అడవుల్లో మెటల్ డిటెక్టర్లు!!

  • February 7, 2019 12:33 pm

వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీశాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించబోతున్నది. అటవీ ప్రాంతాలకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో, అన్ని చెక్ పోస్టుల్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమర్చాలని అధికారులు నిర్ణయించారు. అభయారణ్యాల్లో వేటగాళ్ళు రకరకాల ఉచ్చులు, ఉరులు బిగించి వన్యప్రాణులను హతమారుస్తుండడం, పెద్దపులుల చర్మాలను ఒలుస్తున్న క్రమంలో సాంకేతికతతో వారిపై ఉక్కుపాదం మోపాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం లో వరుసగా పెద్దపులులు, చిరుత పులులు వేటగాళ్ళ ఉచ్చులకు బలయిన నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం పోలీసులు వాడుతున్న హ్యాండ్ ఫ్రేం మెటల్ డిటెక్టర్లను కొనుగోలు చేసి మొదట కవ్వాల్, అచ్చంపేట-అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యాల్లో వాడాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

వేటగాళ్ళు పొదలమాటున, చెట్ల గుబురుల్లో అమర్చే ఉచ్చులు భూమిపై తేలి ఉన్నప్పటికీ, వాటిని గుర్తించడం అటవీ సిబ్బందికి కష్టంగా ఉంటుంది. అదే మెటల్ డిటెక్టర్లు ఉపయోగించడం ద్వారా ఉచ్చులను రెండు మీటర్ల దూరం నుండే బీప్ సౌండ్ ద్వారా గుర్తించవచ్చని అధికారులు చెప్పారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో శిక్షణ పొందిన రెండు జర్మన్ షెపర్డ్ డాగ్ స్క్వాడ్లు నెలరోజుల క్రితం రాష్ట్రానికి వచ్చాయి. వాటిని కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాల్లో స్మగ్లర్ల కదలికలు పసిగట్టడానికి ఉపయోగిస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులను వేటాడడానికి వేటగాళ్ళు ఎక్కువగా కరెంట్ వైర్లు వాడుతున్న నేపధ్యంలో అటవీ ప్రాంతాల్లో ఇన్సులేటెడ్ వైరింగ్ ను ఏర్పాటుచేసే విషయమై అటవీశాఖ అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు.


Connect with us

Videos

MORE