mt_logo

పెండింగ్ ప్రాజెక్టులకు లైన్ క్లియర్..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 10వేల కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తికావస్తున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికల్లా సాగునీరు అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టుల విషయంలో రీ టెండర్ కు వెళితే సుమారు రూ. 9వేల కోట్ల అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. అసలు విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద 86 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఈపీసీ విధానం వల్ల ప్రాజెక్టుకో రీతిన ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల వల్ల కాలానుగుణంగా పెరిగే స్టీల్, సిమెంట్ కు అదనపు చెల్లింపులు ఇస్తామని అంగీకరించారు. అయితే కూలీ, ఇతర సామాగ్రికి అదనపు చెల్లింపులు వర్తించకపోవడంతో ప్రాజెక్టుల విషయంలో పలు సమస్యలు తలెత్తాయి. దీంతో నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఖర్చు విపరీతంగా పెరిగింది. కాంట్రాక్టర్లు కూడా అదనపు చెల్లింపులు చెల్లిస్తే తప్ప పనులు చేపట్టలేమని చేతులెత్తేశారు. దీనిపై స్పందించిన కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ 2013లో అన్ని ప్రాజెక్టుల్లో కూలీ, సామాగ్రి రేట్లకు అదనపు చెల్లింపులు చెల్లిస్తామని జీవో నంబరు 13 జారీ చేసింది. అయితే ప్రాజెక్టుల విషయంలో పలు ఆరోపణలు రావడం, తర్వాత రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడంతో ఆ చెల్లింపులు జరగలేదు. రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఏపీ ప్రభుత్వం జీవో నంబరు 22 ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం అదనపు చెల్లింపులకు అంగీకారం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సమగ్ర విచారణ చేపట్టగా కొన్ని చోట్ల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. కాంట్రాక్టర్లే ఆలస్యం చేసి నింద ప్రభుత్వం మీద వేసిన విషయాన్ని గమనించిన తెలంగాణ సర్కార్ మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ చేయించింది. విచారణ చేపట్టిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలోని 13 భారీ, 12 మధ్య తరహా ప్రాజెక్టులకు రూ. 2,712 కోట్ల అదనపు చెల్లించాలని సిఫారసు చేసింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన అక్రమ టెండర్ డాక్యుమెంట్ల కారణంగానే ఈ అదనపు చెల్లింపుల వ్యవహారం తెరపైకి వచ్చిందని, ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే టెండర్ డాక్యుమెంటును రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మరోవైపు కాంట్రాక్టర్లకు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రూ. రెండు కోట్ల కంటే విలువైన, 18 నెలల కంటే ఎక్కువ ఒప్పంద సమయం ఉన్న పనులకు కూలీ, సామాగ్రికి సంబంధించి అదనపు చెల్లింపులు ఉండేలా టెండర్ డాక్యుమెంట్ ను రూపొందించారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *