mt_logo

దేశంలో తొలిసారి కంక్లూజివ్ టైటిల్ చట్టం!!

కొందరు కబ్జాదారులు, స్వార్ధపరుల కారణంగా రైతులు భూమిని కోల్పోతున్న విషయం తెలిసిందే. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా తీసుకుని కొందరు రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ఎంతోమంది రైతులు తమ భూములను కాపాడుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాదు.. అధికారులకు వేల రూపాయలు లంచాలు కూడా ఇస్తున్నారు. అందుకే రాష్ట్రంలో భూమి పంచాయితీలు ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తమ భూమిని ఎవరూ ఏం చేయలేరనే ధీమాను ప్రతిరైతుకు కల్పించాలని, ఇందుకోసం యజమానులైన రైతుల భూములకు పక్కాగా రికార్డులు రూపొందించాలని సంకల్పించారు. ఇప్పటికే వందరోజుల్లోనే భూ రికార్డులు ప్రక్షాళన చేసి రైతులకు పక్కగా పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించారు. అయితే కొందమంది అధికారులు లంచాల కోసం రికార్డులు తారుమారు చేసిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో భూ పరిపాలనా వ్యవస్థలోనే సమూల మార్పులు తెచ్చేందుకు సిద్దమయ్యారు.

ప్రతి భూమికి టైటిల్ గ్యారెంటీ చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనున్నది. ఇందుకోసం సీఎం కేసీఆర్ భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రికార్డుల ప్రక్షాళనతో 97% వివాదాలు సరిచేయించిన సీఎం ఈ రికార్డుల ఆధారంగా టైటిల్ గ్యారెంటీ ఇచ్చి యజమానులకు పూర్తి హక్కులు కల్పించనున్నారు. దీంతో భూమి విలువ పెరిగి భూమి తగాదాలు పూర్తిగా రద్దవుతాయి. అతికొద్ది సమయంలో భూమి యజమానులకు టైటిల్ గ్యారెంటీ ఇవ్వగలిగితే ప్రపంచ రికార్డు అవుతుందని భూమి వ్యవహారాల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టైటిల్ గ్యారెంటీ ఇలా..

సీఎం కేసీఆర్ చెపుతున్నట్టు.. కంక్లూజివ్ గ్యారెంటీ చట్టం వచ్చిన తర్వాత ప్రతిభూమికి పూర్తిస్థాయిలో కచ్చితమైన భూ యాజమాన్య హక్కులు వస్తాయి. ఎవరు వివాదాలు సృష్టించినా సదరు భూ యజమాని ఈ భూమి తనదేనని నిరూపించుకోవాల్సిన అగత్యంలేదు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తర్వాత ఆ భూమి పరిరక్షణ బాధ్యత అంతా సర్కారే తీసుకుంటుంది. టైటిల్ గ్యారెంటీ విధానంలో మూడురకాల రిజిస్టర్లు ఉంటాయి.

1.టైటిల్ రిజిస్టర్: ఎలాంటి వివాదాలు లేని భూములన్నింటినీ ఇందులో రికార్డుచేస్తారు. దీనిద్వారా టైటిల్ గ్యారెంటీ వచ్చేస్తుంది.
2.డిస్ప్యూట్ రిజిస్టర్: ఇందులో భూవివాదాలున్న వాటిని పొందుపరుస్తారు. వివాదాల పరిష్కారం తర్వాత టైటిల్ రిజిస్టర్‌లోకి మారుస్తారు.
3.రిజిస్ట్రేషన్ రిజిస్టర్: ఇందులో భూమి క్రయవిక్రయాలను పొందుపరుస్తారు. రిజిస్టర్ అయిన తర్వాత ఏవైనా ఫిర్యాదులువస్తే విచారించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం నిర్ణీత గడువు ఇస్తారు. ఆలోపు ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే మ్యుటేషన్ చేసి, టైటిల్ రిజిస్టర్‌లోకి ఎక్కిస్తారు.

ఇందుకోసం నాలుగురకాల పద్ధతులు అవలంబిస్తారు..

1.కర్టెన్ ప్రిన్స్‌పుల్: దీనిప్రకారం భూ యజమానికి పూర్తిహక్కు కల్పించేలా రికార్డుల్లో ఉన్నదే అంతిమసాక్ష్యంగా పరిగణిస్తారు. దీనికి వెనుక ఉండే చరిత్రను పట్టించుకోరు. పాత రికార్డులన్నీ తీసివేస్తారు. లింక్ డాక్యుమెంట్ల బెడద ఉండదు.
2.మిర్రర్ ప్రిన్స్‌పుల్: దీనిప్రకారం భూమి మీద వాస్తవ పరిస్థితులే రికార్డులో ఉంటాయి. రికార్డులో ఒకతీరుగా, ఫీల్డ్‌లో మరోలా ఉండదు.
3.రియల్ టైం చేంజెస్: దీని ప్రకారం భూమి లావాదేవీలు ఏమి జరిగినా వెంటనే రికార్డుల్లోకి వెళుతుంది.
4.టైటిల్ ఇన్సూరెన్స్: దీనిప్రకారం ఒకసారి టైటిల్ గ్యారెంటీ వచ్చాక భూ యజమానికి ఇబ్బంది జరిగితే నిజమైన యజమానికి పరిహారం చెల్లిస్తారు. రికార్డుల్లో ఉన్న వ్యక్తికి భూమి వెళుతుంది. నష్టపోయిన వ్యక్తికి భూమి రాదు కానీ ఇన్సూరెన్స్ కింద భూమి విలువ నష్టపరిహారం నగదు రూపంలో వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *