mt_logo

పారిశ్రామికాభివృద్ధికి మరో అడుగు

– రేపు సీఎం చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు అంకురార్పణ
– పీ అండ్ జీ కంపెనీ ప్రారంభోత్సవం.. పోలెపల్లి సెజ్‌ను పరిశీలించనున్న కేసీఆర్
తెలంగాణలో పారిశ్రామిక విప్లవ సాధనలో ఓ ముందడుగు. మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారంనాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా రెండు నూతన కంపెనీలకు శంకుస్థాపన, మరో కంపెనీలో ఉత్పత్తికి ప్రారంభోత్సవం జరగనుంది. ఈ జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్లలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హోం ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ తన ఉత్పత్తులను ఆరంభిస్తుంది. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్, కోజెంట్ గ్లాస్ లిమిటెడ్ సంస్థలు ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు గురువారం భూమి పూజ జరుగనుంది.

గురువారం మధ్యాహ్నం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హోం ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ముఖ్యమ్రంతి ప్రారంభోత్సవం చేస్తారని, అలాగే మిగిలిన రెండింటికి శంకుస్థాపనలు జరుపుతారని అధికారవర్గాలు తెలిపాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర మంగళవారం పర్యవేక్షించారు.ఈ పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం పోలేపల్లిలో 954 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. అందులోని పరిశ్రమల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు సీఎం పర్యటన జరుగుతున్నది. 2003లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ సెజ్‌ను ఏర్పాటు చేసింది. 90 ప్లాట్లను వివిధ కంపెనీలకు కేటాయించింది. ఐతే అందులో ప్రస్తుతం ఏడు కంపెనీలు మాత్రమే పని చేస్తున్నాయి.

హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఎప్సిలాన్ ఫార్మా, ఏపీఎల్ హెల్త్‌కేర్ లిమిటెడ్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్, మైలాన్ ల్యాబరేటరీస్, రైచెమ్ లైఫ్ సైన్సెస్, ఆప్టిమస్ జనరిక్స్ కంపెనీలు మాత్రమే ఇపుడు అక్కడున్నాయి. సెజ్‌లో పరిస్థితులను సమీక్షించి మెరుగైన చర్యలు చేపట్టాలని సీఎం సంకల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో 170 ఎకరాల్లో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హోం ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటైంది. ఫ్యాబ్రిక్, హోం కేర్, బ్యూటీ కేర్, ఓరల్ కేర్, ఫిమినైన్ కేర్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. రూ.370 కోట్లతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ కంపెనీ కల్పించే ఉపాధిలో తెలంగాణ వారికి కనీసం 80 శాతం అవకాశమివ్వనున్నారు. దీంతో ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *