mt_logo

పగిలిన పాపాల పుట్ట

By ఇళ పావులూరి మురళీ మోహన రావు
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడటం తప్పకుండా ప్రజలను ఆలోచింపజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యాలు అవుతాయనడంలో సందేహం లేదు.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యికోట్ల రూపాయల అక్రమార్జన! కేవలం ఎమ్మెల్యే హోదాలోనే చెలరేగిపోయిన మాజీ టీడీపీ నాయకుడు, నేటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధనదాహ లీలలు ఇవి! రాష్ట్రం దాటితే ఎవరికీ తెలియని ఒక నాయకుడికి హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్ దేశాల్లో ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు! ఇక ఇతను పొరపాటున ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయితే? తలచుకుంటేనే భయం వెయ్యడం లేదూ? తెలంగాణ రాష్ట్రం ఆస్తులన్నీ సహేంద్ర రేవంతాయస్వాహా అవుతాయేమో?

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం తొలిరోజుల్లోనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. దోపిడీకి మారుపేరైన టీడీపీలో సౌకర్యవంతంగా ఇమిడిపోగలిగారు. టీడీపీ అధినేతకు అంతరంగికులు కాగలిగారంటే అలాంటి అక్రమాల క్వాలిఫికేషన్ తోనే అనుకుంటే పొరపాటు లేదు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని చంద్రబాబు విశ్వసించారంటే రేవంత్ శక్తి సామర్థ్యాల మీద ఎంత నమ్మకం ఉండాలి ఆయనకు? కానీ, దురదృష్టమేమంటే, బాబు డాష్ బోర్డుకు కానీ, రేవంత్ కుశాగ్రబుద్ధికి కానీ, ఏసీబీ వారు అంతకుముందే అక్కడ పన్నిన ఉచ్చులు కనిపించలేదు. అందుకే ఏదో చుట్టం ఇంటికి సూటుకేసులతో ధైర్యంగా వెళ్లగలిగారు. యాభై లక్షల ధనలక్ష్మిని సెబాస్టియన్‌కు నైవేద్యంగా సమర్పించుకుంటూ, మిగిలిన నాలుగున్నర కోట్ల భోషాణాన్ని కూడా త్వరలో అందజేస్తామని హామీ ఇస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిపోయారు.

రేవంత్‌రెడ్డి వీడియో సాక్షిగా దొరుకడంతో పాటు అదే వీడియోలో ఏపీ సీఎం చంద్రబాబు స్వరాన్ని కూడా పట్టించి ఎనలేని మేలు చేశారు. ఫలితంగా రాత్రికిరాత్రే చంద్రబాబు అమరావతికి పారిపోయారు. రేవంత్‌రెడ్డి నెలరోజులు రిమాండ్ ఖైదీగా కాలం గడిపారు. అసలు రేవంత్‌రెడ్డికి ఆ అరకోటి మూట ఎవరిచ్చారు? మిగిలిన నాలుగున్నర కోట్ల ఖజానా ఇస్తామని హామీ ఇచ్చిన ఆ దానవీరశూర కర్ణుడు ఎవరు? అనే ప్రశ్నలకు నేటికీ జవాబులు దొరుకలేదు. వాటితో పాటుగా 2009, 2014 ఎన్నికల ప్రమాణ పత్రంలో రేవంత్‌రెడ్డి పేర్కొన్న ఆస్తులకు, ఆయన అసలు ఆస్తులకు ఎక్కడా లంగరు అందటం లేదు. ఎవరో ఒక సమాజహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ అధికారులు సకల వివరాలను సేకరించి ఒక్కసారిగా రేవంత్‌రెడ్డి ఇంటి మీద దాడులు చెయ్యడంతో ఇంతవరకూ సామాన్య ప్రజానీకానికి తెలియని ఆ సహస్ర కోట్ల ఖజానాకు తూట్లు పడి వెలుగులోకి వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ వారి దౌర్భాగ్యమేమంటే, రేవంత్‌రెడ్డి చేసిన అక్రమ లావాదేవీలు అన్నీ, ఆయన టీడీపీలో ఉండగా చేసినవి. కానీ, ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండగా బయటపడటంతో కాంగ్రెస్ పిసుక్కోలేక చచ్చిపోతున్నది. ఎన్నికలకు ముందు రేవంత్ మీద దాడులు చెయ్యడం కుట్ర అని కేకలు పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అలాగే కేసీఆర్ ఈ దాడులు చేయించారని ఆక్రోశిస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ వారు ఏడెనిమిదేండ్లు వెనక్కి వెళ్లి తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో సింహావలోకనం చేసుకోవడం శ్రేయస్కరం. వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఏక కాలంలో సీబీఐ, ఐటీ, ఈడీ వారు మిడతలదండులా విరుచుకొని పడ్డప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కేంద్ర సంస్థల దాడులతో మాకేం సంబంధం? చట్టం తన పని తాను చేసుకునిపోతుంది? అంటూ ప్రవచనాలు ఇచ్చారు. మరిప్పుడు ఐటీ శాఖ రాష్ట్ర సంస్థ కిందికి వచ్చిందా? కేసీఆర్ చేతిలో ఉన్నదా? కేసీఆర్ చెబితే దాడులు చేస్తున్నదా? ఎన్నికల సమయంలో దాడులని అరిచే కాంగ్రెస్ నాయకులు నాడు జగన్ మీద దాడులు చేసినపుడు ఉప ఎన్నికలు జరుగలేదా? ఉప ఎన్నికలు జరిగిన సమయంలో జగన్ జైల్లోనే కదా ఉన్నాడు? ఊళ్ళో అందరి సెగగడ్డలు సర్రున కోసే వైద్యుడు, తనకొచ్చిన సెగ గడ్డను మరో వైద్యుడు కోస్తున్నపుడు ఆకాశం బద్దలయ్యేలా ఏడ్చాడట! అలా ఉంది కాంగ్రెస్ నాయకుల శైలి!

దర్యాప్తు సంస్థలు తమకొచ్చిన సమాచారం ఆధారంగా అన్ని వివరాలు సేకరించి ఎవరి మీదైనా దాడులు చేస్తాయి. కొన్నాళ్ల కిందట టీఆర్‌ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులురెడ్డికి చెందిన సంస్థల మీద కూడా దాడులు చేశాయని మరిచారా? నిజానికి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీసుకునే దుష్టబుద్ధి కేసీఆర్‌కు లేదని గత నాలుగున్నరేండ్లలో నిర్ద్వంద్వంగా రుజువైంది. రేవంత్‌రెడ్డి ఏం అమాయకుడు కాదు. ఆయన నేర చరిత్రకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రపంచం మొత్తం కళ్ళు విప్పార్చుకొని చూసింది. నిజానికి రేవంత్‌రెడ్డికి శిక్ష పడలేదని ప్రజాస్వామ్యవాదులు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ఇన్నాళ్లకు ఒక కదలిక వచ్చిందని సంతోషించక కేసీఆర్ మీద నిందలు వేస్తే ఏమి ప్రయోజనం? అయితే చాలామంది భావించే దేమంటే, ఓటు కు నోటు కేసులో రేవంత్‌రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమే. అసలు సూత్రధారులు వేరే ఉన్నారనేది జనాభిప్రాయం. ఆ సూత్రధారులను కూడా వెలికితీయాల్సిన అవసరం ఉన్నది.

తన ఉప ముఖ్యమంత్రి మీద ఏవో ఆరోపణలు వస్తే మరు నిమిషంలో పదవీ నుంచి తొలిగించిన ఘన చరిత్ర కేసీఆర్‌ది. రేవంత్ రెడ్డి మీద ఇన్ని ఆరోపణలు వచ్చినపుడు అతన్ని పదవీ నుంచి తొలిగించి, ప్రజలకు క్షమాపణ చెప్పుకోవలసిన కాంగ్రెస్ పార్టీ, అలాంటి గొప్ప సంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను కాలరాచి, ఒక నిందితుడికి వత్తాసు పలుకాల్సిరావడం ఆ పార్టీలో దిగజారిపోతున్న విలువలకు అద్దం పడుతున్నది.

ఒక అక్రమార్జనపరుడిని ముందేసుకొని రేపు ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు కాంగ్రెస్ నాయకులు? వెయ్యి కోట్లు సంపాదించిన నేరగాడు మీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడని అడిగితే కాంగ్రెస్ దగ్గరున్న సమాధానమేమిటి? నిజానికి ఐటీ శాఖ దాడుల్లో ఏ క్షణమైతే రేవంత్‌రెడ్డి ఆస్తులు పట్టుబడినాయో, ఆ క్షణమే రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, నిర్దోషిత్వం నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ పార్టీలోకి రమ్మని ఆదేశిస్తే కాంగ్రెస్ ఇమేజ్ అంబరాన్నంటేది. కానీ, స్కాంగ్రెస్‌గా అపఖ్యాతి తెచ్చుకున్న కాంగ్రెస్‌లో అలాంటి నైతికవిలువలకు చోటెక్కడిది?

ఇక మరో కోణంలో చూస్తే, రేవంత్‌రెడ్డికి పార్టీలో ఎక్కడాలేని ప్రాధాన్యం ఇవ్వడం జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులే రేవంత్ అక్రమార్జన మీద దర్యాప్తు సంస్థలకు ఉప్పు అందించారని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ చేసిన ఆరోపణలను కూడా తేలికగా కొట్టి వెయ్యలేం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు డజనుకు పైగా ఉన్నారు. వీరిలో వీరికి ఒకరంటే మరొకరికి పొసగదు. ఒకరిమీద మరొకరు కుట్రలు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నైజమే అది. నేరగాళ్లకు సమర్థనగా నిలబడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఊహించడానికే మేను జలదరిస్తుంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడటం తప్పకుండా ప్రజలను ఆలోచింపజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యాలు అవుతాయనడంలో సందేహం లేదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *