mt_logo

అహోరాత్రులు శ్రమించాం.. ఇంకా శ్రమిస్తూనే ఉంటాం- కేసీఆర్

కరోనా వైరస్ పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అహోరాత్రులు శ్రమించాం.. ఇంకా శ్రమిస్తూనే ఉంటాం.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాము. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు. రైతులకు ఏది కావాలో అది ఇచ్చాము. ఉద్యోగులు, పింఛన్ల జీతాలలో కోత విధించి ప్రజలను ఆదుకున్నామని కేసీఆర్ వివరించారు.

కరోనా ప్రపంచం, దేశానికి వచ్చిన విపత్తు. కేవలం తెలంగాణలో మాత్రమే కరోనా రాలేదు. మద్యం దుకాణాలు కేవలం తెలంగాణలోనే తెరిచామా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలు తెరవలేదా? ప్రతిపక్షం మాపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే ఆరోపణలు చేస్తుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే హోం ఐసోలేషన్ కు అనుమతి ఇచ్చాం. ప్రజలు కోరితేనే హోం ఐసోలేషన్ కు అనుమతి ఇచ్చాము. మరణాలు దాచేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. మరణాలను ఎవరైనా దాస్తారా? కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియదా? మరణాలు దాచేస్తే దాగేవా? అని ప్రశ్నించారు.

ప్రజలను రక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు, సేవలు ప్రభుత్వం అందిస్తుంది. రాజకీయంగా ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. ప్రజలు ఎవరికి వారే రక్షించుకోవాలి. ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 108 మంచి పథకం. బాగుందనే దాన్ని కొనసాగిస్తున్నాం. మంచిని మంచి అని చెప్పేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉంది. ఆరోగ్యశ్రీ కంటే గొప్పదని చెప్పుకొని బీజేపీ అభాసుపాలు కావొద్దని సూచించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేందుకు పరిశీలిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య జాతీయ స్థాయిలో కంటే తక్కువగా ఉందని, కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. అన్ లాక్ ప్రారంభం అయ్యాక రికవరీలో ముందంజలో ఉన్నామని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *