mt_logo

తెలంగాణలో అంపశయ్య మీద టీ-కాంగ్రెస్ “చే” జేతులా చేసుకున్న పాపమేనా ?

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రం ప్రతీకారం తీర్చుకున్నట్టే కనబడుతుంది. 1956 నుండి 2014 వరకు జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. 1956 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో బలవంతంగా విలీనం చేసింది. 1950 సంవత్సరంలో రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ శాంతియుత ఆందోళనలు చేపట్టడం జరిగింది. అప్పుడే ఏర్పాటయిన ఫజల్ అలీ కమీషన్ కు సైతం రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షిస్తూ మెమోరాండంలు, విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. కమిషన్ 1955లో విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని స్పష్టంగా సిఫార్సు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్ ను కాదని ఆంధ్ర ప్రాంత నాయకుల డబ్బు సంచులకు తలొగ్గి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేశారు.

1950వ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంతంతో విలీన ప్రతిపాదనలను వ్యతిరేకించారు, తమ ప్రాంత నీళ్ళు, నిధులు నియామకాలు దోపిడీకి గురవుతాయని భయపడ్డారు. అనుకున్నట్టుగానే ఆరు దశాబ్దాలలో జరిగిన పాలన తీరుతెన్నులను గమనిస్తే వారు బయపడ్డట్లే జరిగింది. ఆంధ్ర ప్రాంత నాయకత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన కాంగ్రెస్ పార్టీ 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంత విషయంలో వివక్షను చూపిస్తూనే ఉంది. సమైక్య రాష్ట్రంలో 12 సంవత్సరాల ఇబ్బందుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రెండోసారి మొదలైంది. లక్షల మంది యువకులు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కర్కశంగా ప్రజా ఉద్యమాన్ని అణిచివేశాయి. 369 మంది యువకులను పొట్టన పెట్టుకున్నారు. 1971 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా స్థాపించిన తెలంగాణ ప్రజల సమితి పార్టీకి సంబందించిన 10 మంది ఎంపీలను గెలిపించి తమ రాష్ట్ర ఆకాంక్షను ప్రజాస్వామ్యయుతంగా చాటి చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలతో తెలంగాణ ప్రజా సమితి పార్టీని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విలీనం చేసుకుని ఉద్యమానికి మరోమారు తీరని ద్రోహం చేశారు. కానీ ఉద్యమకారులు, మేధావులు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్నిఎప్పటికప్పుడు తమ రచనల ద్వారా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నారు.

సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంత నీళ్లు, నిధులు, వనరులు దోపిడీకి గురవుతూనే ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ రకాల పదవులకు, ఆంధ్ర ప్రాంత నాయకుల డబ్బులకు తలొగ్గి, వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారి తెలంగాణ ప్రజా ఆకాంక్షలను తాకట్టు పెడుతూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. 2001 టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలో రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు తిరిగి అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను వాడుకుంది. అంతేకాకుండా తెలంగాణ నినాదం కొంత మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాత్రమే పని చేసింది. 2004 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో కొనఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న పొత్తు ఫలితంగా అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల టిఆర్ఎస్ పార్టీని పోటీకి నిలిపి మోసం చేసింది.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వివిధ కారణాలతో ఆలస్యం చేస్తూనే వచ్చింది. మరోవైపు అనైతికంగా టిఆర్ఎస్ పార్టీని బలహీనం చేసే కుట్రలకు కూడా తెర లేపింది. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో రాజీలేకుండా కేసీఆర్ నేతృత్వంలో పోరాటం కీలక దశకు చేరుకుంది. ఫలితంగా 2009 సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దానితో దిగివచ్చిన కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ, ఆంధ్ర ప్రాంత నాయకుల ఒత్తిడికి తలొగ్గి డిసెంబర్ 23 న ఆ ప్రకటనని వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా తెలంగాణలో వందల మంది యువకుల ఆత్మ బలిదానాలకు కారణం అయ్యింది. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పేరుతో మరో పెద్ద మోసానికి తెర తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు శ్రీకృష్ణ కమిటీ నియామకాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొనసాగింపుగానే అని నమ్మారు కానీ మరోవైపు ఈ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే తీరుతెన్నుల మీద ఒక రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తొక్కి పెట్టడానికి పోలీస్ బలగాలను మోహరించడం ఇక్కడి నాయకులకు పదవులు ఇవ్వడం, పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం లాంటి పలు సూచనలు చేయడం జరిగింది. మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నేతృత్వంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ, అహింసాయుత మార్గంలో నడిచింది కాబట్టే తెలంగాణ ప్రజల లక్ష్యం నెరవేరింది. లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకుల రాజకీయాలకు మరోమారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు బలై పోతుండేవి. చిట్ట చివరిగా 2014లో రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలనే చూసింది. ఉద్యోగ నియామకాల్లో యువత ఆకాంక్షలకు అడ్డుతగులుతూ, కోర్టుల్లో డజన్లకొద్దీ కేసులు వేసి తెలంగాణ ప్రాంతానికి ఒకే ఒక శత్రువు కాంగ్రెస్ పార్టీ అని నిరూపించింది. కాంగ్రెస్ పార్టీ ఏ దశలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించిన దాఖలాలు లేవు. దాని ఫలితమే ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *