mt_logo

విజయాన్నే కాదు.. ఓటమిని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి- కేటీఆర్

ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించడమే కీ మేకర్స్ లక్ష్యమని, యువతను ఒక  వేదికపైకి చేర్చి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేవిధంగా వారిలో నైపుణ్యం పెంచాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన కీ మేకర్స్ యూత్ సమ్మిట్ 2019ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు ఉపయోగపడని టెక్నాలజీ ఏదైనా వృధా అని, ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్నది మన దేశంలోనే అని అన్నారు. యువతరం సరైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

1950 వ దశకంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, అప్పుడు వృద్ధిరేటు చాలా తక్కువగా ఉండేదని అన్నారు. భారత యువత చాలా ధైర్యశాలులు. మీరు ఉద్యోగాలు కల్పించాలనుకోవచ్చు. ఉద్యోగం సంపాదించాలని అనుకోవచ్చు. అయితే భయపడే మనస్తత్వం ఉండకూడదు. ప్రస్తుత యువత 30 ఏండ్లు ఒకే ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదు. వినూత్నమైన ఆలోచనలతో తామే పదిమందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచిస్తున్నది. అలా ఆలోచించే యువతే కావాలి అని కేటీఆర్ అన్నారు. ప్రపంచంతో సంబంధాలు ఏర్పరుచుకోవడంతో పాటు యువత ఆలోచనలు చర్చించేందుకే తెలంగాణలో టీ హబ్ ను స్థాపించాం. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికోసమే టాస్క్ ఏర్పాటుచేశాం.

నిజామాబాద్ కు చెందిన ఫణీంద్ర సామా ఫౌండర్ ఆఫ్ రెడ్ బస్.. నిజామాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లి విప్రోలో పనిచేసేవాడు. బెంగళూరు నుండి బస్ దొరకకపోతే అన్న ఆలోచన రావడంతో రెడ్ బస్ యాప్ ను రూపొందించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో యువ మహిళలు రాణించడానికి వీ హబ్ ను ఏర్పాటుచేశాం. తెలంగాణ ఏర్పాటు చేసిన టీ వర్క్స్ ఇన్నోవేటర్ ఐడియా కార్యరూపం దాల్చడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మనం చేసే ప్రతి పని విజయవంతం కాదు. విజయాన్నే కాదు.. ఓటమిని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలని కేటీఆర్ యువతకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *