mt_logo

టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పలు అంశాలపై వివిధ వర్గాల వినతిపత్రాలు

తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రభుత్వం పూర్తిగా ఆచరించి చూపిన నేపథ్యంలో వివిధ వర్గాలు ఇప్పుడు తమ సమస్యలను మ్యానిఫెస్టోలో చేరిస్తే వాటికి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాయి. అందులో భాగంగానే టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీకి పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.

పలు సంఘాల నాయకులు కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ కే కేశవరావును గురువారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కే కేశవరావుకు వినతిపత్రం సమర్పించారు. బీసీ ప్రజాప్రతినిధులు గత డిసెంబర్‌లో రూపొందించిన బీసీ డిక్లరేషన్‌లోని అంశాలను టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చాలని ఆయన కోరారు. బీసీల విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధంలేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని, బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలిగించాలని, రూ.20వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకొన్న ప్రతిఒక్కరికి 90 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని కోరారు. బీసీలకు 500 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 100 బీసీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారు. బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు. ఆయనతోపాటు కేకేను కలిసినవారిలో నీలి వెంకటేశ్, కోల జనార్దన్, గుజ్జ కృష్ణ, రాజేందర్, సజ్జ రమేశ్, మర్క కృష్ణ, గజేంద్ర తదితరులున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు మరికొన్ని పథకాలు
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఇంటలెక్చువల్ ఫోరం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తెలంగాణ శాఖ, సంయుక్తంగా కే కేశవరావును కలిసి వినతిపత్రం సమర్పించాయి. ఒక ఎకరం భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రస్తుతం ఇస్తున్న గుంటకు రూ.100లను రూ.200లకు పెంచాలని, రైతు బీమా పథకాన్ని విస్తరించాలని, ఎస్సీ, ఎస్టీ రైతులు, కౌలు రైతులకు అర్హత పరిమితిని 70 సంవత్సరాల వరకు పెంచాలని కోరాయి. రైతులకు ఇస్తున్నట్లుగా ఎస్సీ, ఎస్టీ రైతు కూలీలకు, కూలీలకు వర్తింపజేయాలని కోరాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీ నటరాజ్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ మాదాసు లింగయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందరావు, రాంబాబు, ఎన్ రమేశ్, శంకరయ్య, కే చంద్రశేఖర్, ఏ మాధవరావు తదితరులు కేకేను కలిసినవారిలో ఉన్నారు.

దళితులకు మూడు ఎకరాల భూమి కొనుగోలు పథకంలో భాగంగా ఒకవేళ భూమి లభ్యం కాకుంటే దళితులకు స్వయం ఉపాధికి 50 శాతం సబ్సిడీతో గ్రామాలవారీగా రుణాలు ఇవ్వాలని, సహకార బ్యాంకులకు సంబంధించి త్రీ టైర్ సిస్టం స్థానంలో వన్ టైర్ సిస్టంను తీసుకురావాలని దళితులకు కొత్తగా వివిధ పథకాలను అమలుచేయాలని కోరుతూ రాష్ట్ర ఆహార భద్రత చట్టం సభ్యుడు ఆనంద్ వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కూడా పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *