DTC ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగాన్, అమెరికా: డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ (డి.టి.సి.) ఆధ్వర్యంలో మరియు ఎన్.అర్.ఐ. తెలంగాణ జాగృతి, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్త సహకారంతో మిషిగాన్ చరిత్రలోనే అతిఫెద్ధ బతుకమ్మ పండుగను తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను అద్దంపట్టేలా చాలా ఘనంగా నిర్వహించారు. ఫార్మింగ్టన్ హిల్స్ పట్టణంలో సుప్రసిద్ధ సెయింట్ తోమా చర్చిలో, డెట్రాయిట్ పన్నెండో బతుకమ్మ పండుగ ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి దిగ్విజయంగా నిర్వహించారు. అనేకమంది డీటీసీ కార్యకర్తలు చాలా రోజుల నుండి ప్రణాళిక బద్ధంగా శ్రమ పడి మిషిగాన్ ప్రవాస భారతీయులందరికి తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను అద్దం పట్టేలా చూపించే ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.

ఈ బతుకమ్మ సంబరాలకు పలు ప్రాంతాలనుండి దాదాపు 1500 మందికిపైగా తెలంగాణ మరియు ఇతర ప్రవాస భారతీయులు తరలివచ్చారు. డెట్రాయిట్ నగర చుట్టు ప్రాంతాల వారే కాకుండా లాన్సింగ్, ఫ్లింట్, జాక్సన్, టొలీడొ, కెనడా తదితర ప్రాంతాల నుండి ఈ సంబరాలకు విచ్చేశారు. ఐదు గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు వెల్లువిరిసాయి.

శనివారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో రంగురంగుల దుస్తులలో వచ్చిన మహిళలతో, అందంగా అలంకరించబడిన బతుకమ్మలతో ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మహిళలు ఎంతో కష్టపడి రంగురంగుల పూలతో తయారుచేసిన పెద్ద బతుకమ్మలను ట్రక్కులలో తీసుకొచ్చి ఉత్సాహంగా జరుపుకోవడం ఈ సంవత్సరపు విశేషం. స్థానిక వెంకటేశ్వర దేవాలయం ప్రధాన పూజారి నిర్వహించిన జమ్మి పూజ మరియు గౌరి పూజతో బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు, చిన్నారులు చప్పట్లు కొడుతూ “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.

పిండి వంటకాలు, తెలంగాణ సాంప్రదాయిక విందు భొజనం అందరికి వడ్డించారు. సకినాలు, గారెలు, మిర్చిబజ్జీలు, రకరకాల గుడాలు, పులిహోరాలు, లడ్డూలు మరియు ఇతర వంటకాలు తెలంగాణేతరులను కూడా చాలా ఆకర్షించాయి.

సభ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను డీ.టీ.సీ అధ్యక్షులు శైలేంద్ర సనమ్ గారు స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు, చైర్మన్ భుజంగ రావు గారు డీ.టీ.సీ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం తెలంగాణ ఎన్.అర్.ఐ జాగృతి అధ్యక్షుడు శ్రీధర్ బండారు, ఆటా కాబోయే అధ్యక్షులు వినోద్ కుకునూర్ గారు, టాటా మిచిగాన్ సమన్వయకర్త విజయ్ సెరి గారు అమెరికాలో మరియు తెలంగాణలో తమ సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఆ పిదప ఈ కార్యక్రమానికి విశేష కృషి చేసిన డీ.టీ.సీ కార్యవర్గం సభ్యులను, కార్యకర్తలని, వాలంటీర్లు మరియు దాతలను వేదిక పైకి పిలిచి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలిపారు. మంచి రుచికరమైన తెలంగాణ వంటకాలను అందించిన బావార్చి రెస్టారెంట్ వారికీ, తమ నైతిక మద్దతు తెలిపిన ఇతర స్థానిక డిట్రాయిట్ తెలుగు మరియు భారతీయ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అతి పెద్ద బతుకమ్మలను పేర్చి తెచ్చిన ఆడపడుచులను రాజు బ్రహ్మాండభేరిని ప్రత్యేకంగా అభినందించారు.

ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు శిరీష రెడ్డి వ్యాఖ్యాతగా ప్రారంభమయి అర్థరాత్రి వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య కళాకారుడు అమెరికా జానపద జనరంజకుడు జనార్దన్ పన్నెల తన అమోఘమైన పాటలతో శ్రోతలను మంత్ర ముగ్దుల్ని చేసి అందరిని ఉర్రుతలూగించాడు. స్థానిక చిన్నారులు కూడా పాటలు మరియు నృత్యాలతో అందరిని అలరించారు.

ఈ కార్యక్రమ నిర్వాహణకు విశేషంగా కృషి చేసిన హరి పరాంకుశం, రాజు బ్రహ్మాండభేరి, జితేందర్ సుంకే, రాజ్ మాడిశెట్టి, కృష్ణ గుడిగుంట్ల, రాజశేఖర్ కౌకుంట్ల, శ్రీనివాస రాజు ధేనువకొండ, విజయ్ పల్లెర్ల, హరి మారోజు, నాగేందర్ ఐత మరియు ఇతర వాలంటీర్లు అందరికి శైలేంద్ర సనమ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

    None Found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *