mt_logo

సలాం హైదరాబాద్ – నమస్తే తెలంగాణ

అక్టోబరు 30 2010 , నల్లగొండ జిల్లా కట్టంగూరులో తెలంగాణ జే ఏ సి ప్రచార రథ యాత్ర లో మాట్లాడుతుంటే ఒక పిల్లవాడు నిలబడి ‘అన్నా… తెలంగాణ, హైదరాబాదు చారిత్రకంగానే అన్ని రంగాల్ల వెనకబడి ఉన్నయట గదా..పేపర్ల అచ్చింది’ అని స్కూల్లో లెక్కల సార్ ను  ఎక్కాల గురించి ప్రశ్నించినంత అమాయకంగా అడిగిండు. అది ఎంత అబద్దమో నేను నాకున్నంత పరిమిత జ్ఞానంతో, నాకున్న జ్ఞాపక శక్తితో కొన్ని చారిత్రక సంఘటనలు చెప్పిన. నేను చెప్పిన కొన్ని ఉదాహరణలతోనే వారం ముందే దీపావళి పండుగ అచ్చిందా అన్న రీతిలో వెలిగింది వాని సూరత్. ఏదైతేనేం ఓ భీ ఖుష్ ఔర్ మే భీ ఖుష్.

అదే రోజు రాత్రి హైదరాబాద్ కి బస్సుల తిరుగు ప్రయాణం పట్టిన. పక్కన ఉన్న సీట్లో ఒక ఆంధ్ర పెద్ద మనిషి కూర్చొని నన్ను నిద్ర పోనియ్యకుండా తెలంగాణ గురించి ఏదో అడగటం మొదలు పెట్టిండు. నేను దేనికీ అంతగా స్పందించకపోవటంతో, నేను భావ దారిద్ర్యుడినని ఒక నమ్మకానికి వచ్చి, ఆ భాద్యతగల పెద్ద మనిషి “మా కారణంగానే హైదరాబాద్ నగరం అంత సుందరంగా తయరయ్యిందోయ్! అంతకు మునుపు అక్కడేమి ఉండేది ? సిమెంటు కాంక్రీటు భవనాలు ఉండేవా ? హై టెక్ సిటీ ఉండేదా? ఆకాశ హర్మ్యాలు ఉండేవా ? అన్నీ ఉత్త మట్టి గోడల భవనాల గోడలే కదా అబ్బాయ్” అని ఎద్దేవా చేస్తూ ఉంటే హైదరాబాద్ నగరంలోనే కాదు, తెలంగాణ ప్రాంతం లో పుట్టు పెరిగిన వాళ్ళందరికీ ఆవేదన కల్గిస్తది. ఆ మాటలకు ఆ పెద్దాయన వయసు చూసి కోపగించుకోకుంట, ఒకప్పుడు మన దేశానికి ప్రధానిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రాల్ హైదరాబాద్ కి అచ్చి “నేను చూసిన అందమైన హైదరాబాదు ఏమయ్యింది? ఇప్పుడున్నది సిమెంటు కాంక్రీటు భవనాల అరణ్యమేనా ?” అని తన ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనను ఆ పెద్దాయనకు చెప్పిన. అంతే కాకుండా “ప్రజలను దోచుకున్న వాళ్ళే ప్రజల చరిత్రను, సంస్కృతిని కూడా దోచుకుంటారు” అని రెండు చురకలంటించిన.

ఇంతలోనే వెనక కూర్చున్న తెలంగాణ పెద్ద మనిషి “హైదరాబాదు లో ఆంధ్రోల్లు రాక ముందు దినపత్రికలు లేవంటగా, ఫ్యాక్టరీలు లేవంటగా, అవి లేవంటగా ఇవి లేవంటగా…” అంటూ ప్రశ్న మీద ప్రశ్న ఏసిండు. అప్పుడే వేణు సంకోజు గారు చెప్పిన కొన్ని మాటలు యాదికొచ్చినయ్.

ఇంకా కొంత మందికి తెలంగాణ అనేది ఒక శేష ప్రశ్నే.

ప్రశ్న నుండి ప్రశ్నకే ప్రయాణించే వాళ్ళు కొందరుంటారు ఎల్లప్పుడూ. తమకు తెలియకుండానే ప్రతీపశాకుతల వాదనకు బలై పోతుంటారు, తమ సమాచార లేమికి బిక్క మొఖం వేస్తుంటారు.

సమాచారం…సమాచారం… అప్పుడు అనిపించింది 400 ఏండ్ల హైదరాబాదు చరిత్ర గురించి నాకు తెల్సిన సమాచారం ఎంత ? వివిధ పుస్తకాల్లో ఉన్న తుటాలే వలె పేలే సమాచారాన్ని ఒక దగ్గర చేర్చే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటది ? ఇందుకోసం నాకు విలువైన పుస్తకాల్ని అందజేసిన పరవస్తు లోకేశ్వర్ (తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్), వేణు సంకోజు (తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి) గార్లకు ధన్యవాదాలు.

చేయి తిరగిన రచయితను కాకపోయినా ..చేయి ఉన్న కూలీగా “ఇటుక మీద ఇటుక పేర్చి గోడ కట్టే మేస్త్రీగా” ముత్యాల వంటి చారిత్రక ఘట్టాలను కలిపే దారానిగా “మన చరిత్రను మళ్ళీ మరోసారి తనివి తీరా తవ్వి” నా చారిత్రక (ఉడుత) కర్తవ్యాన్ని ఒక బాధ్యతగా

“ఈ సమాచారాన్ని చదివితే ఒక ఉద్యమపు తలుపులే – సందేహం లేనే లేదు
చూస్తారేం తెరవండిక – చీకట్ల తెరను పర్రున చీరేయండిక !”

షానే షహర్ హైదరాబాద్ దక్కన్
ప్యారే షహర్ హైదరాబాద్ దక్కన్
చార్ సౌ సాల్ పురానా షహర్
ఏ షహర్ హమారా, ఏ షౌకత్ హమారా
ఏ హమారా షహర్ హైదరాబాద్ దక్కన్

ఇదేనండి ఇదేనండి మా హైదరాబాదు

1507 గోల్కొండ స్వతంత్ర రాజ్యంగా అవతరణ
1562 హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578 పురానాపుల్ నిర్మాణం
1578 నగరం గోల్కొండ కోట నుండి ముసీకి దక్షిణంగా విస్తరణ
1580 నూతన నగరానికి (ప్రస్తుత పాత నగరానికి) ఆవిష్కరణ
1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
1793 సరూర్ నగర్ లో జనావాసాలు ఏర్పడటం
1803 సుల్తాన్ శాహీలో టంకశాల ఏర్పాటు
1805 మీరాలం మండీ ఏర్పాటు
1806 మీరాలం చెరువు ఏర్పాటు
1808 బ్రిటిష్ రెసిడెన్సీ భవన నిర్మాణం
1828 చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831 చాదర్ ఘాట్ వంతెన నిర్మాణం
1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన నిర్మాణం (నయాపుల్)
1862 పోస్టాఫీసులు (డాక్ ఖానాల) నిర్మాణం
1873 బాగే ఆం – పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్ల నిర్మాణం
1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884 ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాణం
1882 చంచల్ గూడా జైలు నిర్మాణం
1883 నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం
1884 ముస్లిం జంగ్ వంతెన నిర్మాణం
1885 టెలిఫోన్ ఏర్పాటు
1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు
1893 హనుమాన్ వ్యాయమాశాల (జిమ్) ప్రారంభం
1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ సంస్థ ఏర్పాటు
1920 హైకోర్టు నిర్మాణం
1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట) నిర్మాణం
1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట నిర్మాణం
1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి నిర్మాణం
1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం
1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
1945 నిజాం – టాటాల ఉమ్మడి భాగస్వామ్యంలో డక్కన్ ఎయిర్ వేస్ ప్రారంభం

“తెలంగాణ చారిత్రకంగానే పారిశ్రామిక రంగం లో వెనకబడి ఉంది.” 1956 నవంబరు ఒకటి నుండి హైదరాబాదు ఆ రంగం ఈ రంగం అన్ని రంగాలలో వెనకబడి ఉంది అని తెలంగాణ ‘రంగ’స్థలం మీద ప్రతి రోజు ‘నిజం — it’s a lie’ అన్న నాటకం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్దనేదే నిజమైన నిజం. ఫలితంగా తెలంగాణ ఆత్మనున్యతా భావంలోకి తనకు తెలియకుండానే నెట్టివేయ బడింది. “హైదరాబాదు సంస్థానం లో పారిశ్రామికీకరణ” అన్న పరిశోధనా పత్రంలో (సి. వి. సుబ్బారావు, డిల్లీ విశ్వ విద్యాలయంలో ఆర్ధిక శాస్త్ర నిపుణులు) 1930 లోనే తెలంగాణలో పారిశ్రామిక పురోగతి ఎలా జరిగింది (కోస్తాంధ్ర, రాయలసీమలో ఎలాంటి ఫ్యాక్టరీలు లేనప్పుడే సుమారు 200 ఫ్యాక్టరీలు తెలంగాణ జిల్లాల్లో ఉండేవి) వివరించారు. ఒక వేళ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలోకి రాకపోతే ఈ దేశంలోని చేనేత పరిశ్రమ బ్రిటన్లోని చేనేత పరిశ్రమల కన్నా అభివృద్ధి చెందేదని కారల్ మార్క్స్ చెప్పినట్లు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో విలీనం కాకపోతే తెలంగాణాలోని పరిశ్రమలన్నీ ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవన్నది నగ్న సత్యం.

నిజాం కాలంలో తెలంగాణలో పారిశ్రామిక పురోగతి


1871 సింగరేణి బొగ్గు గనులు
1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876 ఫిరంగుల ఫ్యాక్టరి
1910 ప్రభుత్వ ప్రింటింగు ప్రెస్
1910 ఐరన్ ఫ్యాక్టరి
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరి
1919 వి.ఎస్.టి. ఫ్యాక్టరి
1921 కెమికల్ లాబొరేటరి
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరి
1929 డి. బి. ఆర్. మిల్ల్స్
1931 ఆజంజాహి మిల్ల్స్, వరంగల్
1932 ఆర్. టి. సి. స్థాపన
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరి
1939 సిర్పూర్ పేపర్ మిల్
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరి
1942 హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943 ప్రాగా టూల్స్
1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రోడక్స్

1956లో తుంటరి ఆంధ్రతో అమాయక తెలంగాణ పెండ్లి జరగ్గానే, ఆంధ్రా ఆఫీసర్ల జులుం మొదలైంది. ప్రభుత్వ కార్య కలాపాలను నిర్వహించటంలో మేం మీ కన్న “దీ బెస్ట్” అని తమకు తామే శభాష్ శభాష్ అంటూ సర్టిఫికెట్లు ఇచ్చుకున్రు. ఆ ఆధిక్యతా భావాల్ని ఇప్పటికీ సెక్రటేరియట్లో అట్లనే కొనసాగుతున్నాయ్. ఆరవ నిజాం కాలంలో అప్పటి ప్రధాన మంత్రి సర్ సాలార్ జంగ్ (మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ 1, GCSI, 1829 -1883) ప్రవేశ పెట్టిన పరిపాలనా సంస్కరణల వలన వివిధ శాఖలు ఎప్పుడు స్థాపించబడినాయో చుడండి:

సర్ సాలార్ జంగ్ కాలంలో “సుపరిపాలన”


1864 రెవెన్యు శాఖ
1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
1866 జిల్లాల ఏర్పాటు
1866 వైద్య శాఖ
1866 మొదటి రైల్వే లైను
1867 ప్రింటింగు మరియు స్టేషనరీ
1867 ఎండోమెంట్ శాఖ
1867 అటవీ శాఖ (జంగ్లాత్)
1869 మున్సిపల్ శాఖ
1869 పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్
1870 విద్యా శాఖ
1870 హైకోర్టు ఏర్పాటు
1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
1881 జనాభా లెక్కల సేకరణ
1882 ఎక్సైజు శాఖ (ఆబ్కారీ)
1883 పోలీసు శాఖ
1892 గనుల శాఖ
1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893 లోకల్ ఫండ్ శాఖ
1896 నీటిపారుదల శాఖ
1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
1912 సిటి ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా లెక్క)
1913 వ్యవసాయ శాఖ
1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి A.P.P.S.C. లెక్క)
1914 ఆర్కియాలజీ శాఖ
1932 ఆకాశవాణి హైదరాబాద్
1945 కార్మిక శాఖ

తెలంగానాంధ్ర పెండ్లి అయిన మొదటి రాత్రి నుండే తెలంగాణ తల్లి బిడ్డల మీద ఆంధ్ర ఆంగ్ల దొరల కూతలు: తెలంగాణ వారికి తెలివి లేదు, అంబటి గాళ్ళు, తెలుగు రాదు, చదువు రాదు. మేమే మీకు “అక్షరాభ్యాసం” చేస్నమని ఇప్పటికీ పోజులు. అందుకే ‘విజయవాడ శ్రీ చైతన్య, గుంటూరు నారాయణ’ అని ఇప్పటికీ (విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించి రక్తాన్ని పీల్చే) ఇంటి ముందు దిష్టి బొమ్మల్లా, హైదరాబాదు లో బోర్డులు వేలాడుతూనే ఉన్నాయి. ప్రస్తుత వలసాంధ్ర పాలనలో విద్య అంగడి సరుకుగా మారలేదా? విద్య సంస్కరణలన్నీ తెలంగాణలోనే ముఖ్యంగా ఉస్మానియా ఉనివర్సితీ లోనే ఎందుకు అమలు జరుగుతున్నాయి? ఒ.యు. 1939 వందేమాతరం ఉద్యమం నాటి నుండి ఈనాటి వరకు సమకాలీన సామాజిక ఉద్యమాలకు, చైతన్యానికి వేదిక నిలబడింది. “1969 జనవరి ౨౪ న కాల్పుల్లో గాయపడిన వారిని గాంధి ఆసుపత్రిలో చేర్చిన్రు. ఇంజనీరింగు కాలేజి వద్ద విద్యార్ధుల సభ జరుగుతుండగా ‘గాయపడిన వారు చావు బత్కుల్లో ఉన్రు. వారికి ఎక్కించటానికి ఆసుపత్రిలో రక్తం కావాలె’ – అన్న మేఘ సందేశం అందింది. అది విన్న పిల్లలు రక్త దానం కోసం యునివర్సిటీ నుండి గాంధీ ఆసుపత్రి వరకు పరిగెత్తే దృశ్యం ఒక అపూర్వ సన్నివేశం (అప్పట్లో విద్యార్ధులకు స్కూటర్లు, బైకులు లేవు, బందు కారణంగా బస్సులు ఆటోలు లెవ్వు).”

హైదరాబాద్ లో వెళ్లి విరిసిన విద్యాలయాలు


1856 దారుల్ ఉలూమ్ స్కూలు
1872 చాదర్ ఘాట్ స్కూలు
1879 ముఫీడుల్ అనం హైస్కూల్
1879 ఆలియా స్కూల్
1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
1884 నిజాం కాలేజి
1887 నాంపల్లి బాలికల స్కూలు
1890 వరంగల్ లో మొదటి (తెలుగు) స్కూలు
1894 ఆసఫియా స్కూలు
1894 మెడికల్ కాలేజి
1904 వివేక వర్ధిని స్కూలు
1910 మహాబుబియా బాలికల స్కూలు, గన్ ఫౌండ్రి
1918 ఉస్మానియా యునివర్సిటీ
1920 సిటీ కాలేజి
1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూలు
1924 మార్వాడి హిందీ విద్యాలయా
1926 హిందీ విద్యాలయ
1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి
1946 కాలేజి ఆఫ్ వెటర్నరి సైన్స్

 

రోగి వెళ్ళగానే రూపాయిని ప్రేమించకుండా, రోగిని రోగాన్ని ఆప్యాయతతో, ప్రేమతో, భరోసా ఇచ్చే ధైర్య వచనాలతో బలవంతంగా దవాఖానాలో అడ్మిట్ చేస్కొని ఉచితంగా మందులు మాకులతో పాటు అన్నం, డబుల్ రొట్టె, మోసంబీ పండ్లు, టమాట రసం, గుడ్లు, వోద్దన్నా ఇచ్చి ఆరోగ్యం బాగు చేసి పేషెంట్ ఇంటికి వెళ్తానని బతిమిలాడుకుంటే డిశ్చార్జ్ చేసేటోల్లు. ఏవీ ఆ బంగారు దినాలు ? ఏందీ ఈ కంపు కొట్టే నక్షత్రాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్?

అలనాటి పేద రోగుల్ని ప్రేమించిన ‘దవాఖానాలు’


1890 ఆయుర్వేదం, యునాని వైద్యశాల ఏర్పాటు
1894 మెడికల్ కాలేజి
1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905 జిజ్గిఖాన (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖానా)
1916 హోమియోపతి కాలేజి
1927 చార్మినార్ యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
1945 నీలోఫర్ చిన్నపిల్లలా దవాఖానా
గాంధి దవాఖానా,
టి. బి. దవాఖానా, ఎర్రగడ్డ,
క్యాన్సర్ దవాఖానా,
ఇ. ఎన్. టి. దవాఖానా,
నిజాం ఆర్దోపెడిక్ హాస్పిటల్,
కోరాంతి దవాఖానా


నిజాం కాలం లో తెలుగు, ఉర్దూ, హిందీ పత్రికలు


సం||      పేరు,   సంపాదకులు
1886  శేద్యచంద్రిక, ప్రభుత్వ పత్రిక
1890  దినవర్తమాన్, నారాయణ స్వామి మోదిలియార్
1909  సంయుక్త సంఘవర్తమాని, సిమోన్ పశుమలె
1913  హితబోధిని, శ్రీనివాస శర్మ
1920  ములాగ్ – వర్తమాని, ఏం. పి. టాక్
1921  సువార్తామణి, ఆల్బర్టు సామేలు
1922  తెనుగు, ఒద్దిరాజు సీతారామచంద్రరావు
1922  నీలగి,రి ఎస్. వి. నరసింహా రావ్
1923  శైవప్రచారిణి, ఎం. వి. శాస్త్రి
1923  రయ్యత్, ఎం. నర్సింగరావు
1925  భాగ్యనగర్, భాగ్యరెడ్డి వర్మ
1925  నేడు, శ్రీ భాస్కర్
1926  గోల్కొండ పత్రిక, సురవరం ప్రతాప రెడ్డి
1927  ఆది హిందూ, భాగ్య రెడ్డి వర్మ
1927  సుజాత, పి. నృసింహా శర్మ
1934  దక్కన్ కేసరి, డి. శర్మ
1936  విభూతి, చెదిరి మఠం వీరబద్ర శర్మ
1937  దివ్యవాణి, చివుకుల అప్పయ్య శాస్త్రి
1937  శోభ, దేవులపల్లి రామానుజ రావు
1944  తెలంగాణ, బుక్కపట్నం రామానుజాచార్యులు
1947  ఇమ్రోజ్, షోయభుల్లా ఖాన్

హైదరాబాద్ స్టేట్ లో గ్రంధాలయాల స్థాపన

1872 ముదిగొండ శంకరాచార్యుల లైబ్రరి, సికింద్రాబాద్
1892 ఆసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
1895 భారత్ గుణ వార్ధక్ సంస్థ లైబ్రరీ, శాలిబండ
1896 బొల్లారం లైబ్రరీ
1901 శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయం, సుల్తాన్ బజార్
1904 రాజరాజనరేంద్ర ఆంద్ర భాష నిలయం, హన్మకొండ
1905 విజ్ఞాన చంద్రికా గ్రంధ మండలి, హైదరాబాద్
1913 ప్రతాపరుద్ర ఆంద్ర భాష నిలయం, మడికొండ, వరంగల్ జిల్లా
1913 సంస్కృత కళా వరదనీ గ్రంధాలయం, సికిందరాబాద్
1923 బాలసరస్వతీ గ్రంధాలయం, హైదరాబాద్
1930 జోగిపేట గ్రంధాలయం, మెదక్ జిల్లా

“వీర తెలంగాణ నాది
వేరు తెలంగాణ నాది
వేరై కూడా తెలంగాణ –
వీర తెలంగాణ ముమ్మాటికీ

తెలంగాణ వేరై నిలిచి భారతానవేలయు ముమ్మాటికీ” — కాళోజి

***

రచయిత గురించి:

Nishanth Dongari, Lecturer (EC Marie Curie Fellow), University of Strathclyde, Glasgow, UK. Email-nishanth.uk(AT)gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *