mt_logo

తెలంగాణ కోరుకునేది అస్తిత్వం

By శైలేష్ రెడ్డి

మహాకూటమి కుట్రలు ఫలిస్తే ఏర్పడేది అస్థిర ప్రభుత్వం. అమరావతి పాలకుల దయాదాక్షిణ్యాల మీద, వారి ఆదేశాలను పాటించుకుంటా పరిపాలన చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ సుఖంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడు కోరుకోలేదు. ఇష్టం లేకున్నా తెలంగాణ సమాజం తెచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైంది. కాంగ్రెస్ పార్టీ గుండె ఇప్పటికీ ఆంధ్ర కోసమే కొట్టుకుంటది. అందుకే బద్ధ శత్రువైనా ఫక్తు ఆంధ్ర పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటున్నది.

మరో రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఒక కీలక పరీక్షను ఎదుర్కోబోతున్నది. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే శక్తులు ఒక వైపు, తెలంగాణను అస్థిరపరిచే శక్తులు ఒకవైపు. నీళ్లు, నిధులు, నియామకాలపై, వనరులపై తెలంగాణ జెండా పట్టినవాళ్లు ఒకవైపు, తెలంగాణను గుప్పిట్ల పెట్టుకొని వాటిని మళ్ళించుకోవాలని, స్థిరమైన రాజకీయ, పరిపాలనా వ్యవస్థలను అస్థిరం చేసి తద్వారా ఏర్పడిన అనిశ్చితిని అనుకూలంగా మల్చుకొని తెలంగాణను దోచుకోచూస్తున్న దుష్టకూటమి ఒకవైపు. మహాకూటమి లక్ష్యం.. తెలంగాణలో అల్లకల్లోలం. ఒంటరిగా గెలువలేని కాంగ్రెస్ పార్టీ పంచన చేరి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించినందుకు ప్రతీకారాన్ని తీర్చుకోవటం. టీఆర్‌ఎస్‌ను ఓడిస్తే పగ చల్లారదు, తెలంగాణ ఆగం గావాలె. తెలంగాణను ఆగం జెయ్యాలె. తెలంగాణ వనరులు సొంతం కావాలంటే అధికారంల ఉన్నోడు మన చెప్పుచేతల్ల ఉండాలె. ఇవన్నీ సాధ్యం కావాలంటే కూటమి గట్టాలె. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ చేస్తున్నది అదే. ఆంధ్రప్రదేశ్‌లో అస్తిత్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని టీడీపీకి తాకట్టుపెట్టి రాజకీయంగా లాభపడాలని చూస్తున్నది. ఎంత కష్టపడినా ఒక్క సీటన్న వస్తదనే నమ్మకం లేదు. యువరాజుకు ప్రధాని కావడానికి అవసరసమైన సీట్లు ఆంధ్ర మిత్రుని నుంచి ఆశిస్తున్నది. అందుకోసం యువరాజు కోసం తెలంగాణను తాకట్టు పెడుతున్నది.

నాడు రాయల తెలంగాణ పేరు తోటి తెలంగాణల రాజకీయ అస్థిరత్వానికి పురుడు పోయాలని చూసినా కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు దానికి మళ్ల ప్రాణం పొసే ప్రయత్నం మొదలు పెట్టినాయి. తెలంగాణల 119 అసెంబ్లీ సీట్లున్నాయి. అధికారంలోకి రావాలంటే 60 సీట్లు కావాలె. టీడీపీ-కాంగ్రెస్-సీపీఐ-టీజేఎస్ కూటమిలో ఏ ఒక్కరూ 60 సీట్లకు మించి పోటీచేసే పరిస్థితిలో లేదు. ఒకవేళ పోటీచేసినా సొంతంగా 60 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ జట్టు కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అయిన టీడీపీ చేతుల ఉంటది. అస్థిర పాలనల తెలంగాణ అల్లకల్లోలమైతది. ఓటుకు నోటు తోటి తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే రాజకీయ అస్థిరత్వం సృష్టించాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ తోక పట్టుకొని మునిగిన గోదావరినే మళ్ల ఈదాలనే ప్రయత్నం చేస్తున్నడు. మహాకూటమి కుట్రలు ఫలిస్తే ఏర్పడేది అస్థిర ప్రభుత్వం. అమరావతి పాలకుల దయాదాక్షిణ్యాల మీద, వారి ఆదేశాలను పాటించుకుంటా పరిపాలన చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ సుఖంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడు కోరుకోలేదు. ఇష్టం లేకున్నా తెలంగాణ సమాజం తెచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైంది. కాంగ్రెస్ పార్టీ గుండె ఇప్పటికీ ఆంధ్ర కోసమే కొట్టుకుంటది. అందుకే బద్ధ శత్రువైనా ఫక్తు ఆంధ్ర పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటున్నది. తెలంగాణ శత్రువులిద్దరు ఒకటైతుండ్రు. ఇది అప్రమత్తంగా ఉండవలసిన సమయం. ఏమరుపాటుగా ఉంటే అస్తిత్వానికే ప్రమాదం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *