mt_logo

భూదాన్ రెడ్డి

‘ఉన్నదంతా పోగొట్టావు తప్ప ఏం సాధించావు?’ అంటారు పిల్లలు ‘ప్రజలను, వాళ్ల ప్రేమను దక్కించుకున్నాను’ అంటారాయన వందల ఎకరాలున్న దొరల ఇంట్లో పుట్టిన ఆయన చేయి పెద్దది అందుకే భూదానోద్యమంలో ముందున్నాడు తన వాటాగా వచ్చిన 300 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టాడు అద్దె ఇల్లు, పాత స్కూటరు ఇప్పుడతని ఆస్తి అయినా నా అనుకున్న ప్రజల కోసం, వాళ్ల దాహార్తిని తీర్చడం కోసం గోదావరి జలాల సాధనకు నడుం కట్టారు ఆయనే భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రజల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆ డెభ్బై ఏళ్ల యువకుడితో ములాఖాత్

ఉప్పల్ నుంచి భువనగిరికి వెళ్తుండగా ఘట్‌కేసర్‌కు ముందు ఎడమవైపు సింగపూర్ టౌన్‌షిప్. రెండవబిల్డింగ్ సెకండ్‌ప్లోర్‌లో ఓ పోర్షన్. కొమ్మిడి నర్సింహారెడ్డి దంపతులు అద్దెకుంటున్న ఇల్లు. తెల్లని లాల్చీ, దోతీ, భుజాన తెల్లని కండువా, ఎత్తైన విగ్రహం… ఎదురొచ్చి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు నర్సింహారెడ్డి. నిర్మలమైన ముఖం… పెదాలపై చిరునవ్వు. నిజాయితీ, నిబద్ధతలకు నిలువెత్తు నిదర్శనం ఆయన. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మనిషేనా అనిపిస్తుంది… అంతటి అసాధారణ వ్యక్తిత్వం. నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి కొమ్మిడి నర్సింహారెడ్డి సొంత ఊరు. 1943 సెప్టెంబర్ 10న పుట్టారు. సంపన్న రెడ్ల కుటుంబం. ముగ్గురు అన్నదమ్ముళ్లకు ఒక్కొక్కరికి వాటాగా 300 ఎకరాల భూమి వచ్చింది. అందులో కొన్ని ఎకరాలు దళితులకు ఇచ్చి ఓ కాలనీనే కట్టించారు. నర్సింహారెడ్డి పెద్దమ్మ పేరు మీద 80 ఎకరాల భూమి ఉంది. ఆ సమయంలోనే సీలింగ్ చట్టం వచ్చింది. ఆయన పేరు మీద లేదు కాబట్టి తప్పించుకోవాలంటే ఆ భూమిని అట్లే ఉంచేయొచ్చు. కానీ పెద్దమ్మ పేరు మీద ఉన్న భూమి 80 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేశారు. మిగిలిన కొంత భూమిని అమ్మేసి పిల్లలను చదివించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిస్టు ఆయన.

అంకితభావం …

సర్పంచ్‌గా గెలవాలన్నా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న రోజులివి. కానీ నర్సింహారెడ్డి ఒక్కపైసా ఖర్చు చేయలేదు. ప్రజలే ఆయనను స్వచ్ఛందంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఊరిలో అందరికీ భోజనాలు పెట్టిస్తే 280 రూపాయలు ఖర్చు అయ్యింది. ఒక నెల హానరోరియంలో ఇంకా పది రూపాయలు మిగిలాయి. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయం. సర్పంచ్‌గా పనిచేస్తున్న నర్సింహారెడ్డి తెలంగాణ పోరాట సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే అందరినీ సంఘటితం చేయాల్సిన పరిస్థితి. కానీ.. ఆ రోజుల్లో ‘రేపు ఏదైనా కార్యక్రమం ఉందా..? మా ఊరినుంచి పిల్లలను పంపుతాం’ అని స్వచ్ఛందంగా అడిగేవాళ్లట. సద్ది కట్టి మరీ పంపించేవారట. ఉద్యమం పట్ల అంత అంకితభావం. నాయకుడిని బట్టే ప్రజలుంటారు మరి.

ఆత్మాభిమానం …

రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసినా పైసా సంపాదించుకోలేదు. అలా అని గెలవడానికి కూడా పైసలు ఖర్చుపెట్టలేదు. ఆయన కనబడితే చాలు… ఓట్లు పడేవి. అంతటి ప్రజల మనిషాయన. తరువాత కాంగ్రెస్ రాజకీయాలు మారాయి. చెన్నారెడ్డితోపాటు నర్సింహారెడ్డి పార్టీ మారారు. తరువాత మారిన సమీకరణాల వల్ల అసలు ఎన్నికల్లోనే పోటీ చేయొద్దనుకున్నారు. ఓవైపు నాదెండ్ల భాస్కరరావు, మరోవైపు రామారావు హోరాహోరీగా ఉన్న సమయం. నర్సింహారెడ్డిని ‘మీరు ఏ గుర్తు మీదయినా పోటీ చేయండి. మా అభ్యర్థిగా ఉండండి’ అని అడిగారిద్దరూ. అందుకు లక్షల రూపాయలు ఆశచూపారు. కానీ ఆయన ఏవైపూ మొగ్గలేదు. అంతకుముందే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. మళ్లీ కాంగ్రెస్‌వైపు వెళ్లే ఆలోచనే లేదు. ఇక రామారావు మీద ఆయనకో అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం రావడానికి ఓ కారణమూ ఉంది. రామారావు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్న సమయంలో మర్రి చెన్నారెడ్డి ఎంపీగా ఉన్నారు. కరీంనగర్ వెళ్లిన రామారావుని తీసుకురావాలి. ఆ భాధ్యత నర్సింహారెడ్డికి అప్పజెప్పారు చెన్నారెడ్డి. ఎస్పీ ఆఫీస్‌లో ఉన్న రామారావును కలవడానికి వెళ్లారు నర్సింహారెడ్డి. అక్కడ మరోనేత నారాయణ సహాయం తీసుకున్నారు. అప్పటిదాకా క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న రామారావు… అప్పుడే చైతన్య రథంలోకి వెళ్లి స్నానాదులు ముగించారు. రామారావు దగ్గరికి నర్సిహారెడ్డిని తీసుకెళ్లిన నారాయణ ఆయనకు పరిచయం చేయబోయారు. రామారావుకు అకారణంగా కోపం వెచ్చింది. అక్కడినుంచి వెళ్లండంటూ గట్టిగా అరిచారు. ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిమీద… అందులోనూ ఎంపీ పంపిన తనపై … రామారావు ప్రవర్తించిన తీరు నర్సింహారెడ్డి మనసును నొప్పించింది. ఓ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు అది. అందుకే పార్టీలోకి రమ్మన్నా… ఏ గుర్తు మీద పోటీ చేసినా తమ పార్టీలోకి తీసుకుంటామన్నా… ఆయన ససేమిరా అన్నారు. తెలంగాణలాగానే ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి నర్సింహారెడ్డి.

నీటివనరుల కోసం…

తెలంగాణలోని నీటిపారుదల రంగంపై ఆయనకు మంచి పట్టు. ఏ కాలువ ఏయే ఊళ్లకు మేలు చేస్తుంది… ఏ చెరువు నిండితే, ఏయే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి.. అనర్ఘళంగా మాట్లాడగల దిట్ట. అప్పట్లో భువనగిరి… దేశంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న రెండవ టౌన్. అరటి, తమలపాకు తోటలు, కుండలు, కూజాలకు ప్రసిద్ధి. పాడీపరిశ్రమకు పెట్టిందిపేరు. తరువాత పవర్‌లూమ్స్ కూడా భువనగిరి ఏరియా పెట్టింది పేరు. వరి ప్రధాన పంట. పట్టణం బయటికి వచ్చి ఏవైపు చూసినా.. కనుచూపుమేర పచ్చని పంట పొలాలుండేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల కాలుష్యంతో… వ్యవసాయం దెబ్బతిన్నది. నీళ్లలో వాటాకు జరుగుతున్న అన్యాయంతో చెరువులన్నీ అడుగంటుపోయినయి. బావులు పడావుబడ్డయి. శామీర్‌పేట చెరువు నిండితే… నల్గొండలోని ఇళ్లలో పొయ్యి కింద నీళ్లూరుతయి అనేవాళ్లట వెనుకట. అలాంటి శామీర్‌పేట చెరువును నింపి… రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని ఊళ్లను సస్యశ్యామలం చేయాలని ఆయన కల.

ప్రస్తుతం

ఈ ప్రభుత్వం… ప్రాణహిత చేవెళ్ల నుంచి శామీర్‌పేట చెరువును మినహాయించింది. హైదరాబాద్ చుట్టూరా ఉండే పరిశ్రమలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుగానే ప్రాణహితను తయారు చేసింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నర్సింహారెడ్డి ఐదు టీఎంసీల నీటిని కేటాయించి… ఈ మూడు జిల్లాల తాగు, సాగునీటి కొరతను తీర్చాలని కొట్లాడుతున్నారు. అందులో భాగంగా ప్రజాచైతన్య వేదిక పేరుతో రంగాపురం డిక్లరేషన్ తీసుకొచ్చారు. అందులో అంశాలు…

– నిమ్స్ యూనివర్సిటీ కోసమని ప్రభుత్వం బీబీనగర్‌లోని 161 ఎకరాల స్థలాన్ని సేకరించింది. 2004లో శంకుస్థాపన చేసి, కొన్ని భవనాలు నిర్మించారు. భవనాలు కూలిపోతున్నాయే తప్ప నిమ్స్ విస్తరణ పనులే మొదలు కాలేదు. దీన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగినంచకుండా రిఫరల్ వైద్యశాలగా తక్షణమే ప్రారంభించి.. తెలంగాణ వైద్య విశ్వవిద్యాలయం చేయాలి.

– ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంతో… శనిగరం (కరీంనగర్) శామీర్‌పేట, బొల్లారం, ఇబ్రహీంపట్నం, (రంగారెడ్డి) గందమళ్ల, మల్లాపురం, యాదగిరిగుట్ట, రాయరావుపేట(నల్లగొండ)చెరువులను రెండున్నర టీఎంసీలతో నింపి, మరో రెండున్నర టీఎంసీల నీటిని 20 రోజులపాటు ఓవర్‌ఫ్లో అయ్యేట్టు చేస్తే… షామీర్‌పేట, ఆలేరు, చిన్నేరు, బిక్కేరు, చిన్నమూసీ వాగులు పారి భూగర్భజలమట్టం పెరుగుతుంది. దీనివల్ల సాగు, తాగునీటి ఎద్దడిని నివారించొచ్చు.

– దక్కన్ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతంలో ప్రవహిస్తున్న మూసీ నది, దాని ఉపనదులను, కాలువలను ఆధునీకరించడం వల్ల ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీటి సరఫరా చేయొచ్చు.

– జాతీయ రహదారి 202 విస్తరణలో భాగంగా రంగాపురం గ్రామంలో అనేకమంది ఇళ్లు, పొలాలు కోల్పోయారు. అవి భూదాన్ భూములంటూ… ప్రభుత్వం వారికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

– నాగార్జున సాగర్ ఆయకట్టు వ్యవస్థను ఆధునీకరించేందుకు 4,400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. ఈ ఆధునీకరణ వల్ల మిగులు నీరు ఎంత? అందులో తెలంగాణ వాట ఎంతో తేల్చాలి.

– దమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌కు 165 టీఎంసీ గోదావరి జలాలను తరలించే కాలువ నిర్మాణానికి తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు 87,120 ఎకరాలు నష్టపోతున్నారు. కానీ ఈ కాలువతో తెలంగాణ ప్రాంతంలో ఒక్క ఎకరం కూడా సాగుకావడం లేదు. తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేని ఈ పథకాన్ని వెంటనే ఉపసంహరించాలి.ఈ డిక్లరేషన్ ద్వారా ఓ పిటిషన్ వేసి అన్యాక్రాంతమైపోతున్న బీబీనగర్ చెరువును కాపాడటమే కాదు.. ఆధునీకరణకోసం 10 లక్షల రూపాయలు వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి.

నిత్య విద్యార్థి

ఇప్పుడు కూడా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే ప్రతి శనివారం జరిగే తెలంగాణ రిసోర్స్ సెంటర్ చర్చలకు వెళ్తుంటాను. మంజీరా నదిమీద దేవనూరు దగ్గర నిజాం సాగర్ ప్రాజెక్టు లింక్ కెనాల్, నాలుగు పవర్ ప్రాజెక్టులు ప్లాన్ చేసింది అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం. 40 వేల ఎకరాల భూములకు నష్టపరిహారం కూడా చెల్లించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత అది కర్ణాటక పరిధిలోకి పోయింది. అప్పుడు కర్ణాటక ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అడిగింది ఆ ప్రాజెక్టు గురించి… కానీ మాకొద్దన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడినుంచే తెలంగాణకు అన్యాయం మొదలైంది. తెలంగాణకు కొద్దిగా ఉపయోగపడే చిన్న ప్రాజెక్టు అయినా… దానికి అడ్డుపడ్డారు ఆంధ్రా నాయకులు. ఈపార్టీ, ఆ పార్టీ అని మినహాయింపు లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల సమయంలో కూడా తెలంగాణ ప్రాంతంలో జరిగే అభివృద్ధినే కాదు… నాయకత్వాన్ని కూడా ఎదగనీయ లేదు. భూసంస్కరణలకోసం పీవీ నర్సింహారావు చట్టం తెస్తే అందుకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం తెచ్చారు. ఎలిమినేటి మాధవరెడ్డి మరణం ఇలాంటిదే. పార్టీలవారీగా ఆంధ్రలో కొట్టుకున్నా.. తెలంగాణ విషయం వచ్చే సరికి అక్కడ అన్ని పార్టీలు సిండికేట్ అవుతాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే శంకుస్థాపన చేసిన రిమ్స్ పూర్తయ్యింది. ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా నడుస్తున్నది. కానీ బీబీనగర్‌లో ఏర్పాటు చేసిన నిమ్స్ విస్తరణ పనులు మాత్రం ముందడుగు వేయలేదు. దీంతోపాటే ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన మరో హాస్పిటల్‌కు పాతబిల్డింగ్ ఇచ్చారు. స్టాఫ్‌ను కూడా అపాయింట్ చేశారు. 11 నెలలయినా జీతాలివ్వకపోవడంతో అది అక్కడే ఆగిపోయింది. ఇంత ఉద్యమం జరుగుతున్నా ఓవైపు తెలంగాణకు అన్యాయం జరిగిపోతుందనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అందుకే పోరాటాలతోనే తెలంగాణ సాధించుకోవాలి. ఎలాంటి తెలంగాణ కావాలన్న ఎరుకతో ఉండాలి.

వ్యక్తిగతం
నర్సింహారెడ్డికి నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు. ఇద్దరు కొడుకులు ప్రయివేటు ఉద్యోగాల్లో ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినా… విస్తృతమైన పరిచయాలున్నా… పిల్లల ఉద్యోగాల కోసం కూడా ఏనాడూ ఆయన ఎవ్వరినీ చేయి చాచి అడగలేదు అంటుంది నర్సింహారెడ్డి భార్య సుకన్య. ఆమెకు పేరుకు తగినట్టుగానే గుణవతి. లేకపోతే పెళ్లయ్యాక భర్త ఉద్యమాలు, ప్రజాసేవ అనుకుంటూ ఉన్న భూములను ప్రజలకు పంచినా, ఆస్తంటూ లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నా ఏనాడూ ఒక్కమాటా అనలేదు. కాకపోతే భర్తలాగే తన చిన్నబిడ్డ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నది.

[కట్ట కవిత – నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *