mt_logo

రెండేళ్లలో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ పూర్తిచేయాలి- సీఎం కేసీఆర్

గోదావరి నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని, దీనికోసం అయ్యే నిధుల విషయంలో ఎలాంటి కొరత లేదని సీఎం చెప్పారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మించబోయే తుమ్మిడిహట్టితో పాటు ఇతర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి వచ్చే గోదావరిపై ఆ ప్రభుత్వం అనేక చెక్ డ్యాంలను నిర్మించడం వల్ల నీటిప్రవాహం తగ్గిందని, భవిష్యత్తులో మరింత ఇబ్బంది తప్పదని చెప్పారు. అందుకే ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా వచ్చే నీటిని గరిష్టంగా వినియోగించుకుని తెలంగాణ రైతులకు మేలు చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 2017 చివరికల్లా తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలని, జిల్లాలోని నిర్మల్-ముథోల్ ప్రాజెక్టును, పెన్ గంగ బ్యారేజీని కూడా త్వరగా నిర్మించాలని సూచించారు. 2018 కల్లా నూటికి నూరుశాతం ప్రాజెక్టులు పూర్తిచేయాలని, ఆర్అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖల ద్వారా నదులు, వాగులు, కాలువలపై వంతెనలు నిర్మించేప్పుడు తప్పనిసరిగా వాటికి అనుబంధంగా చెక్ డ్యాంలు నిర్మించాలని కేసీఆర్ చెప్పారు. మరోవైపు నీటిపారుదల శాఖలో ఖాళీలను భర్తీ చేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అనుమతి ఇచ్చారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, అటవీ శాఖామంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ విప్ లు గొంగిడి సునీత, నల్లాల ఓదెలు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *