mt_logo

అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలి- సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలని, వివిధ పోటీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలోని హోటల్ మారియట్ లో రెండవరోజు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, అవి దక్కాలంటే ఎలా ప్రిపేర్ కావాలనే అంశాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. అంతేకాకుండా ఎస్పీలు, కలెక్టర్లు కూడా విద్యార్థులకు నేరుగా బోధన చేస్తే మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రావీణ్యం పొందేలా విద్యాశాఖ ప్రణాళికలు రచించాలని, అమ్మాయిలు కూడా చదువుకునేందుకు అవసరమయ్యే విధంగా బోధన, వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు విద్యావిధానం కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని, కులాలు, అంతరాలు లేకుండా ఒకేచోట విద్య అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తామని, ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనార్టీ పిల్లలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ముఖ్యంగా ముస్లింలలో చాలా పేదరికం ఉందని, ప్రతీ జిల్లాలో మైనారిటీల కోసం రెండు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న పథకాలను సమీక్షించి కొత్త పథకాలను రూపకల్పన చేయాలని, గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ ముస్లింల సంక్షేమం కోసం ఏమేం చేయాలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగిస్తామని, 3వ తరగతి వరకు విద్యాబోధన స్థానికంగానే జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్లు పరిశీలించాలని, అన్ని స్కూళ్లలో నూటికి నూరు శాతం టాయిలెట్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. అన్ని పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించాలని, విరివిగా మొక్కలు నాటాలని, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *