రైతుబంధు స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తున్న ప్రజలు

  • May 16, 2018 12:46 pm

రైతుబంధు పథకం ద్వారా తమకు చేకూరిన లబ్ధిని కౌలురైతులతో పంచుకోవడానికి సిద్ధపడుతున్న రైతులు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఏ లక్ష్యం కోసం అయితే రైతుబంధు పథకం ప్రవేశపెట్టారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ముందుకువస్తున్న రైతన్నలు. ఇప్పటికే ఒకవైపు పెద్ద రైతులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు రైతుబంధు పథకం ద్వారా తమకు వచ్చిన నగదు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికే తిరిగి ఇస్తున్నారు. మరోవైపు మరికొంతమంది రైతులు తమకు చేకూరిన ప్రయోజనాన్ని కౌలు రైతులకు కూడా పంచుతూ రైతుబంధు స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం, చేగుంట గ్రామానికి చెందిన లంబు రాజిరెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు రైతుబంధు పథకం కింద తనకు వచ్చిన మొత్తాన్ని తీసుకొని, కౌలురైతుకు ఎకరానికి 4000 రూపాయలను మినహాయించుకుంటున్నానని తెలిపాడు. దీనితో నేరుగా పెట్టుబడి సాయం ప్రయోజనం నేరుగా కౌలు రైతుకు అందినట్లయింది. కరీంనగర్ పట్టణానికి చెందిన ఒక డాక్టర్ కు మానకొండూరు మండలంలో భూములు ఉన్నాయి. దీనితో రైతుబంధు సాయం కింద డాక్టర్ పేరుతొ చెక్కులు జారీ చేయబడ్డాయి. కానీ తన పేరు మీద భూములు ఉన్నప్పటికీ, తన భూములను కౌలురైతు సాగు చేస్తుండడంతో, కౌలు రైతుకు అండగా నిలబడి ఎకరాకు 5000 రూపాయల కౌలును తగ్గించడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల వ్యవసాయానికి దూరంగా ఉన్న రైతులు తమకు అందిన ప్రయోజనాలను ఎదో ఒక రూపంలో కౌలు రైతులకు అందిస్తూ రైతుబంధు పథకం స్ఫూర్తిని, ముఖ్యమంత్రి గారి ఆలోచనను మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం చేపట్టిన ఒక పథకాన్ని, దాని లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ విధంగా ప్రజలు భాగస్వామ్యం కావడం చాలా అరుదయిన సందర్భంగా చెప్పవచ్చు.

విదేశాల్లో ఉంటున్న రాష్ట్రానికి చెందిన ఐటీ ఉద్యోగులు సైతం రైతుబంధు పథకం కింద తమ పేరు మీద వచ్చిన నగదు ప్రయోజనాలను కౌలు రైతులకు అందజేస్తున్నట్లు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తుండటంతో, మరింతమందికి ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. మొత్తం మీద కౌలు రైతుల ప్రయోజనాలు కాపాడటానికి యజమానులు ముందుకు రావడం ప్రభుత్వానికి నిజంగా రైతుబంధు పథకం అనుకున్న లక్ష్యాలను ఛేదించే దిశలో ముందుకు వెళ్తోందని చెప్పవచ్చు.


Connect with us

Videos

MORE