mt_logo

మా పీవీ పేరు మీరు పెట్టుకుంటారా?

By: కట్టా శేఖర్‌రెడ్డి

తెలంగాణ సమాజం అంతా చెన్నారెడ్డిని ద్రోహి అనుకునేలా చరిత్ర రచన జరిగింది. మన నాయకులను చిన్నవాళ్లుగా చూపించి, తమ నాయకులను పెద్దవాళ్లుగా చూపించే కుట్ర అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. చంద్రబాబును గొప్పగా చూపించడం, కేసీఆర్‌పై విష ప్రచారాలు చేయించడం ఇందులో భాగమే. ఆంధ్ర పార్టీల ఏజెంట్లు, ఆంధ్ర మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఆంధ్ర ముద్రలను మనపై రుద్దే ఇటువంటి శక్తులను ఏదోరకంగా వదిలించుకోవడం తప్ప మనకు మరో గత్యంతరం లేదు.

ఎన్టీఆర్ అందరి మనిషి, ఆయన పేరు పెడితే కాదంటారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అందరి మనిషిపై ఆంధ్రజ్యోతి, ఈనాడుల్లో అన్నన్ని అభాండాలు ఎందుకు రాయించావు? అందరి మనిషికి వ్యతిరేకంగా కుట్రచేసి ఎమ్మెల్యేలను, ఎన్టీఆర్ కుటుంబాన్ని నీకు అనుకూలంగా ఎలా పోగేశావు? అందరి మనిషిని అధికారం నుంచి ఎందుకు కూలదోశావు? అందరి మనిషిని గుండెపగిలి చనిపోయేట్టు ఎందుకు వేధించావు? అందరి మనిషిపై వైస్రాయ్ హోటల్ ముందు ఎందుకు చెప్పులు వేయించావు? చావగొట్టి సంతాప సభలు పెట్టడం, చెప్పులు వేసిన చేతులతోనే పాలాభిషేకం చేయించడం, పనికిరాడని చెప్పిన నోటితోనే మా దేవుడు అని చెప్పించడం, వెన్నుపోటును ప్రజాస్వామ్య రక్షణగా చెప్పుకోవడం….ఇవన్నీ చంద్రబాబు బాలశిక్షలోని పాఠాలు. అధికారం కోసం దేశభక్తి నుంచి దేశద్రోహం దాకా ఏదైనా బోధించగల నైపుణ్యం చంద్రబాబుది. అందుకే చంద్రబాబు ఎన్టీఆర్‌కు సర్టిఫికెట్లు ఇస్తే జనం నవ్విపోతారు.

ఎన్టీఆర్‌ను నాశనం చేసినవాడు, అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ బొమ్మలన్నీ పీకేయించివాడు ఇవ్వాళ ఆయనపై తనకేదో భక్తి ఉన్నట్టు ప్రకటించుకోవడం కేవలం ఆయన అవసరం కోసమే. ఎన్టీఆర్ పేరు చెబితేనే ఇప్పటికీ చంద్రబాబుకు నాలుగు నూకలు దక్కుతున్నాయి. ఆ నూకలు కాపాడుకోవడంకోసమే ఎన్టీఆర్‌ను సజీవంగా ఉంచాలని ఆయన ఆశిస్తూ ఉంటారు. ఆయనకు ఎన్టీఆర్‌పై మహాగౌరవం ఏదో ఉన్నట్టు ఎవరూ భ్రమపడరాదు. ఆ మాటకొస్తే చంద్రబాబుకు ఎవరిపైనా గౌరవం ఉండదు. తనకు అవసరం ఉన్నంతమేరకే ఎవరితోనయినా సంబంధాలు. తనకు ఉపయోగిపడితేనే ఎవరినయినా చేరదీస్తారు. అవసరం తీరిన తర్వాత ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. మొదట ఎన్టీఆర్‌ను, ఆతర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావును, అటుపిమ్మట హరికృష్ణను, ఇప్పుడు చిన్న ఎన్టీఆర్‌ను….

ఎవరెవరిని ఎలా మోసం చేస్తూ వచ్చారో అందరికీ తెలుసు. అందువల్ల ఎన్టీఆర్‌పై చంద్రబాబు ప్రకటించే గౌరవమర్యాదలను అస్సలు పట్టించుకోనవసరం లేదు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్వదేశీ టర్మినలుకు ఎన్టీఆర్ పేరును పెట్టించుకోవడం తెలంగాణతో గిల్లికజ్జాలు పెట్టుకునే కుతంత్రలో భాగం. తెలంగాణపై తన ఆధిపత్యాన్ని ప్రకటించుకునే దురహంకారానికి కొనసాగింపు.

ఎన్టీఆర్ తెలంగాణకు అవసరమా లేదా అన్నది నిర్ణయించుకోవలసింది తెలంగాణ ప్రజలు. ఎన్టీఆర్ తెలంగాణకు ఏం చేశారన్నది తూకం వేసుకోవలసింది తెలంగాణ రాజకీయ వ్యవస్థ. ఎన్టీఆర్ తెలంగాణ నాయకులకంటే గొప్పవారేమీ కాదు. విశాలాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, భూసంస్కరణలు తెచ్చి ఇక్కట్ల పాలైన పీవీ నరసింహారావు, తెలంగాణ ఉద్యమాన్ని త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నతికోసం పాటుపడిన మర్రి చెన్నారెడ్డిల కంటే ఎన్టీఆర్ ఎందులో గొప్ప? అత్యధిక సంఖ్యలో బీసీలకు టిక్కెట్లు ఇచ్చిన పీవీ నరసింహారావు తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త నీరును తీసుకువచ్చిన తొలి నాయకుల్లో ఒకరు. ఎన్టీఆర్ తెలంగాణకు ఎంత మేలు చేశారో అంత కీడు కూడా చేశారు.

తెలంగాణలో అట్టడుగువర్గాలను రాజకీయాలకు చేరువ చేసిన ఎన్టీఆర్, ఈ ప్రాంతంలో పరాయీకరణను వేగవంతం చేసినవారిలో కూడా ప్రథముడు. హైదరాబాద్ ఆంధ్ర వలస నగరంగా వేగం పుంజుకున్నది ఎన్టీఆర్ హయాంలోనే. తెలంగాణ ఉద్యోగాలు పెద్ద ఎత్తున కొల్లగొట్టబడింది కూడా ఆయన కాలంలోనే. వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్శిటీ, ఓపెన్ యూనివర్శిటీ, జేఎన్‌టీయూతో పాటు అనేక విద్యాసంస్థల్లోకి సీమాంధ్ర నుంచి అనేకమంది ప్రవాహంలా వచ్చి చేరింది కూడా ఎన్టీఆర్ ప్రభుత్వంలోనే. ఆ విద్యాసంస్థల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కకపోవడం ఇప్పుడు లెక్కలు తీసినా తెలిసిపోతుంది. ఇంతెందుకు రంగారెడ్డి జిల్లాలో స్థానికేతరులు యాభైశాతం దాటింది కూడా ఎన్టీఆర్ పాలనలోనే. ఎన్టీఆర్ విడుదల చేశారని చెబుతున్న 610 జీవో కంటి తుడుపు మాత్రమే.

ఈ జీవో జారీ చేసిన తర్వాత ఎన్టీఆర్ ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కానీ ఒక్కరిని కూడా తెలంగాణ నుంచి బయటికి పంపలేదు. అసలు ఆ జీవో విషయాన్నే ఆయన మరచిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలు తెలంగాణను తమ కాలనీగా మార్చుకున్నారు. హైదరాబాద్‌ను దాదాపు కబ్జా పెట్టారు. వారి ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగానే తెలంగాణ సమాజం పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ఇప్పుడు కూడా వారి ముద్రలు, వారి నీడలు తెలంగాణపై రుద్దడానికి ప్రయత్నించడం విస్మయకరం.

అందరి మనుషుల సిద్ధాంతం కొందరికే ఎందుకు వర్తిస్తుంది? భూసంస్కరణలు ప్రవేశ పెట్టిన తొలి ముఖ్యమంత్రి, దేశాన్ని ఏలిన ఏకైక తెలుగు ప్రముఖుడు పీవీ నరసింహారావు అందరి మనిషి కాలేదెందుకు? విశాలాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవిని పరిత్యజించిన బూర్గుల రామకృష్ణారావు అందరి మనిషి కాలేదెందుకు? ప్రత్యేక తెలంగాణకోసం పోరాడిన చరిత్ర ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గోదావరి-కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పాటుపడిన మర్రి చెన్నారెడ్డి అందరి మనిషి కాలేదెందుకు? తెలంగాణ ప్రజలు హైదరాబాద్ రాష్ట్రం విడిగా ఉండాలని కోరుతూ ఉంటే తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని విశాలాంధ్ర వాదాన్ని భుజాన వేసుకున్న సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, స్వామి రామానందతీర్థ, రావి నారాయణ రెడ్డి వంటి ఎందరో మహామహులు అందరి మనుషులు కాదెట్లా? ఇన్ని చెబుతున్నారే…

మా నేతలది ఒక్క విగ్రహమైనా మీ గడ్డపై ప్రతిష్టించారా? మా నాయకుల పేర్లు ఒక్కటైనా మీ సంస్థలకు పెట్టారా? మా యోధుల పేర్లు ఒక్కటయినా మీ వీధులకు పెట్టారా? ఇంతెందుకు మా పీవీ నరసింహారావు పేరు మీ బెజవాడ విమానాశ్రయానికి పెడతారా? మీ పులిచింతల ప్రాజెక్టుకు మా మర్రి చెన్నారెడ్డి పేరు పెడతారా? మీ రాజధానికి కాకతీయ నగరమని పెట్టుకుంటారా? మీరు ఇవేవీ చేయరు. చేయలేరు. ఎందుకంటే ఆక్రమించుకోవడమే కానీ, కలుపుకోవడం మీ స్వభావంలో లేదు. మీకు లేని విశాల హృదయం తెలంగాణ ప్రజలకే ఉండాలని కోరుకోవడం దురాశకాదా? విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, పేర్లు పెట్టుకోవడం స్వీయ అస్తిత్వ ప్రకటన రూపాలు. తెలంగాణపై మీ ఆధిపత్య ప్రకటనకు ప్రతిరూపంగా మా గడ్డపై మీ నేతల విగ్రహాలు, మా సంస్థలకు మీ నేతల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు అధికారం మా చేతికి వచ్చిన తర్వాత కూడా మీ ఆధిపత్యమే కొనసాగిస్తారా? ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేయడం కాదా?

సీమాంధ్ర ఆధిపత్య శక్తులు ఒక పథకం ప్రకారం తెలంగాణ చరిత్రను విస్మరణకు గురిచేశాయి. తెలంగాణ నేతల ప్రతిష్ఠను దెబ్బతీస్తూ వచ్చాయి. తెలంగాణ నేతలను ఎప్పటికప్పుడు విలన్లుగా నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ముల్కీ నిబంధనలు సమర్థించడం, భూ సంస్కరణలు తేవడం, బీసీలను ఎక్కువ మందిని ప్రోత్సహించడం వంటి ప్రగతిశీల విధానాలు అనుసరించినందుకు పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం తీసుకువచ్చిన ఘనత ఆంధ్ర నాయకత్వానిది. దేశ ప్రధానిగా పనిచేసినా, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కాపాడినా ఆంధ్ర నాయకత్వం పీవీ నరసింహారావును ఏరోజూ గౌరవించింది లేదు. పీవీ అంత్యక్రియల సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు.

తెలంగాణ రాష్ట్ర సాధన అంతిమ ఘడియల్లో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర నాయకత్వం వ్యవహరించిన తీరు చూసిన తర్వాత మర్రి చెన్నారెడ్డి ఎంత గొప్పవారో అర్థమయింది. చెన్నారెడ్డి తెలంగాణకోసం పోరాడి, ఇందిరాగాంధీని ఎదిరించి 11 స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను గెలిపించి, తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షకు తిరుగులేని భూమికను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అన్నట్టుగా దేశ రాజకీయాలు నడుస్తుండేవి. ఆమెకు ఎదురు చెప్పేవారు లేరు, కేంద్రంలో ఏకధ్రువ ప్రభుత్వం. ఆంధ్ర నాయకులు అప్పుడు కూడా బలిష్టులు. వారందరినీ ఎదుర్కొని నిలబడడమే చెన్నారెడ్డి సాధించిన విజయం. మరి ఇప్పుడు- కేంద్రంలో ప్రభుత్వం మిశ్రమ ప్రభుత్వం, అత్యంత బలహీనమైన కేంద్రం అయి ఉండి నాలుగేళ్లపాటు తెలంగాణపై అడుగుముందుకు వేయకుండా నిలువరించగలిగారు సీమాంధ్ర నాయకులు. ఇప్పుడే ఇంతగా ప్రతిఘటించారంటే 1970లలో ఎలా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ సమాజం అంతా చెన్నారెడ్డిని ద్రోహి అనుకునేలా చరిత్ర రచన జరిగింది. మన నాయకులను చిన్నవాళ్లుగా చూపించి, తమ నాయకులను పెద్దవాళ్లుగా చూపించే కుట్ర అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. చంద్రబాబును గొప్పగా చూపించడం, కేసీఆర్‌పై విష ప్రచారాలు చేయించడం ఇందులో భాగమే. ఆంధ్ర పార్టీల ఏజెంట్లు, ఆంధ్ర మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఆంధ్ర ముద్రలను మనపై రుద్దే ఇటువంటి శక్తులను ఏదోరకంగా వదిలించుకోవడం తప్ప మనకు మరో గత్యంతరం లేదు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *