mt_logo

పుల్వామా బాధిత కుటుంబాలకు కేటీఆర్ రూ. 25 లక్షల విరాళం..

దేశసేవ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతాయని, భద్రతా బలగాల సేవల వల్లే దేశంలోని పౌరులంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని సదరన్ సెక్టార్ సీఆర్పీఎఫ్ కార్యాలయం వెళ్ళిన కేటీఆర్ అక్కడ ఏర్పాటుచేసిన అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం పుల్వామా ఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాల కోసం రూ. 25 లక్షల విరాళం సీఆర్పీఎఫ్ ఐజీపీ జీహెచ్ పీ రాజుకు అందించారు. అంతేకాకుండా తన స్నేహితులు ఇచ్చిన మరో రూ. 25 లక్షలు మొత్తం కలిపి రూ. 50 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ఘటనలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలచివేసిందని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్యేగా కాకుండా ఒక భారత పౌరుడిగా వ్యక్తిగతంగా విరాళాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ప్రార్ధించారు.

మరోవైపు అమరవీరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్ధికసాయం అందించేందుకు పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ నెల వేతనం రూ. 2.5 లక్షల చొప్పున విరాళంగా ప్రకటించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రూ. లక్ష, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ నాలుగునెలల జీతం రూ. 1 లక్ష, టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు పైడిపల్లి రవీందర్ రావు రూ. 1 లక్ష సీఆర్పీఎఫ్ ఐజీపీ రాజుకు అందించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సంఘం తరపున ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. పాపారావు రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయనిధి ద్వారా జవాన్ల కుటుంబాలకు అందిస్తామని ఆయన చెప్పారు. బోరబండకు చెందిన వర్తక సంఘం, గౌడ సంఘం ప్రతినిధులు రూ. 47 వేలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *