mt_logo

ఇకపై రూ.100 కే నల్లా కనెక్షన్!!

పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు ఇప్పటికే కేవలం రూ. 1 చెల్లిస్తే నల్లా కనెక్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతరులకు (ఏపీఎల్) కేవలం రూ. 100 కే నల్లా కనెక్షన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారు. అయితే ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఇంటికి నల్లా కనెక్షన్ పొందేందుకు రూ. 6,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటి లోపలికి నల్లా పెట్టుకోవాలంటే రూ. 10,500 చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ రుసుము ఇంత పెద్దమొత్తంలో ఉండటంతో పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావట్లేదని భావించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, నగరాలకు, పట్టణాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే డిపాజిట్ ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లాల కనెక్షన్ డిపాజిట్ తగ్గిస్తున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని మిషన్ భగీరథ ద్వారా అందే శుద్ధిచేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నానని సీఎం చెప్పారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 1.20 లక్షల ఇండ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. డిపాజిట్ ఎక్కువగా ఉన్నందున మిగతా ఇండ్ల యజమానులు ముందుకు రాలేదు. దీంతో 6.7 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ లేదు. వీటికితోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వాలి. అంతా కలిపి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వాలి. డిపాజిట్ ఎక్కువగా ఉన్నందున వీరంతా ముందుకు రారు. దీనివల్ల ప్రజలందరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందివ్వాలనే లక్ష్యం నెరవేరదు కాబట్టి రాష్ట్రానికి ఆర్ధికంగా భారమైనప్పటికీ నల్లా కనెక్షన్ డిపాజిట్ ను నామమాత్రం చేయాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *