స్ఫూర్తిదాయక ఉద్యమకారుడు కొమ్మిడి నరసింహా రెడ్డి

  • March 18, 2013 10:39 am

(ఫొటో: నిన్న రాత్రి దీక్షా శిబిరంలో కొమ్మిడి నరసింహా రెడ్డి గారు)

(ఫొటో: వలస పాలకుక వివక్షకు నిలువెత్తు నిదర్శనం బీబీనగర్ NIMS. కట్టడం పూర్తి అయ్యి 4 యేళ్లు అయినా యంత్రాలు, సిబ్బంది లేకుండా భూత్ బంగ్లాగా మారింది. దీనితో పాటు మొదలైన కడప RIMS మాత్రం వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో, మెడికల్ కాలేజీతో సహా సర్వ హంగులతో మొదలయ్యి 2006 నుండి నడుస్తోంది) 

అయిదు రోజులైంది ఆ ఎనభై యేళ్ల నవయువకుడు అన్నం ముట్టి. అయితేనేం ఆయన మాటలో, చూపులో తీక్షణత ఇసుమంతైనా తగ్గలేదు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు, ఆయన దీక్షా వేదికపైనుండి అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరితరువాత ఒకరు బోలు ఉపన్యాసాలు దంచుతూనే ఉన్నారు. ప్రజల కొరకు, తెలంగాణ కొరకు తామేం “త్యాగాలు” చేశామో పట్టికలు చదువుతూనే ఉన్నారు. కానీ వారంతా ఆ వేదిక మీదున్న పెద్దమనిషి ముందు మరుగుజ్జుల్లా కనపడ్డారు నాకు.

ఈ గడ్డ చేసుకున్న పుణ్యమేమో ఇటువంటి మహామనుషులు ఇక్కడ పుట్టడం. భూమి, భుక్తి, విముక్తి కొరకు అసామాన్య పోరుసల్పిన యోధులెందరో పుట్టిన తెలంగాణ గడ్డ మీద జన్మించిన మరో గొప్ప పోరాట యోధుడు కొమ్మిడి నరసింహా రెడ్డి. ఇప్పుడాయన బీబీనగర్ NIMS ప్రారంబించాలని ఆమరణ దీక్షకు దిగాడు.

నల్లగొండ జిల్లాది ఆది నుండీ పొరాటాల చరిత్రనే. ఆనాడు నిరంకుశ నిజాం ప్రభుత్వంపై అటు పాటలు, ఇటు తూటాలతో పోరుసల్పిన గొప్ప యోధులు సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, రావి నారాయణరెడ్డి, అరుట్ల రామచంద్రా రెడ్డి, కట్కూరి రామచంద్రా రెడ్డి మొదలుకొని ఫ్లోరైడ్ పీడిత నల్లగొండలో గుక్కెడు నీటి కొరకు గల్లీ నుండి డిల్లీ వరకు పోరాటాలు చేసిన దుశ్చర్ల సత్యనారాయణ, స్వంత పాలన మీదనే రెఫరెండం నిర్వహించి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన మట్టి మనిషి వేనేపల్లి పాండు రంగా రావు, అటు మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి నుండి కరీం నగర్ జిల్లా గ్రానైట్ గుట్టల వరకూ తెలంగాణ వనరుల విధ్వంసాన్ని అడ్డుకోవడానికి పోరాటాలు చేస్తున్న ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత…ఒక్కరా ఇద్దరా? నల్లగొండ ఎర్ర చెలకల నిండా ఊరికొక ఉద్యమకారుడున్నాడు.

కొమ్మిడి నరసింహారెడ్డి గారి గురించి నాకు మొదటిసారి వేద్ కుమార్ గారి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆఫీసులో ఉన్న పోస్టర్ ద్వారా తెలిసింది. ఎంతో కాలంగా మూసీ నది మీద సమాచార సేకరణలో ఉన్న నాకు ఆ పోస్టర్ మీద మూసీ నదిపై ఉన్న వివిధ ఇరిగేషన్ పధకాల వివరాలు అబ్బురపరిచాయి.

వెంటనే వేద్ కుమార్ గారి దగ్గర కొమ్మిడి నరసింహారెడ్డి గారి ఫోన్ నెంబర్ తీసుకుని ఘట్కేసర్ దగ్గర సింగపూర్ సిటీలో ఉన్న ఆయన అపార్ట్మెంటుకు పోయిన. అక్కడికి వెళ్ళే దాకా ఆయన భువనగిరి నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారన్న విషయం నాకు తెలియదు. సీమాంధ్ర వలసపాలనలో ఏ తెలంగాణ వీరుని గురించి మనం తెలుసుకున్నాం కనుక? మలిదశ ఉద్యమం వచ్చి మనకంటూ స్వంత మీడియా సంస్థలు  వచ్చిన తరువాతనే కొమ్మిడి నరసింహారెడ్డి గారి గొప్ప పోరాటాల గురించి తెలంగాణ ప్రజలకు విస్తృతంగా తెలిసింది. వలసాంధ్ర మీడియా కప్పిపెట్టిన మన వీరుల చరిత్రలెన్నో ఇంకా మనం వెలికితీయాల్సేఉంది.

అయిదేళ్లు ఎమ్మెల్యేగా ఉంటే కోట్లు వెనకేసే నాయకులున్న ఈ రోజుల్లో, నరసింహా రెడ్డి గారు ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి, ఉన్న ఆస్తిలో అధికభాగం భూదానోద్యమంలో దానం చేశాడని, ఇప్పుడు ఒక పాత స్కూటర్ తప్ప కనీసం స్వంత ఇల్లు కూడా లేదంటేనే ఆయన నిబద్ధత గొప్పతనం అవుతుంది.

ఆయన దగ్గరికి పోయి మూసీ నది గురించి అడిగిన వెంటనే తన దగ్గరున్న సమాచారం మొత్తం రెండు గంటల పాటు ఓపికగా నాతో పంచుకున్నాడు. గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్ళించి లక్ష ఎకరాలను ఎట్లా పచ్చగా మార్చొచ్చో వివరిస్తూ ఒక బ్లూప్రింట్ తయారుచేశాడాయన. వేల కోట్లు అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ పధకం సహజంగానే ఈ కాలపు రాజకీయ నాయకులకు ఆనడం లేదు.   ఆ బ్లూ ప్రింటును ఒక పెద్ద ఫ్లెక్సీ పై ప్రింట్ చేయించి, దాన్ని గచ్చుమీద పరచి, ఒక ఉపాధ్యాయుడిలా నాకు దాని అణువణువూ వివరించాడాయన. ఎనిమిది పదుల వయసులో ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి నాకైతే సిగ్గుగా అనిపించింది.

వచ్చేటప్పుడు వద్దంటున్నా వినకుండా కిందికి పార్కింగ్ దాకా వచ్చి మరీ వీడ్కోలు పలికాడు.

“మా వయసు అయిపోతున్నది దిలీప్. ఒక కొత్త తరానికి మన ప్రాంత పోరాటాల గురించి వివరించే బాధ్యత మీదే” అని ఆ రోజు ఆయనన్న మాటలు నాకు అనునిత్యం గుర్తొస్తూనే ఉంటాయి.

మొన్న సెప్టెంబర్ 30 నాడు జేయేసి తెలంగాణ మార్చ్ జరిపితే, పిట్టల శ్రీశైలం తో పాటు కలిసి భుజానికొక సంచీలో సద్దికట్టుకుని, ఒక జత బట్టలు కూడా తీసుకుని వచ్చాడాయన. భోరున కురిసిన వర్షానికి చెట్టుకొకరు పుట్టకొకరుగా ప్రజలు ఉరుకులు పెట్టినా, అర్ధరాత్రి ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రకటన చేసే దాకా కదలకుండా అక్కడే ఉన్నాడా పెద్ద మనిషి. ఆ రాత్రి అదిలాబాదుకు చెందిన ఒక తెలంగాణ ఉద్యమకారుడు దయతలచి నరసింహా రెడ్డి గారిని, నన్ను, పిట్టల శ్రీశైలాన్ని ఇంటి దగ్గర దింపి వెళ్లాడు.

ఇంత వయసొచ్చినా ఈ నాటికీ ప్రతి శనివారం హిమాయత్ నగర్ లోని తెలంగాణ రిసోర్స్ సెంటర్ లో జరిగే చర్చ కార్యక్రమానికి క్రమంతప్పకుండా హాజరవుతాడాయన. అంతేకాదు అక్కడ వక్తలు మాట్లాడిన మాటలను శ్రద్ధగా నోట్స్ రాసుకుంటాడు.

వలస పాలకుల నిర్ల్యక్షానికి నిలువుటద్దంలా నిలిచిన బీబీనగర్ NIMS కు నిధులు కేటాయించి దాన్ని వెంటనే ప్రారంభించాలనే డిమాండుతో అయిదు రోజుల క్రితం ఆమరణ దీక్షకు కూర్చున్నాడు కొమ్మిడి నరసింహా రెడ్డి. ఇవ్వాళ ఉదయం మూడింటికి కొమ్మిడి నరసింహా రెడ్డి గారిని పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ కాలపు తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తి ఆయన.

By: కొణతం దిలీప్ 

కొమ్మిడి నరసింహా రెడ్డి గారి గురించి నమస్తే తెలంగాణలో వచ్చిన ఆర్టికల్ చదవడానికి కింద లంకెమీద క్లిక్ చేయండి)

— భూదాన్ రెడ్డి


Connect with us

Videos

MORE

Telugu

MORE

Featured

MORE