mt_logo

వానాకాలం వస్తే ఊసిళ్లు….ఎన్నికలొస్తేనే ఊళ్లళ్లకు కాంగ్రెసోళ్లు: హరీష్ రావు

సిద్దిపేట మండలం‌ ఎల్లుపల్లి గ్రామ సభకు మంత్రి హరీష్ రావు హజరయ్యారు. గ్రామస్థులంతా ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలోని పలు సంఘాల నేతలు మంత్రి హరీష్ రావుకు శాలువాతో సత్కరించి ఏకగ్రీవ తీర్మాన పత్రులను అందజేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… మరలా కారు గుర్తుకే ఓటు వేస్తామని తీర్మానం చేసిన ఎల్లుపల్లి గ్రామానికి తాను సదా రుణపడి ఉన్నానన్నారు. మూడో సారి టీఆర్ఎస్ కే మా ఓటంటూ ఎల్లుపల్లి గ్రామస్థులు‌ ఏకగ్రీవ తీర్మానం చేసి చరిత్ర ‌సృష్టించారని ప్రశంసించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు తనకు గ్రామం వెన్నంటి నిలిచిందని, తెలంగాణ ‌సాధనలో కలిసి వచ్చిందని ప్రసంశించారు. గ్రామ అభివృద్ధికి తన వంతుగా తాను కృషి చేశానని, రానున్ను రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు‌ చేపడతామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రంతో పాటు సిద్దిపేట జిల్లా అభివృద్ధి చెందిందని మంత్రి అన్నారు. ఒక నాడు రహదారి సౌకర్యం లేని ఎల్లుపల్లి గ్రామంలో సీసీ రోడ్లు వేయించామన్నారు. ట్రాన్స్ ఫార్మర్, చెరువు మరమ్మతులు చేపట్టామని చెప్పారు. చెక్ డ్యాంలు, కాలువులు, స్మశాన వాటిక నిర్మాణం జరిగిందన్నారు. మూడు కోట్లతో మార్కెట్ గోదాము నిర్మించుకున్నామన్నారు. ఎల్లుపల్లి గ్రామం ఢిల్లీ స్థాయిలో నిర్మల్ పురస్కార్ అవార్డును, జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా అవార్డు పొదిందని మంత్రి హరీష్ రావు అన్నారు.

త్వరలోనే మిట్ట పల్లి వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటవుతుందని, 500 ఎకరాల్లో సిద్దిపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎల్లుపల్లి గ్రామ శివార్లలో ‌ఏర్పాటవుతుందని, హుస్నాబాద్ రోడ్ జాతీయ రహదారి కానుందని మంత్రి చెప్పారు. కాళేశ్వరం నీటితో రానున్న రోజుల్లో చెరువులు కుంటలు నింపుతామన్నారు. వచ్చే వానాకాలం‌ నాటికి రెండు పంటలకు కాళేశ్వం నీరు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే మరో 50 ఏళ్లయినా గోదావరి నీరు తెచ్చేది కాదన్నారు. సీఎం కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టే రైతులకు నీరు, ఎకరానికి 4 వేల పెట్టుబడి, ప్రతీ రైతుకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ఎల్లుపల్లి గ్రామం మరింత అభివృద్ధి సాధిస్తుందని మంత్రి చెప్పారు.

అరవైఏళ్ల పాటు అధికారలో ఉన్న కాంగ్రెస్ పార్టీ‌చేసిందేమి లేదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు‌ సిద్దిపేటలో లైన్లు కట్టాల్సిన పరిస్తితి ఉండేదన్నారు కాలిపోయే మోటార్లు, పెలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు కాంగ్రెస్ మార్కని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని అన్నారు. కనీసం ఆరు గంటల విద్యుత్ ఇవ్వని పరిస్థితి ఉందని‌ గుర్తు‌చేశారు. అలాంటి పరిస్థితులకు కారణమయిన కాంగ్రెస్ మళ్లీ ఏ మొహంతో ఓట్లడుగుతుందని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *