mt_logo

ట‌ర్మ‌రిక్ బోర్డ్ -2017 బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌

– ప‌సుపు దిగుమ‌తుల‌ను త‌క్ష‌ణ‌మే ఆపాలి: ఎంపి క‌విత డిమాండ్‌

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం ట‌ర్మ‌రిక్ బోర్డ్ – 2017 బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌యివేటు మెంబర్ బిల్లు రూపంలో ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు డిల్లీలోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ప్రాంతంలో ప‌సుపు పంట అధికంగా సాగ‌వుతున్న‌ద‌ని చెప్పారు. వాతావ‌ర‌ణ మార్పులు, మార్కెట్ ఒడిదుడుకులు ప‌సుపు రైతులను ఆర్థికంగా న‌ష్టం చేకూరుస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌సుపు రైతుల‌ను ఆదుకోవ‌డానికి  ప‌సుపు బోర్డు ఏర్పాటు ఒక్క‌టే మార్గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ప‌సుపు రైతుల‌తో పాటు ఎమ్మెల్యేలు సైతం డిల్లీకి కూడా వ‌చ్చార‌ని తెలిపారు. ప‌లుమార్లు కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తులు చేయ‌డం, లేఖ‌లు రాయ‌డం వ‌ల్ల కేంద్రంలో క‌ద‌లిక వ‌చ్చింద‌ని చెప్పారు. అయితే 54 రకాల వాణిజ్య పంట‌ల‌ను ప‌ర్య‌వేక్షించే స్పైసెస్ బోర్డును 5 రీజియ‌న‌ల్ బోర్డులుగా విభ‌జించార‌న్నారు. తెలంగాణ క‌న్నా త‌క్కువ ప‌సుపు పండే ఏపిలోని గుంటూరులో ప‌సుపు పర్య‌వేక్షించే బోర్డును ఏర్పాటు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌తో పాటు స‌మానంగా ప‌సుపును పండించే త‌మిళ‌నాడులో కాని మరెక్క‌డ‌యినా ఆ బోర్డును పెడితే బాగుండేద‌ని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌సుపు రైతుల‌ను ఆదుకోవాల్సిన కేంద్రం కాంబోడియా వంటి దేశాల నుంచి త‌క్కువ నాణ్య‌త కలిగిన ప‌సుపును దిగుమ‌తి చేసుకుంటున్న‌ద‌ని, ఈ చ‌ర్య ప‌సుపు రైతుల న‌డ్డి విర‌వ‌డ‌మేనని కేంద్రం వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. మ‌రో వైపు మ‌న ప‌సుపు ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతున్న‌ద‌ని, 1 వేయి కోట్ల రూపాయ‌లు ఎగుమ‌తుల వ‌ల్ల ఆదాయం స‌మ‌కూరుతున్న‌ద‌ని క‌విత చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే తాను ఇవాళ ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లును ప్ర‌వేశ పెడుతున్న‌ట్లు క‌విత వివ‌రించారు.

దేశీయ‌ పసుపు సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 40 శాతం కాగా, దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 63 శాతంగా ఉంది. నా నియోజకవర్గం అతిపెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంద‌ని తెలిపారు. ప్ర‌ధానంగా ప‌సుపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, అసోం, ప‌శ్చిమ బెంగాల్, మేఘాల‌య రాష్ట్రాల‌లో ఎక్కువ‌గా సాగవుతున్న‌ద‌ని క‌విత వివ‌రించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలను క‌ల్పించింద‌ని, స‌కాలంలో విత్తనాలు, ఎరువులు అంద‌జేస్తున్న‌ద‌ని తెలిపారు. అలాగే రైతుల ప్రయోజనం కోసం ఇతర ఇన్‌పుట్స్‌ను అందించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎల్ల‌వేళలా సిద్ధంగా ఉంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని కోరారు.

నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు ఏర్పాటుకు త‌న‌వంతుగా మద్దతు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ఎంపి క‌విత తెలిపారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 16న ప‌తంజ‌లి గ్రూప్ ట్రస్టీ, యోగా గురువు బాబా రాందేవ్ ను క‌లిశాన‌ని చెప్పారు. ప‌సుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాయాల‌ని రాందేవ్‌ను కోరాన‌న్నారు. ప‌తంజ‌లి స్పైస్ యూనిట్‌ను కూడా నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత రైతుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం తాను మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ప‌డ్న‌వీస్‌, గ‌త‌ కేర‌ళ సిఎం ఊమెన్ చాందీల‌ను క‌లిసి మద్దతు కోరానని, వారు సానుకూలంగా స్పందించి కేంద్రానికి త‌మ మ‌ద్ధ‌తు లేఖ‌ల‌ను రాశార‌ని క‌విత తెలిపారు. గ‌త కేంద్ర వాణిజ్య శాఖ‌ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిశాన‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిశాన‌ని ప‌సుపు రైతుల‌ను ఆదుకుంటామ‌ని మోడీ హామీనిచ్చినప్ప‌టికీ త‌ర‌వాత ప‌ట్టించుకోలేద‌న్నారు.

ప‌సుపు బోర్డు ఏర్పాటు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు
ఈ బిల్లు పాస్‌ అయితే ప‌సుపు బోర్డు ఏర్పాటుకు మార్గం సుగ‌మ‌మం అవుతుంది. ప‌సుపు బోర్డులో ఛైర్మ‌న్‌తో పాటు నోడ‌ల్ మినిస్ట్రీ ఎంపిక చేసిన ఎంపిలు, ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు, ప‌సుపు రైతుల ప్ర‌తినిధులు, ఎగుమ‌తిదారులు, శాస్త్ర‌వేత్త‌లు ఉంటారు. ప‌సుపును ఎగుమ‌తి చేసుకునే అవ‌కాశాన్ని ప‌సుపు బోర్డు క‌లిగిస్తుంది. అలాగే క‌నీస మద్దతు ధ‌ర రైతుల‌కు ద‌క్కుతుంది. అధిక దిగుబ‌డుల‌ను ఇచ్చే ప‌సుపు ర‌కాల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతాయి. ప‌సుపు రైతుల‌కు ఆధునిక సాగు ప‌ద్ధ‌తులు, స‌స్య‌ర‌క్ష‌ణ‌, మార్కెటింగ్ నైపుణ్యం, నిల్వ చేసేకునే ప‌ద్ధ‌తులు వంటి అంశాల్లో సాంకేతిక స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంది. మార్కెట్‌లో ధ‌ర త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు పండించిన ప‌సుపును నిల్వ చేసుకోవ‌డం ప్ర‌స్తుతం ఇబ్బందిగా ఉంది. బోర్డు ఏర్ప‌డితే స్టోరేజి సౌక‌ర్యం ల‌భిస్తుంది. దీని వ‌ల్ల ధ‌ర బాగుంది అనుకున్న‌ప్పుడే ప‌సుపును అమ్ముకోవ‌చ్చు. ప‌సుపు బోర్డు ఏర్పాటు వ‌ల్ల ముఖ్యంగా ప‌సుపు పంట‌కు బీమా సౌక‌ర్యం క‌లుగుతుంది. ప్ర‌కృతి వైప‌రీత్యాలు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ప‌సుపు పంట దెబ్బ‌తిన్న‌ట్ల‌యితే ప‌సుపు రైతును బీమా సౌక‌ర్యం ఆదుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *