mt_logo

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12మంది టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీనీ నిన్నటి దాకా విమర్శించిన ఎంపీలు సైతం ఇవ్వాళ పక్క పార్టీ వైపు చూడటం ఇక్కడ గమనార్హం.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ లోని నాయకులు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేడు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అమేథీలో ఓటమి చవిచూసి పార్టీ పగ్గాలను వదిలేసిన తరుణంలో, దాని ప్రభావం ప్రతీ రాష్ట్రం మీద స్పష్టంగా కనపడుతోంది. తెలంగాణ ఇందుకు మినహాయింపు కాదు. తెలంగాణాలో అధికార పార్టీలో ఎమ్మెల్యేలు చేరడానికి ప్రధాన కారణం కూడా ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకున్న ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలం కావడంతో తమను నమ్ముకున్న ప్రజల కోసం కేసీఆర్ తో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారి వాదన.

రాష్ట్రంలో బలపడాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. అందుకు ఈ చేరికలు ఉపయోగపడతాయి అని బీజేపీ భావిస్తుంది. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కొన్ని లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును తమ వైపు మళ్లించుకుంది. దానికి మోడీ హవా జోడు అవడంతో 4 సీట్లు గెల్చుకుంది.

ఇక బీజేపీ రాజకీయాలకు అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కకావికలం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో అంతర్యుద్ధం, వర్గ పోరు, ఆధిపత్య పోరు, నాయకత్వ లేమి ఎలా కారణాలు ఏవయినా… కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి తయారయ్యింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న స్వయం కృతాపరాధంగానే భావించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *