mt_logo

ఏపీ, తెలంగాణకు ఒకేరోజు ఎన్నికలు జరగాలి..

వచ్చే పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడుతలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్రాస్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ వంటివి నివారించవచ్చని ఆ లేఖలో రజత్ కుమార్ తెలిపారు.

గత సార్వత్రిక ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరిగాయని, ఈసారి వేర్వేరు రాష్ట్రాలుగా జరుగుతున్నాయని రజత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయని, ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందినవారు చాలామంది హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని, సందర్భానుసారం స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారని చెప్పారు. తెలంగాణలోని ఆరు జిల్లాలు ఏపీకి సరిహద్దుగా ఉన్నాయని, ఏపీకి చెందినవారిలో చాలామంది తెలంగాణలో సైతం ఓటుహక్కు కలిగి ఉన్నారన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు పార్లమెంటు ఎన్నికలను నిర్వహించడం ద్వారా ప్రలోభాలకు తావులేకుండా చేయడంతో పాటు డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు వంటి వాటిని నివారించవచ్చని రజత్ కుమార్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *