ప్రజలకు నల్లా నీళ్ళు.. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్ళు!

  • October 17, 2015 5:11 pm

నల్గొండ జిల్లా పానగల్ ఉదయసముద్రం దగ్గర వాటర్ గ్రిడ్ పథకానికి నేడు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ పథకం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలుసుకుని ప్రశంసించారని, కానీ పక్కనే ఉండే మన పెద్దలు జానారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలకు అర్ధం కాలేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాటర్ గ్రిడ్ పథకం రూపొందించాం.. ఫ్లోరోసిస్ సమస్య చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. అందుకే నల్గొండ జిల్లాకు ప్రథమ ప్రాధాన్యం. ఏడాదిన్నరలోపు నల్గొండ జిల్లా ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరును అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

వాటర్ గ్రిడ్ లో అంతులేని అవినీతి జరుగుతుందన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. కట్టని ఇళ్ళపై బిల్లులెత్తిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో కోట్ల రూపాయలు బైటపడ్డ విషయం ప్రజలు మర్చిపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు రూ. 7వేల కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేసినప్పుడు భట్టి విక్రమార్క ఏం చేశాడు? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు ప్రజల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు కాంగ్రెస్ పై భరోసా లేదు. అందుకే రాహుల్ గాంధీని తీసుకొచ్చి రూ. 2 లక్షల రుణమాఫీ అన్నా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేదు. లక్ష రూపాయల రుణమాఫీ అన్న టీఆర్ఎస్ పార్టీనే నమ్మి ఓటేశారని గుర్తుచేశారు. పోలీస్ స్టేషన్ లో విత్తనాలు సరఫరా చేసిన ఘనత గత ప్రభుత్వాలదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు సరిపడా విత్తనాలు అందిస్తున్నామని మంత్రి చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలుచేస్తున్నాం.. ముఖ్యమంత్రి మనవడు ఎలాంటి సన్నబియ్యం తింటున్నాడో సంక్షేమ హాస్టళ్లకు కూడా అదే సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ మొత్తానికి వెలుగులు నింపేలా 5,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఎండాకాలం నుండి పట్టపగలే రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని కేటీఆర్ తెలిపారు.


Connect with us

Videos

MORE