mt_logo

మళ్ళీ తెరుచుకున్న సిర్పూర్ కాగజ్ మిల్!

సిర్పూర్ కాగజ్ నగర్ లోని పేపర్ మిల్ ఐదేళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వ చొరవతో మళ్ళీ తెరుచుకొంది. 2014 లో మూతపడ్డ కాగితపు పరిశ్రమలో గురువారం రాత్రి 8.20 గంటలకు తిరిగి పేపర్ ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వర్క్స్ అండ్ డైరెక్టర్ పీకే సూరి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం యూనిట్ హెడ్ మయాంక్ జిందాల్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి ఉత్పత్తిని ప్రారంభించారు. అనంతరం మయాంక్ జిందాల్ కార్మిక కుటుంబాలకు స్వీట్స్, చీరలు పంపిణీ చేశారు.

చిప్పర్ హౌస్ లో నిల్వ ఉంచిన పల్ప్ పేపర్ గా మారి బయటకు వచ్చింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కాగితం ఉత్పత్తి జరగడంతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. నిజాం కాలంలో 1938 లో ఎస్పీఎం ను స్థాపించారు. 1950 లో బిర్లా గ్రూప్ టేకోవర్ చేసి నిరాటంకంగా ఉత్పత్తి చేసింది. కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో సంస్థ యాజమాన్యం 2007-08లో మిల్లును ఐడీబీఐ కి తాకట్టు పెట్టింది. అనంతరం నష్టాలు పెరగడంతో 2014 సెప్టెంబర్ 27న షట్ డౌన్ చేసింది. కంపెనీ మూసేనాటికి 3,200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వందలాది మంది పరోక్షంగా ఉపాధిని పొందేవారు. 2016 అక్టోబర్ 22న ఐడీబీఐ స్వాధీనం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తిరిగి తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్ లో ప్రభుత్వం ప్రకటించింది. 2017 డిసెంబర్ లో వివిధ కంపెనీలు ఎస్పీఎం ను సందర్శించాయి. వీటిలో జేకే కంపెనీ ఎస్పీఎంను తీసుకునేందుకు ముందుకు వచ్చింది. పదేళ్ళ పాటు రాయితీలు కల్పిస్తూ 2018 మర్చి 4న ప్రభుత్వం జీవో-18ను విడుదల చేసింది. ఆగస్ట్ 2న అప్పటి మంత్రి కేటీఆర్ ఎస్పీఎం పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకరం ఆరునెలల్లోనే పేపర్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీంతో వేలాది కార్మికుల కుటుంబాలకు ఉపాధి లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *