Kelly Serfling – Final Report – De- Silting Minor Irrigation Ponds in South India: The Sustainability of Decentralized Resource Distribution.

2. CBIP Award 2019 – Excellence in Integrated Water Resources Management Presented to Irrigation & CAD Department, Government of Telangana Dated: 04.01.2019, New Delhi.

3. Department of Social Work, University of Arts and Science College, Kakatiya University, Warangal – Souvenir released in National Seminar on Mission Kakatiya: A new hope for Sustainable Rural Development in Telangana State.

4. Government of Telangana, I&CAD Department-Minor Irrigation- Restoration of Minor Irrigation Tanks – Mission Kakatiya – General Guidelines – Orders Issued; G.O.Ms.No.44 Dated:13.03.2015

5. Government of Telangana, I&CAD Department-Minor Irrigation – Restoration of Minor Irrigation Tanks – Mission Kakatiya – General Gide lines – Orders Issued; G.O.Ms.No.48 Dated:12.07.2016

6. Government of Telangana, I & CAD Department – Administrative approval for linking of Tanks with canal network of irrigation projects and construction of check dams to expedite water supply to the farmers fields Accorded – Orders Issued; G.O.Ms.No.8 Dated:08.03.2019

7. Government of Telangana – Ground Water Department – Mission Kakatiya Monitoring Cell – Annual Report on Impact of Mission Kakatiya Desiltation Programme on Ground Water Regime in 9 Pilot Basins of 9 erstwhile Districts (2017-18).

8. Government of Telangana – Mission Kakatiya – Reinventing Telangana – Restoration Minor Irrigation Sources and other Water Bodies, March 2017.

9. Irrigation & CAD Department, Government of Telangana State – Mission Kakatiya (Rehabilitation of MI Tanks) – Manual on Construction Procedure.

10. K.V. Padamaja, S.P.Wani, Lav Agarwal and K L Sahrawat, ICRISAT, District Water Management Agency, Global Theme 3: Water, Soil and Agro diversity Management for ecosystem Resilience, Report No.4 Economic Assessment of desilted sediment in terms of plant nutrients equivalent: A case study in the Medak District of Andhra Pradesh.

11. Manisha Shah, Bharti and Shilpa Verma for IWMI-TATA: Water Policy Program – Publication No.8, 2017- Reviving Minor Irrigation in Telangana, Mid Term Assessment of Mission Kakatiya.

12. Mohammed Osman, Suhas P Wani, C Vineela and R Murali, ICRISAT and  WWF International, Global Theme on Agroecosystems – Report No 52- Quantification of Nutrients Recycled by Tank Silt and its Impact on Soil and Crop – A Pilot Study in Warangal District of Andhra Pradesh.

13. NABARD CONSULTANCY SERVICES PRIVATE LIMITED-Impact Assessment study on Mission Kakatiya – Restoration Minor Irrigation Tanks Implemented by Government of Telangana.

14. PS Dileep – TS Bags big Catch – News item published in ” Telangana Today” on 30.04.2019. Hyderabad Edition, Page No.05.

15. PS Dileep – Push on Cards for fishery sector – News item published in ” Telangana Today “on 05.05.2019, Hyderabad Edition, Page No.05. 

16. Rachana Singh, S. Parvatha Varthini and Syam Krishnan P Aryan – Assessment of Mission Kakatiya In Telangana – Submitted to Government of Telangana, August-2017. 

17. Xavier Gine, Anup Malani, Aprajit Mahajan and Manaswini Rao – Research Project at Tata Center for Development in UCHICAGO-Evaluation of Mission Kakatiya: Minor Irrigation Project in Telangana.

18. Statehood for Telangana: Essays on Telangana Agitation, History, Culture & Society

19. (2010) , Published by Deccan Telangana, Edited by KY Reddy

20. The Fall and Rise of Telangana, Gautam Pingle, ( 2014), Published by Orient Black Swan

21. Nizamsagar Project Report (1965), Compiled by E Veera Raghavan, Published by Public Works Department

22. History of Nizamsagar Project, Compiled by Dr. S P Raju

23. Role of Storages and Basin Management Strategies in India, A Presentation made by A B Pandya, Former CWC Chairman and Secretary General, ICID

24. Kaleswaram Project: “From Dreams to Reality”, Kaleshwaram Project Corporation, Govt. of Telangana, June 2019

25. Sadat Ali Khan, Projects For Prosperity: The Story of Hyderabad’s Bid For Self-sufficiency through Irrigation and Power Projects ”, Govt of Hyderabad, 1951

26. K.G Commission Report, 1962


Connect with us

Videos

MORE