గత ప్రభుత్వాల మకిలి మనకొద్దు- సీఎం కేసీఆర్

  • October 14, 2015 11:55 am

సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడటంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా నిత్యం పర్యవేక్షించాలని, గత ప్రభుత్వం ఏడాదిలో నిర్మించిన ఇండ్లలోనే రూ. 5 వేలకోట్ల అవినీతికి పాల్పడిందని చెప్పారు. అలాంటి అక్రమాలు ఇప్పుడు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

సుమారు ఆరున్నర గంటలపాటు నిర్వహించిన సమావేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం, వాటర్ గ్రిడ్ పైప్ లైన్ల నిర్మాణం, మిషన్ కాకతీయ రెండో దశ, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పేదల ఇళ్ళ స్థలాల క్రమబద్దీకరణ, హరితహారం, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సరం కాలం గడిచింది.. ప్రధాన పథకాలను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం.. ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచి తెలంగాణ రాష్ట్ర ఫలాలను ప్రజలకు అందించాల్సిన సమయమిది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అట్టడుగున ఉండే లబ్దిదారులకు చేరేలా కృషి చేయాలని, దానికి సారధులు మీరే అని కలెక్టర్లకు సీఎం సూచించారు. గత ప్రభుత్వాల మకిలి మనకొద్దని, నిజమైన లబ్దిదారులకే ఇళ్లు ఇవ్వాలని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటివాటిలో వేగం పెంచాలని, రెండో విడత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పథకం అమలులో అడ్డంకులు తొలగించేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, డిసెంబర్ 31 లోపు రెండో దశ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని సీఎం చెప్పారు.


Connect with us

Videos

MORE