mt_logo

ఎస్ఎల్‌బీసీ పై ఆల్ పార్టీ మీటింగ్

శ్రీశైలం ఎడమకాలువ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీ కమిటీ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ కే ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత అప్పగించాలని, వేరెవరికైనా అప్పగిస్తే జాప్యం జరుగుతుందని సభ్యులు అన్నారు. నత్తనడకన సాగుతున్న శ్రీశైలం ఎడమకాలువ ప్రాజెక్టులో సొరంగమార్గాన్ని పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్ట్ పనులు చేపట్టిన సంస్థకు రేట్లను పెంచి ఇవ్వాలని వివిధ పార్టీల సభ్యులు ప్రభుత్వానికి సూచించారు.

శ్రీశైలం రిజర్వాయర్ నుండి 44 కిలోమీటర్ల పొడవున సొరంగమార్గం పనులు చేపట్టి జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థ ఇప్పటివరకు సగం పనులే పూర్తిచేయడం జరిగింది. రేట్లు బాగా పెరిగినందున తాము మిగతా పనులు చేపట్టలేకపోతున్నామని, కనీసం రూ. 1400 కోట్ల మేరకు అంచనా వ్యయాన్ని పెంచాలని ఈ సంస్థ గతంలోనే స్పష్టం చేసింది. దీనిపై సీఎం మాట్లాడుతూ, సొరంగమార్గం పూర్తిచేయడానికి భారీమొత్తంలో నిధులు ఖర్చుచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, పనులను బట్టి వెంటనే నిధులు విడుదల చేస్తామని అన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నాయిని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిషోర్, సునీత, శేఖర్ రెడ్డి, బాలరాజు, ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి, భాస్కర్ రావు, బీజేపీ నుండి ప్రభాకర్, సీపీఐ నుండి రవీంద్రకుమార్ నాయక్, సీపీఎం నుండి సున్నం రాజయ్య, వైసీపీ నుండి వెంకటేశ్వర్లు, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *