mt_logo

మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

మెదక్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు నామినేషన్ల ఘట్టం బుధవారం ముగిసింది. టీఆర్ఎస్ పార్టీ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ తరపున జగ్గారెడ్డి నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ బీబీ పాటిల్, భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు, స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు వెంటరాగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శరత్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఇదిలాఉండగా, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, బీజేపీ నాయకుడు చాగండ్ల నరేంద్రనాథ్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ ఇంట్లో మంత్రి హరీష్ రావు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, భారీ మెజారిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు.

ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, అన్ని వర్గాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఆదరిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకునేలా తనకు టిక్కెట్ ఇచ్చిన ముఖ్యమంత్రికి, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైను నిర్మాణ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *