mt_logo

సినిమాపై తెలంగాణ ముద్రపడాలి

– మన రాష్ట్రం మన సినిమాపై సదస్సులో వక్తలు
– చిత్రపరిశ్రమ ఎక్కడికీ పోదు: ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ
సినిమాపై తెలంగాణ ముద్రపడాలని హైదరాబాద్‌లో తెలంగాణ సినిమా అస్థిత్వం. మన రాష్ట్రం మన సినిమాపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని సెస్ కార్యాలయంలో నిర్వహించిన సదస్సుకు ప్రముఖ దర్శకుడు బీ నరసింగరావు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ను వదిలి ఎక్కడికీ పోదన్నారు.

దానిని తరలించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఆంధ్రుల భావజాలం నుంచి విముక్తి చెందాల్సిన రంగాలలో చిత్ర పరిశ్రమ మొదటిది. సినిమారంగాన్ని ఆంధ్రా ప్రాంతానికి పరిమితం చేయడంవల్ల అందులో తెలంగాణకు స్థానం లేకుండాపోయింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, పోరాటాలను వాస్తవికంగా ప్రతిబింబించే సినిమాలు ఇప్పటికీ రూపొందడంలేదు అని అన్నారు. 1972 తర్వాత సినిమా రంగంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని, ఆంధ్రా సినీ ప్రముఖులు ఎక్కువగా భూములు సంపాదించుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగారని, పరిశ్రమ మొత్తం నాలుగైదు కుటుంబాల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయిందన్నారు.

వారి నుంచి తెలంగాణ సినిమా అస్థిత్వాన్ని కాపాడాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సినిమాల్లో స్థానం కల్సించాలని, మానవ సంబంధాలు, పోరాటాల కథాంశాలతో కమర్షియల్ పంథాకు భిన్నంగా సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలని కోరారు. దీనికోసం తెలంగాణ సినీరంగ ప్రముఖులంతా ఐక్యంగా పోరాటం చేయాలని, ప్రభుత్వం కూడా తెలంగాణ సినిమాను విడిగా గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ విధివిధానాలపై చిత్రపరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి వుందన్నారు. నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జీవిత పార్శాలను, పోరాటాలను ప్రతిబింబించే వాస్తవిక కథలతో సినిమాలు తీయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణలో సినిమాకు స్థానం లేకుండాపోయిందని, తమిళ, మలయాళం లాంటి పరభాషల నుంచి కథలను తీసుకొని సినిమాలు తీస్తున్నారన్నారు. దక్కన్ చరిత్రకు చాలా కథాసంపద ఉందని, కాకతీయులు, బహుమనీ సుల్తానులు, దేవగిరి పాలకులు ఎన్నో మంచి పనులు చేశారని, అలాంటి మన చరిత్రను, పోరాటయోధులను, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు వస్తేనే తెలంగాణ సినిమాకు ఓ ముద్ర ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత తరుణంలో తెలంగాణ దర్శక,నిర్మాతలు ఎన్నో వ్యయప్రయాసలతో సినిమాలు నిర్మిస్తే వారికి థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొందని, అలాంటి నిర్మాతలకు న్యాయం చేసేందుకు మినీ థియేటర్లను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ నిర్మాతలకు ప్రభుత్వం సబ్బిడీలు, రాయితీలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టంకశాల అశోక్, సానాయాదిరెడ్డి, సంగిశెట్టి దశరథ, చల్లా శ్రీనివాస్, హరికృష్ణ, సంగకుమార్, ప్రేమ్‌రాజ్, అల్లాణి శ్రీధర్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కథాంశంతో సినిమా తీయాలి: శంకర్
తెలంగాణ సినిమా పరిశ్రమ అభివృద్ధి అందరూ ఐకమత్యంగా కృషిచేయాలని సూచించారు. తెలంగాణ నిర్మాతల్లో పెట్టుబడి శక్తి తక్కువగా ఉన్నందున చిన్న, ప్రయోగాత్మక సినిమాలపై దృష్టిసారించాలని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ సినీవర్గాల్లో భేదాభిప్రాయాలు ఉన్నా ఐక్యంగా సినిమారంగ అభివృద్ధికి పాటుపడాలన్నారు. తెలంగాణ సినిమా అభివృద్ధి జరగాలంటే ప్రేక్షకుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందని కవి నందిని సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆంధ్రాభావాజాల సినిమాకు అలవాటుపడిన వారిని తెలంగాణ సినిమావైపు మళ్లించేలా దర్శక,నిర్మాతలు కృషిచేయాలన్నారు. తెలంగాణలోని పది జిల్లాలకు పరిమితమయ్యే సినిమాలు రూపొందించడానికి నిర్మాతలు ముందుకు రావాలని, తెలంగాణ కథాంశంతో రూపొందే ఒక్క సినిమా విజయవంతమైతే అందరూ అటువంటి చిత్రాలవైపే మొగ్గుచూపే ఆస్కారముంది దర్శకుడు శంకర్ చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిపై సినిమాలు తీయాలని, తెలంగాణ భాష, యాస సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ సినిమాలు ఉండాలని ప్రముఖ పాత్రికేయుడు పాశం యాదగిరి అన్నారు. తెలంగాణ సినిమా అభివృద్ధికి చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటుచేయాలని, పరిశ్రమలో తెలంగాణకు న్యాయమైన భాగం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు బీ నరసింగరావు అన్నారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *