mt_logo

జీ ప్లస్ 1 ఇళ్ళ నిర్మాణాలకు ఫిబ్రవరిలో ముహూర్తం..

ఇళ్ళు కావాలని ఎవరు ముందుగా వస్తే వాళ్ళకే కట్టిద్దామని, అట్లా వచ్చిన వాళ్ళ దగ్గర నుండే దరఖాస్తులు తీసుకోమని, ఫిబ్రవరిలో నిర్మాణం ప్రారంభించి నాలుగు నెలల్లో వారి చేతిలో పెడదామని, ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు చూసి నిరుపేదల ముఖాలు కళకళలాడాలి అని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మురికివాడలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంక ఎవరినీ లక్ష్యపెట్టరాదని, ప్రభుత్వానికి అందుతున్న సమాచారాన్ని బట్టి నూటికి 95 శాతం మంది జీ+1 పద్ధతిలో ఇండ్లకు సిద్ధంగా ఉన్నందున ఎవరు ముందుకొస్తారో వాళ్ళకే ఇండ్లు అనే పద్ధతిలో వెళ్లాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జనవరి రెండో వారంలో నాలుగురోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలోని లక్ష్మీపురం, శాకరాసికుంట, దీనదయాళ్ నగర్, అంబేద్కర్ నగర్, ప్రగతినగర్ తదితర కాలనీలు, మురికివాడల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని వారికి ఇళ్ళు నిర్మించాలని అక్కడికక్కడే నిర్ణయం తీసుకుని 3957 ఇళ్ళను జీ ప్లస్ 1 పద్ధతిలో కట్టించేందుకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి రూ. 400 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

అయితే దాదాపు అన్ని కాలనీల్లో నాలుగు, ఐదేసి స్థలాల్లో కొంతమంది స్వార్ధ రాజకీయ నేతలు కబ్జా చేశారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో వారి కబ్జాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో అమాయకులైన పేదల్లో అనుమానాలు కలిగించారు. ప్రభుత్వం నిర్మించనున్న జీ+1 ఇళ్ళకు తాము వ్యతిరేకమనేలా చేశారు. బినామీ పేర్లతో కుటుంబ సభ్యుల పేర్లపై రెండంతస్తుల ఇళ్ళు, ఖాళీ ప్లాట్లు, డాబా ఇళ్ళు ఉన్నవారే ఇలాంటి గొడవలు పెడ్తున్నారని సమాచారం. గరీబోళ్ల బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తున్న వారిని ఎట్టిపరిస్థితిలో వదిలేది లేదని అధికారులు గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిని బట్టి చూస్తే పేదలకు ఇళ్ళు నిర్మించే విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో, అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు కూడా అంతే పట్టుదలగా ఉందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *