mt_logo

నవ రసమయి

సిద్దిపేటలోని ఓ చిన్నగ్రామం రావురూకల. ఓ పేద కుటుంబంలోని పిల్లాడు బాలకిషన్. పల్లెపేద విద్యార్థుల చదువు ఎట్లా ఉంటదో అలాగే సాగింది అతని విద్యాభ్యాసం. పశువులకాపరిగా పనిచేశాడు. అయితే అతనికి కష్టాలు వచ్చిన దారిలోనే ‘కళ’ కూడా వచ్చింది. అది పాట రూపంలో! పాటలు పాడటం ఆయనకు కొత్త జీవితాన్ని చూపించింది. అది తెలంగాణ ఉద్యమంలో ధూంధాం చేసే స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు రసమయి బాలకిషన్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాటలు పాడటం ఆయన ప్రవృత్తి. ప్రస్తుతం రసమయి జీవితం కీలక మలుపు తీసుకునే దశ. ఎందుకంటే తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే మరో ప్రయత్నంగా ‘జై తెలంగాణ’ సినిమాను తీశాడు. ఆయన లైఫ్‌లో ఈ చిత్ర నిర్మాణం ఒక పెద్ద టర్నింగ్‌పాయింట్. అందుకే మళ్లీ ఒకసారి గతమంతా గుర్తు చేసుకుంటున్నాడు.

ఇలా మొదలై…

‘ఎన్నో కష్టాల మధ్య పెరిగిన. హాస్టల్‌లో చదువుకున్న. మొత్తానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నా. నిజానికి నా జీవితంలో మొదటి మలుపు ఎనిమిదో తరగతిలోనే. ఎందుకంటే అప్పుడు సిద్దిపేట నుంచి కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఆ ప్రచారంలో నేను పాటలు పాడాను. చాలా ప్రశంసలు! అది మొదలు నా పాట ఎక్కడా ఆగలేదు. కాలక్రమంలో కళామండళ్లు, ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేశాను. ప్రజాగాయకులు, కవులందరితో కలిసి పనిచేశాను. తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత నా కళకు ఒక సార్థకత ఏర్పడే అవకాశం దొరికినట్టయింది. కళాకారుడిగా తెలంగాణ పట్ల కలిగిన ప్రజా చైతన్యంలో నా వంతు పాత్ర పోషించాను. నేను మొదలుపెట్టిన ‘ధూం ధాం’ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు నన్ను మరింత దగ్గర చేశాయి. అది ఉద్యమానికి ఊతంలా నిలిచింది. అయితే ధూం ధాం మొదలవ్వడం కూడా నా జీవితంలో మరో మలుపే. ఎందుకంటే ప్రజలకు బాగా చేరువచేసింది ఆ కార్యక్రమమే.

నా జీవితంలో తప్పకుండా చెప్పుకోవాల్సిన ఇంకో టర్నింగ్ పాయింట్ కేసీఆర్‌తో పరిచయం. ఆయన టీఆర్‌ఎస్ పార్టీ పెట్టినప్పుడు అందుకోసం ‘తెలంగాణ జయభేరి’ అనే ఆడియో ఆల్బమ్ చేశాను. సూపర్ సక్సెస్8. కేసీఆర్ దగ్గరే ఉద్యమ పాఠాలు నేర్చుకున్నాను. ఆయనతో నాది మంచి అనుబంధం. నేను మాట్లాడే తెలంగాణ భాషకు, యాసకూ ఆయనే స్ఫూర్తి.

కళాకారుడిగా ఎన్నో ప్రయివేట్ ఆల్బమ్స్ చేసిన నేను ఉద్యమంలో భాగంగా తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగాను. ఆంధ్రపాలకుల అన్యాయానికి గురవుతున్న మన తెలంగాణ బతుకులు కళ్లారా చూశాను. ఈ సారి భారీ ప్రయత్నంగా సినిమా ప్రాజెక్ట్ మొదలు పెట్టాను. ఇదీ నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింటే. వందల స్టేజీ ప్రోగ్రామ్స్‌తో తెలంగాణ ప్రజానాడీ తెలిసిన నాకు ‘జై తెలంగాణ’ చిత్రానికి దర్శకత్వం వహించడం, మాటలు రాయడం పెద్దగా కష్టమనిపించలేదు.

సినిమానే ఎందుకు?

ఇప్పుడు సినిమా అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ కాదు. అదొక సామాజిక బాధ్యత కూడా. అందుకే ప్రజాచైతన్యంలో సినిమా ప్రధాన పాత్ర పోషిస్తుందని నమ్మి ై‘జె తెలంగాణ’ చిత్రాన్ని తీశాను. వేదనాభరితమైన అక్షరాలను, ఆవేశపూరితమైన పదాలను దృశ్యరూపంలో చూస్తే మరింత ఉత్తేజితులు అవుతారు ప్రేక్షకులు. అందుకే సినిమా అనేది కాస్ట్‌లీ విషయమైనా ప్రజా చైతన్యం కోసం నేను స్వీకరించిన ఒక అక్షరాయుధం వంటిదే అనుకుంటున్నా. చిత్ర పరిశ్రమలో తెలంగాణ నటీనటులకు, కళాకారులకు సరైన అవకాశాలు లేవనేది పచ్చినిజం. అందుకే నిఖార్సైన తెలంగాణ ఆర్టిస్టులతో, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని తీశాం. ఈ సినిమా చూశాక తెలంగాణ కళాకారుల సత్తా ఏంటో తెలుస్తుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి తొలి సెన్సార్ చిత్రం ఈ సినిమానే.

నేను నా జీవితంలో ఎన్ని మలుపులను చూశానో ఈ సినిమా తీయడంలో కూడా అనేక అనుభవాలు, కష్టాలు చవిచూశాను. అందుకే నా జీవితం గురించి చెప్పుకున్నట్టే ఈ సినిమా గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

అన్నీ అడ్డంకులే…

ఇవాళ తెలంగాణ వాళ్లు ఒక సినిమా తీయాలంటే మొదటి ఆటంకం ఎదురయ్యేది టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గరే. ఎందుకంటే అప్పటికి సదరు చిత్ర నిర్మాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ అయ్యుండాలి. లేకపోతే నాలుగైదు లక్షలు సమర్పయామి! అన్నీ భరించి, తెగించి సినిమా తీసినా చివరకు థియేటర్లు దొరకవు! నేనూ వాటిని ఫేస్8 చేశాను. ఈ రోజు కేసీఆర్ లేకపోతే నా సినిమా ఏమయ్యేది? దేవి థియేటర్‌లో నడిచేదా? అందుకే నా సినిమాకు దక్కిన మొదటి విజయం హైద్రాబాద్ దేవి థియేటర్‌లో రిలీజ్ కావడమే.

ఆ కష్టం నాకే తెలుసు…

రెండేళ్ల క్రితం మొదలైన మా చిత్రం ఇవ్వాల్టికి పూర్తయింది. అందుకు ప్రధాన కారణం ఒక్కటే… డబ్బులు! సినిమా మధ్యలోనే డబ్బులైపోయినయ్. షూటింగ్ ఆపేశాం. మళ్లీ డబ్బులు పోగుచేసుకుని షూటింగ్ మొదలుపెట్టాం. నేను మరిచిపోలేని ఒక అనుభవం ఏమిటంటే నా ఫ్రెండ్‌వాళ్లమ్మ వడ్లు అమ్ముకున్న పైసలు లక్షరూపాయలు ఇచ్చింది మా బాధ చూడలేక. ‘కొంచెం ముందుగా చెప్తే ఇంకో యాభై సర్దేదాన్ని కదా బిడ్డా’ అంది. తెలంగాణ మీద సినిమా అంటే ఎంతటి ఆదరణ ఉందో నాకు తెలిసింది. మరింత పట్టుదలతో సినిమా పూర్తి చేశాను. ఎక్కడా రాజీ పడలేదు. ఇరవై తొమ్మిది నిమిషాల గ్రాఫిక్స్, భారీసెట్టింగ్స్‌తో… ఆంధ్రవ్యాపార చిత్రాలకు దీటుగా తీశాను. ఇంతకుముందు కూడా తెలంగాణ మీద సినిమాలు వచ్చాయి. కానీ మా చిత్రంలో కథ చెప్పిన విధానంలో కొత్తదనం కనిపిస్తుంది. ప్రేక్షకులు ఫ్రెష్‌నెస్8 ఫీలవుతారు. హండ్రెడ్ పర్సెంట్ ఆకట్టుకుంటుంది.

సినిమా హిట్టు అయితే మరో సినిమాకు శ్రీకారం పడిపోద్ది…ఒకవేళ ఫలితం తేడాగా ఉంటే మళ్లీ నా కష్టాల జీవితంలోకి జారుకుంటా. అఫ్‌కోర్స్ బతకడం కష్టమేమీ కాదు. అయినా ఎంతో ఉద్వేగంతో తీసిన జై తెలంగాణ చిత్రాన్ని ఆదరించే బాధ్యతను ప్రజలకే వదిలేసి నిలబడి ఉన్నా! ఇది తెలంగాణ అమరవీరులను చూపించే చిత్రం. ఉద్యమంలో పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఓదార్పునిచ్చే సినిమా’.

బీఎమ్మార్

నమస్తే తెలంగాణ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *