mt_logo

కంటికి వెలుగు కేసీఆర్

By మార్గం లక్ష్మీనారాయణ

కంటివెలుగు శిబిరం నిర్వహించడానికి వచ్చిన వైద్యులు, అధికారులకు ప్రజలే స్వచ్ఛందంగా సహకరించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో చొరవ తీసుకోవాలి. ప్రజలందరికీ మంచి చూపును అందించే గొప్ప నైతిక బాధ్యతను ప్రజలే స్వీకరించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా.. ఏ ఒక్కరూ వైద్యం అందక శాశ్వత అంధత్వానికి గురికావద్దు. కంటిచూపు లోపాలను అధిగమిద్దాం. ప్రజలందరికీ కంటివెలుగులు ప్రసరింపజేద్దాం.

తెలంగాణలో వైద్య విప్లవం జరుగుతున్నది. వినూత్న, విశేషమైన పథకాలు అమలవుతున్నాయి. ఇన్నిరకాల ప్రభుత్వ పథకాలు అమలైన దాఖలాలు చరిత్రలో లేవు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావమే కాదు. అనంతరం ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కూడా చరిత్రాత్మకంగానే నిలుస్తున్నది. ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను ఎన్ని ప్రభుత్వాలు నిర్వర్తిస్తున్నాయి? కనీసం కొన్ని ప్రభుత్వాలైనా కనీసంగానైనా వైద్య బాధ్యతను నిర్వర్తిస్తున్నాయా? పూర్తిగా కాదనలేకపోయినా, అవునని మాత్రం కచ్చితంగా చెప్పలేం. నిజంగా వైద్యసేవలను ప్రజలకు అందించాలన్న బాధ్యతలను ప్రభుత్వాలు తీసుకొని ఉంటే ఇంకా ఇన్నిరకాల వైద్య సమస్యలను మనం చూడాల్సిన దుస్థితి ఉండేది కాదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలకు ఇంతగా పనిచేయాల్సి వచ్చేదీ కాదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎంతచేసినా చేయాల్సింది మిగిలే ఉంటుంది. కానీ ఎంతో కొంత బాధ్యతగా చేసి ఉంటే ఇంతగా చేయాల్సిన అవసరం ఉండేది కాదు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సమస్యలను అధిగమించి కొత్త పథకాల రూపకల్పనకు కాస్త సమయం పట్టింది. సీఎం కేసీఆర్ పథకాల రూపకల్పన మీద అత్యంత శ్రద్ధను కనబరిచారు. రాష్ట్ర ఆర్థిక లోటుపాట్లను అర్థం చేసుకొని, తక్షణావసరాలు తీరేలా, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేలా, అమల్లో లోపాలు లేకుండా పడక్బందీగా పథకాలను రూపొందించారు. ఫలితంగా మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కేసీఆర్ కిట్ వంటి అనేక వినూత్న పథకాల అమలు ప్రారంభమైంది. అద్భుత ఫలితాలు ఆవిష్కారమవుతున్నాయి. అలా ఒక్కో పథకం కలిపి 400 పథకాలు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదంటే ఆశ్చర్యం వేస్తున్నది. ఇలా కేసీఆర్ మేధోమథనం నుంచి వచ్చిన అనేకానే క అద్భుత పథకాల్లో ఒకటి కంటివెలుగు.

అవగాహన లేకనో, గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించే సౌకర్యం అందుబాటులో లేకనో, ఆర్థిక స్థోమత సరిపోకనో, కంటిచూపు లోపాలను గుర్తించలేకనో, అనేకమంది కంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రధానంగా వయసుతో వచ్చే చత్వారం, అన్నిరకాల కళ్ల వైకల్యాలు, అంధత్వం, క్యాటరాక్ట్, మధుమేహంతో వచ్చే రెటినోపతి, గ్లకోమా, ఓపెన్ యాంగిల్, హైపోరోపియా వంటి సమస్యలు కంటికి సంబంధంతో వచ్చేవి. అయితే.. ప్రపంచంలో 253 మిలియన్ల మంది దృష్టి వైకల్యాలతో ఉన్నారు. 36 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. 217 మిలియన్ల మంది తీవ్ర కంటి సమస్యలతో బాధపడుతున్నారు. 50 ఏండ్ల పైబడిన వాళ్ళల్లో 81 శాతం మంది కంటిచూపు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, వీళ్లల్లో క్యాటరాక్ట్ సమస్యలతో పాటు ఆపరేషన్లు జరుగకపోవడం వల్లే ఎక్కు వ ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సాధారణ చూపు లోపాలు, కంటి వైకల్యాలు, తీవ్ర కంటిచూపు లోపాలు, అంధత్వం అనే నాలుగు రకాల సమస్యలున్నాయి. వీటిల్లో 80 శాతం నయం చేయతగిన సమస్యలున్నట్లుగా సర్వేలు తేలుస్తున్నాయి.

ప్రధానంగా 53 శాతం ప్రజల్లో కంటి సమస్యలను గుర్తించకపోవడం, 25 శాతం ఆపరేషన్ అవసరం ఉన్నా చేయించుకోకపోవడం, 4 శాతం వయసుతో వచ్చే సమస్యలు, 2 శాతం గ్లకోమా, 1 శాతం మధుమేహ సమస్యల వల్ల వస్తున్నట్లుగా తేలింది. అంధత్వానికి ప్రధాన కారణాలు 35 శాతం, కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేయించుకోని కారణంగా, 21 శాతం కంటి సమస్యలను సరిచేసుకోకపోవడం, 8 శాతం గ్లకోమా కారణం. 15 ఏండ్ల లోపు పిల్లల్లో 19 మిలియన్ల మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీళ్లల్లో 12 మిలియన్ల మంది రిఫ్రాక్టివ్ సమస్యలతో ఉన్నారు. మొత్తంగా 1.4 మిలియన్లు తీర్చలేని అంధత్వంతో బాధపడుతున్నారు. వీరిలో ప్రధానంగా కంటిజబ్బుల పట్ల చైతన్యం చేయడం, కంటి వైద్యం అందించడమొక్కటే దారి. ఒకవేళ ఇది జరుగకపోతే 2050 నాటికి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సంఖ్య మూడింతలు పెరిగే ప్రమాదం ఉన్నది. జనాభా పెరుగుదల కూడా ఇందుకు కారణమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంధత్వ నివారణకు ప్రత్యేక బాధ్యత తీసుకున్నది. 2019 నాటికి కనీసం 25 శాతం ప్రజల్లో కంటి సమస్యలను నివారించాలని నిర్ణయించింది. ఇక దేశంలో, రాష్ట్రంలో.. ఆధునిక పరికరాలతోపాటు లభిస్తున్న మంచి వైద్యం కారణంగా 75 శాతం నివారించదగ్గ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వైద్యం, రోగుల అవసరాల మధ్య వ్యత్యాసం ఇంకా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తేడా ఇంకా ఎక్కువే.

ఆహారపుటలవాట్లు, కంటిచూపుకు కాపలాలా ఉండే విటమిన్ ఎ, డి లభించే పొద్దటిపూట సూర్యోదయాలను, సాయంకాలపు సూర్యాస్తమయాలను చూడని, చూడలేని పనుల బిజీలో ఉండే జనాలకు సహజంగా నే ఇలాంటి సమస్యలు ఎక్కువగా సంప్రాప్తిస్తున్నాయి. నిరంతర బిజీ జీవితాలకు తోడుగా ఒత్తిళ్ళు, మధుమేహం వంటి వ్యాధులు, నిర్లక్ష్యపు వాహన ఛోదనం, ప్రమాదాలు అవగాహన లోపాల వంటి అనేక కారణాల వల్ల కూడా అనేక మంది అంధత్వం బారిన పడుతున్నారు.

వీటన్నింటి మీద అవగాహన ఉంది కాబట్టే, సీఎం కేసీఆర్ ముందు చూపు, ప్రజల కంటిచూపు లోపాలకు ఆసరా అవుతున్నది. అడుగందే అమ్మయినా అన్నం పెట్టదనేది సామెత. అమ్మే అడుగకపోతే అన్నం పెట్టని పరిస్థితుల్లో ఎవరూ అడగకుండానే సీఎం కేసీఆర్ కంటి రెప్పలా నేనున్నానని ముందుకు వచ్చారు. ఒక్క కంటిచూపు విషయంలోనే కాదు అభివృద్ధి సంక్షేమ పథకా ల్లో ప్రజలకు మేలు జరిగే ఏ అం శంలోనూ కేసీఆర్ రాజీపడటం లేదు.

అందుకే సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి, వైద్య సేవలు, కంటి అద్దాలు అందించే ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రవ్యా ప్తంగా 824 వైద్యబృందాలు సిద్ధమయ్యాయి. అదనంగా 113 టీములను సిద్ధంగా ఉంచారు. 40 లక్షల కళ్ళద్దాలు ప్రజల కోసం సిద్ధంగా ఉన్నాయి. 25 లక్షల కళ్ళద్దాలు గ్రామాలకు చేరాయి. ఐదారు నెలల పాటు నిర్వహించే శిబిరాల సంఖ్య 12 వేలు దాటనున్నది. ప్రస్తుతం రోజుకు లక్ష మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షకుపైగా మందికి కళ్ళద్దాలు పంపిణీ చేశారు. 35 ఏండ్లు దాటిన చాలా మందిలో కంటిలోపాలు కనిపిస్తున్నాయి. క్యాటరాక్ట్ వంటి అనేక సమస్యలకు రెఫరల్స్ కూడా జరుగుతున్నాయి. సరోజినీ వంటి కంటి దవాఖానలను మరింత బలోపేతం చేసే చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టింది. సరోజినీ దవాఖానకు అత్యాధునిక పరికరాలు రావడమేకాదు, ఐ బ్యాంక్ ను కూడా ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితమే ఐ బ్యాంకును వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అలాగే వరంగల్ లోని ప్రాంతీయ కంటి దవాఖాన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు దృష్టిలోపం ఉన్నవాళ్లకు అక్కడికక్కడే కళ్లద్దాలు, మందులు ఉచితంగా అందిస్తారు. అవసరమైనవారికి పట్టణాలు, నగరాల్లోని మంచి కంటి దవాఖానల్లో ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటివెలుగు శిబిరం నిర్వహించడానికి వచ్చిన వైద్యులు, అధికారులకు ప్రజలే స్వచ్ఛందంగా సహకరించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో చొరవ తీసుకోవాలి. ప్రజలందరికీ మంచి చూపును అం దించే గొప్ప నైతిక బాధ్యతను ప్రజలే స్వీకరించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా.. ఏ ఒక్కరూ వైద్యం అందక శాశ్వత అంధత్వానికి గురికావద్దు. కంటిచూపు లోపాలను అధిగమిద్దాం. ప్రజలందరికీ కంటివెలుగులు ప్రసరింపజేద్దాం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *