mt_logo

చిత్తూరు జిల్లాకే రూ. 7వేల కోట్లు ఇచ్చినప్పుడు గుర్తురాలేదా?

వాటర్ గ్రిడ్ పథకంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించి వారి దాహార్తిని తీర్చాలన్న గొప్ప సంకల్పంతో రూపొందించిన జలహారం పథకాన్ని రాజకీయం చేయొద్దని, తాము కాంగ్రెస్ పాలకులలాగా ఒక చేత్తో అడ్వాన్సులిచ్చి మరో చేత్తో కమీషన్లు తీసుకునే రకం కాదని మండిపడ్డారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి సీ లక్ష్మారెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఇతర నేతలతో కలిసి ఆదివారం మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. తమది కమీషన్ల ప్రభుత్వం కాదని, రూ. 10వేల కోట్లతోనే పది జిల్లాల్లో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే అవకాశముంటే కాంగ్రెస్ నేతలు ఇన్నేళ్ళూ ఏం చేశారని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క చిత్తూరు జిల్లాకే రూ. 7వేల కోట్లతో మంచినీటి పథకం చేపట్టినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని విమర్శించారు. జలహారం పథకం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని, కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ అధ్యక్షుడు, శాసనసభ, మండలి ఎల్పీ నాయకులు మొదటిసారిగా ఒకే వేదికపైకి వచ్చి చాలా మాట్లాడారని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్ అన్నారు. రూ. 10వేల కోట్లతో పూర్తయ్యే పథకానికి రూ. 40వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, నిజంగా రూ. 10వేల కోట్లతో పూర్తిచేసే అవకాశం ఉంటే ఇన్నిరోజులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఒక్క చిత్తూరు జిల్లాకే రూ. 7వేల కోట్లయితే, పది జిల్లాలకు ఎంత కావాలి? తెలంగాణ మొత్తానికి కేవలం రూ. 10వేల కోట్లతోనే  ఇంటింటికీ ఎలా నీళ్ళు ఇస్తారు? ఈ విషయం మీకు ఆరోజు గుర్తు రాలేదా? అని మంత్రి నిలదీశారు.

ఈ పథకం ముఖ్యమంత్రో, మంత్రో డిజైన్ చేసింది కాదని, ఇంజినీరింగ్ చీఫ్ లు, ఈఈలు, ఈఎన్సీలు డిజైన్ చేసిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రమాణాల మేరకు కృష్ణా, గోదావరి నదుల నుండి 39 టీఎంసీల సర్ఫేస్ వాటర్ తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 100 ఎల్పీసీడీలు, మున్సిపాలిటీల్లో 135 ఎల్పీసీడీలు, కార్పొరేషన్ల పరిధిలో 150 ఎల్పీసీడీలను ఇంటింటికీ నల్లాల ద్వారా ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ ను రూ. 40వేల కోట్లతో ఇంజినీర్లు డిజైన్ చేశారని కేటీఆర్ తెలిపారు. వాటర్ గ్రిడ్ పై ఎవరైనా సమాచారం కావాలనుకుంటే సమాచార హక్కు చట్టం కింద తీసుకోవచ్చని, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్ వద్ద కూర్చుని సమాచారాన్ని తీసుకోవచ్చన్నారు. జలహారం పథకాన్ని మూడేళ్ళలో పూర్తిచేసి తీరుతామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *