mt_logo

తెలంగాణ పారిశ్రామిక పాలసీ అద్భుతం- గవర్నర్ నరసింహన్

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పాలసీ చాలా బాగున్నదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఈ పాలసీని అద్భుతంగా అమలుచేస్తుందని, విదేశీ పారిశ్రామికవేత్తలు ఈ పాలసీకి ఆకర్షితులౌతున్నారని అన్నారు. ఆదివారం హెచ్ఐసీసీ హోటల్ లో డిఫెన్స్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ రెండో రోజు ప్రారంభ సభలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని, హైదరాబాద్ ఏరోస్పేస్ హబ్ గా ఎదగడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా మెరుగవుతున్నాయని, దీనికి హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధే నిదర్శనమని అన్నారు. అర్హత ఉన్న విద్యార్ధులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు రావాలనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఆదిభట్లలో రూ. 3000 కోట్ల పెట్టుబడులతో ఏరోస్పేస్ క్లస్టర్ ఏర్పాటు కానున్నదని జూపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *