mt_logo

పల్లె ప్రగతి పునాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి

తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, అర్థం చెప్పి కార్యోన్ముఖులను చేశారు.

‘‘మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నటువంటివి. బ్రిటిష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి. అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాము. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమైపోయాము. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేసాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. అవగాహనతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. మీరంతా ధీరులు కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా… ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి, అడ్డదిడ్డంగా ఎటుపడితే అటు కాదు. అది మీ చేతుల్లో ఉంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్ లో చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకునిపోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయి. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ప్రగతికాముకంగా ముందుకు సాగాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

చివరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనుగు లక్ష్మణకవి రాసిన పద్యాన్ని చదివారు. మేయర్ల, చైర్ పర్సన్లు, అధికారులు అనుకున్న లక్ష్యం సాధించి, ఉత్తములుగా నిలవాలని ఆకాంక్షించారు.

|| ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధులల్ గావునన్ ||

(ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు).

పల్లె ప్రగతి పునాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించే పాదయాత్రలు, చేపట్టే కార్యక్రమాలు పేదలు ఎక్కువగా ఉండే దళితవాడల నుంచే ప్రారంభించాలని సీఎం కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని కోరారు. వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ పోవాలని చెప్పారు. మూడు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కావాలని, లేని పక్షంలో సంబంధింత ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. నిధుల వినియోగంలో ఖచ్చితమైన క్రమశిక్షన పాటించాలని, ప్రణాళిక ప్రకారమే వ్యయం చేయాలని కోరారు. పల్లెప్రగతి కార్యక్రమం సమీక్షించడానికి మండల పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యటించాల్సి ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి భస చేసి, గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి, పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలని కోరారు.

ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేయాల్సిన పనులపై చర్చించేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సులో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేయాల్సిన కార్యక్రమాలను సీఎం దిశానిర్దేశం చేశారు.

– వార్డుల వారిగా ప్రణాళిక తయారు చేయాలి. ప్రతీ పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక తయారు కావాలి. కౌన్సిలర్/కార్పొరేటర్లను కలుపుకుని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రణాళిక తయారు చేయాలి. వార్డుల వారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి. ప్రతీ వార్డును ఎక్స్ రే తీయాలి. ఏమి ఉన్నాయి. ఏమి లేవు. ఏమి కావాలి. ఏమి చేయాలి అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి.
– మంచిపట్టణం/మంచి నగరం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. దానికి సమాధానాలు వెతుక్కుంటే ఏమి చేయాలో బోధ పడుతుంది. ప్రతీ రోజు చెత్తను, మురికిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన మంచినీరు సరఫరా జరగాలి. వీధి లైట్లు బాగా వెలగాలి. రహదారులపై గుంతలు, బొందలు, గోతులు ఉండకూడదు. పచ్చదనంతో పట్టణం కళకళలాడాలి. చెత్త నిర్మూలనకు డంప్ యార్డులు ఉండాలి. చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపేందుకు దహనవాటికలు/ ఖనన వాటికలు ఉండాలి. పట్టణ జనాభాను అనుసరించి పరిశుభ్రమైన వెజ్-నాన్ వెజ్- ఫ్రూట్ – ఫ్లవర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలి. పట్టణంలోని యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్ లు ఉండాలి. ఇవీ ఒక మంచి పట్టణం/నగరం లక్షణాలు.
– ప్రతీ పట్టణంలో ఉండాల్సిన కనీస పౌర సదుపాయాలు ఏమిటి అని నిర్ధారించుకుని వాటిని కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టణ ప్రజలకు, పట్టణాలకు వచ్చే ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి. దీనికోసం ప్రభుత్వ స్థలాలను వినియోగించాలి. ఏ శాఖకు చెందిన స్థలమైనా సరే ప్రజోపయోగం వినియోగించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు ఇస్తుంది. ఏ పట్టణానికి ఎన్ని టాయిలెట్లు, ఎక్కడ నిర్మించాలో నిర్ధారించుకుని మూడు నెలల్లో వాటి నిర్మాణం పూర్తి చేయాలి.
– వీధులపై వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్స్ కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ చేర్పాటు చేయాలి. వాటిలో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించే వరకు వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం తగు ఆదేశాలు ఇస్తుంది.
– ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్క్ చేయడానికి పార్కింగ్ సదుపాయం కల్పించాలి. దీనికోసం కూడా ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారం కలెక్టర్లకు ప్రభుత్వం కల్పిస్తుంది.
– ప్రమాద రహితమైన విద్యుత్ వ్యవస్థ కలిగి ఉండాలి. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్ పాత్ లపై ఉండే ట్రాన్స్ ఫారాలను మార్చాలి. ఇండ్లపై వేలాడే వైర్లను సరిచేయాలి. పొట్టి స్తంభాలను తొలగించి, పెద్ద స్తంభాలు వేయాలి. ఈ పనులన్నీ చేయడానికి అవసరమైన నిధులను ఈసారి బడ్జెట్లో కేటాయిస్తాం. ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. లేనట్లయితే దానికి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. కావాల్సిన పోళ్లను, తీగలను, ట్రాన్స్ ఫారాలను విద్యుత్ అధికారులు ముందుగానే సమకూర్చి ఆయా పట్టణాలకు పంపించాలి.
– పల్లెల్లో సర్పంచుల మాదిరిగానే పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు స్వీకరించాలి. పెట్టిన మొక్కల్లో 85 శాతం బతికే బాధ్యతను వారు తీసుకోవాలి. ఆయా పట్టణాలకు అవసరమైనన్ని నర్సరీలను ఏర్పాటు చేయాలి. పట్టణంలో జాగా లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.
– ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీ చేయాలి. ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైనన్ని వాహనాలు సమకూర్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 3100 వాహనాలు తీసుకోవాలని నిర్ణయించాం. ఇప్పటికే 600 వాహనాలు వచ్చాయి. మిగతావి త్వరలోనే వస్తాయి. ఇంకా అవసరం ఉన్న పట్టణాల్లో మరికొన్ని కొనుగోలు చేయాలి.
– డ్రైనేజీలు శుభ్రం చేయడానికి అనేక రకాల మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఏర్పాటు చేసుకోవాలి.
– పట్టణాలకు ప్రతి నెలా రూ.148 కోట్ల చొప్పున ఆర్థిక సంఘం నిధులు అందిస్తాం. ఇతర ఖర్చులు తగ్గించుకుని అయినా సరే, గ్రామాల అభివృద్దికి వెచ్చిస్తున్నట్లే, పట్టణాల అభివృద్ధికి నిధులు అందచేస్తాం. ఈ నిధుల వినియోగంలో క్రమశిక్షణ ఉండాలి. ప్రతీ మున్సిపాలిటీ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చును చార్జుడ్ అకౌంటుగా నిర్ధేశించుకోవాలి. అప్పులకు సంబంధించిన కిస్తీలు, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, మంచినీటి బిల్లులు ఖచ్చితంగా ప్రతీ నెలా చెల్లించాలి. ఇది కమిషనర్ల బాధ్యత. ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడే పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించాలి. ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను కూడా పట్టణాల ప్రగతికి వినియోగించాలి.
– కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇండ్ల నిర్మాణం, లే అవుట్ విషయంలో సులభతరమైన అనుమతుల విధానం తెచ్చాం. ప్రజలపై నమ్మకం ఉంచాం. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
– జీవో నెంబరు 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే, అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
– తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది. ఇందులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి. ఎవరికి వారు పూనుకుని తమ ప్రాంతంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి.

సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్లు, చైర్ పర్సన్లతో ముఖాముఖి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్, పట్టణ పరిపాలన కమిషనర్ శ్రీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్ పర్సన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *