ముందుంది మూజువాణి పండగ

  • February 6, 2014 5:30 pm

తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి రోజుకో కుట్ర చేస్తున్న సీమాంధ్ర నేతలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం రకరకాల వ్యూహాలు చేస్తుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించిన విధానాన్ని తిప్పికొడుతూ మూజువాణి ఓటు అస్త్రాన్ని ప్రదర్శించనుంది. మూజువాణి ఓటు అంటే ప్రశ్నించడానికి వీల్లేని, వ్యతిరేకతలేని ఓటు విధానం. ఈ రకమైన ఓటు విధానాన్ని ఎవరూ ప్రశ్నించడం ఉండదు. పార్లమెంటు, శాసనసభల్లో 90 శాతం బిల్లులు ఈ విధానం ద్వారానే ఆమోదం పొందుతాయి. గతంలో ఎన్డీయే హయాంలో ఏర్పడ్డ మూడు రాష్ట్రాల ఏర్పాటు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మూజువాణి పద్ధతితో ముందుకు వెళ్లనున్నట్లు తెలిసింది. మంగళవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే మూజువాణి అంశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్ఎల్డీ, సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గక మూజువాణి ఓటు ద్వారా లోక్ సభలో జార్ఖండ్ బిల్లును ఆమోదించింది. మధ్యప్రదేశ్ పునర్విభజన బిల్లును కూడా మూజువాణి ఓటు ద్వారానే ఆమోదింపచేసింది. ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా మూజువాణి ఓటుతో ఏర్పాటు చేసింది. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలను మామూలుగానే ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మెజారిటీ కలిగిన అధికార పక్షం మూజువాణి ఓటు విధానం ద్వారా బిల్లును ఆమోదించుకోవడం సర్వసాధారణం. ఈ పద్దతిలో బిల్లుకు అనుకూలంగా అవును అనే వారిని, కాదు అనేవారిని చేతులెత్తమని అంటుంది. సభలో ఉండేది ఎక్కువమంది రూలింగ్ పార్టీ సభ్యులే కావడంతో అవును అంటూ అధికులు చేతులెత్తుతారు. అవును అనే అభిప్రాయం ఎక్కువ మంది చెప్పారని భావిస్తూ స్పీకర్ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రక్రియ ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా బిల్లులు ఈ రకంగానే పాస్ అయ్యాయి. 2013 లో లోక్ పాల్ బిల్లు, అత్యాచార నిరోధక బిల్లు, ఐఐటీ బిల్లు, ఆహార భధ్రత బిల్లు, డిజిటల్ కేబుల్ టీవీ బిల్లు, అసోం రైఫిల్స్ బిల్లు, ఓవర్ వ్యూ ఆఫ్ కంపెనీస్ బిల్లు మొదలైనవి మూజువాణి తోనే ఆమోదం పొందాయి.

Connect with us

Videos

MORE