mt_logo

ఘనంగా జరిగిన గాంధీ మెడికల్ కాలేజీ వజ్రోత్సవ వేడుకలు..

సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల 60 వ వార్షికోత్సవం సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖామంత్రి టీ రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కేకే, బూరనర్సయ్య గౌడ్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, సీమాంధ్ర పాలనలో వివక్షకు గురైన వైద్య, ఆరోగ్య శాఖను పటిష్ట పరిచేందుకు సీఎం కేసీఆర్ చొరవ చూపిస్తున్నారని, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని, మండలంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను, నియోజకవర్గంలో 100 పడకల దవాఖానను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ 200 మెడికల్ సీట్లను కోల్పోయిందని, వచ్చే సంవత్సరం వాటిని తిరిగి తెచ్చుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాజయ్య చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వైద్య, ఆరోగ్య శాఖను తెలంగాణ ప్రభుత్వానికి మణిహారంగ నిలబెట్టేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. బంగారు తెలంగాణ సాధిస్తేనే జయశంకర్ సార్ ఆశయం నెరవేర్చినట్లవుతుందని, ఆరవతరగతి చదివే వయసులోనే పాఠశాలలో నిజాంకు అనుకూలంగా గేయం పాడకుండా వందేమాతర గీతం పాడిన మహానుభావుడు జయశంకర్ సార్ అని రాజయ్య ప్రశంసించారు.

హోంమంత్రి నాయిని మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని వర్గాలు కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఎంపీ కేకే అన్నారు. బీజేపీ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ, తెలంగాణలో ఎయిమ్స్ లాంటి అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందని, తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన గాంధీ దవాఖాన నిమ్స్ తరహాలో ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *