mt_logo

కాంగ్రెస్, బీజేపీల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పథకాలే!!

ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఈ ఏడాది జూన్ 2 వస్తే తెలంగాణ ఏర్పడి ఐదేండ్లు అవుతుందన్నారు. ప్రస్తుతం భారతదేశం అంతటా తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలుచేసి ప్రశంసలు పొందిన పథకాలనే నేడు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టుకున్నాయని కేటీఆర్ విమర్శించారు.

ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఏపీ సహా 8 రాష్ట్రాలు రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి అమలుచేస్తున్నాయి. పొద్దున్న లేస్తే సీఎం కేసీఆర్ గారిమీద దుమ్మెత్తిపోసే చంద్రబాబు అన్నదాత సుఖీభవ పేరిట రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. అక్కడి రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారంటే అది కేసీఆర్ పుణ్యమే. ప్రధాని మోడీ పీఎం కిసాన్ పథకానికి రైతుబంధు పథకం ప్రేరణ అని చెప్పక తప్పదు. ఇవాళ విడుదలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల మేనిఫెస్టోలలో తెలంగాణలో అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన తొలిరోజుల్లో భయంకరమైన విద్యుత్ కోతలు ఉండేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎల్బీనగర్ తో పాటు విలీన మున్సిపాలిటీల పరిధిలో నీటి సమస్యను అధిగమించాం అని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. గడిచిన ఐదేళ్ళలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ విధించలేదు. శాంతిభద్రతల సమస్య లేనందువల్లే నేడు రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయి.

ఎల్బీ నగర్ పరిధిలో రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. త్వరలోనే ఎల్బీనగర్ లో రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరిస్తాం. మెట్రోను ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తాం. 2014లో మోదీ ప్రభావం బలంగా ఉంది కాబట్టి 283 సీట్లతో సంపూర్ణమైన మెజార్టీ కట్టబెట్టారు. ఇప్పుడు మోడీపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది. బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్ కు 100 సీట్లు దాటే పరిస్థితి లేదని మీడియా సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఒక్కో ఎంపీ కూడా కీలకం కానున్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా, మెట్రోకు నిధులు తెచ్చుకోవచ్చు. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రాజశేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించమని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *