mt_logo

రెండు కళ్ళ సిద్ధాంతి

By: విశ్వరూప్

“తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ళలాంటివి, రెండు చోట్లా మా పార్టీని కాపాడుకోవడమే మా లక్ష్యం, తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము ఉద్యమిస్తం, ఆవిధంగా చాలా స్పష్టమైన వైఖరితో ముందుకుపోతున్నాం” ఇదే మన చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం. ఏమాత్రం నిజాయితీ ఉన్న మనిషైనా ఒక రాజకీయ పక్షం ఇలా రెండుకళ్ళవైఖరి కలిగిఉండడాన్ని ఒక నీతిబాహ్యమైన, మోసపూరిత విధానంగా ఒప్పుకుంటారు, పచ్చకామెర్లొచ్చిన పచ్చబాబులు తప్ప.

ఒక ఇష్యూపై రెండు వర్గాలు ఘర్షణపడుతున్నప్పుడు ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయపార్టీ తమ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే వైఖరి చెప్పడం సాధ్యం కాదు అనుకుంటే కనీసం తటస్థంగా ఉండాలి, అంతే కానీ ఇలా రెండు చోట్లా ఉద్యమం చేసి రెండు చోట్లా రాజకీయంగా లాభపడదాం, కేంద్రం ఏ వైఖరి చెప్పినా అందుకు వ్యతిరేక సెంటిమెంటును కొల్లగొడదాం అని వ్యవహరించడం పచ్చి అవకాశవాదం.

ప్రస్తుతం దేశంలో రగులుతున్న కొన్ని సమస్యలపై రెండుకళ్ల విధానాన్ని అప్లై చేస్తే ఎలాగుంటుందో చూద్దాం:

అవినీతి, జన్‌లోక్‌పాల్ బిల్లు: మాపార్టీలో ఉన్న అవినీతిపరులైన నాయకులందరికీ జన్‌లోక్‌పాల్ బిల్లు ఇష్టం లేదు, ఆ బిల్లు వస్తే వారికి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు దండుకోవడం కష్టం. కానీ మా పార్టీలో మధ్యతరగతి కార్యకర్తలు అవినీతికి వ్యతిరేకం. కాబట్టి మా లంచగొండి నేతలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా, మిడిల్ క్లాస్ కార్యకర్తలు బిల్లుకు అనుకూలంగా ఉద్యమిస్తారు. మా పార్టీ ఇద్దరికీ మద్దతిస్తుంది, ఉద్యమానికి కావల్సిన మెటీరియల్‌ను ఇద్దరికీ సప్లై చేస్తుంది, ఆ విధంగా మేము ముందుకు పొతా ఉంటాము.

మహిళా రిజర్వేషన్: మాపార్టీలో మహిళలు రిజర్వేషన్ కావాలంటున్నారు, కొందరు పురుషులు మాత్రం దానికి వ్యతిరేకం. కనుక మేము ఇద్దరినీ రెండువైపులా ఉద్యమించమని చెప్పాం. మేము ఇద్దరికీ మద్దతిస్తున్నాం, ఆవిధంగా మేము స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాం.

అయోధ్య, బాబ్రీ మసీదు: మా పార్టీలో ఉన్న హిందువులేమో అక్కడ గుడి కట్టాలంటున్నారు, ముస్లిములేమో మసీదు కట్టాలంటున్నారు. మేము ఇద్దరికీ అనుకూలం కనుక ఇద్దరికీ కత్తులు సప్లై చేసి పొడుచుకుని చావండని చెప్పాం. మాపార్టీ ఈ విషయంపై అన్ని పార్టీలకన్నా అత్యంత స్పష్టమైన వైఖరి కలిగి ఉంది.

దళితుల వర్గీకరణ: మాపార్టీకి మాలలు, మాదిగలు రెండు కళ్ళలాంటివారు. మాకు ఇద్దరి వోట్లూ ముఖ్యమే. ఈ రెండు వర్గాల్లో ఎవరి వోట్లు రాకపోయినా మా పార్టీకి డిపాజిట్లు దక్కడం కష్టమవుతుంది. అందుకే మేం మా పార్టీలో మాలలకూ, మాదిగలకూ ఇద్దరికీ ఉద్యమాలు చేసుకోవడానికి స్వేఛ్చనిచ్చాం. ఇద్దరినీ వేర్వేరుగా ఉద్యమాలు చేసుకొమ్మనీ, ఎప్పుడయినా ఎదురుపడితే ఒకర్నొకరు కొట్టుకోమనీ సలహా ఇచ్చాం. ఇలా ముందుకు పోతాఉన్నామని నేను మనవి చేసుకుంటాఉన్నాను.

ఇంతకూ తనపార్టీలో రెండువర్గాలకు ఉద్యమించుకోవడానికి స్వేచ్ఛనివ్వడానికి ఈయనెవరు? స్వేచ్ఛనిచ్చింది భారత రాజ్యాంగం. ఈయనిచ్చింది స్వేచ్చకాదు, రెండువర్గాలమధ్య మంటరాజెయ్యడానికి కావల్సిన నిప్పు.

ప్రజలను ఏ నాయకులూ ఎల్లకాలం మోసగించలేరు. ఈ మోసగాళ్ళ ఆటలు తమ మోసం సాగినన్నాళ్లు మాత్రమే నడుస్తాయి. మోసం బట్టబయలయాక కూడా ఇంకా మోసం చేద్దామనుకుంటే చివరికి రెండు కళ్ళూ పోయి గుడ్డికళ్ళు మిగుల్తాయి, ప్రస్తుతం ఈ రెండుకళ్ళ సిద్ధాంతి పరిస్థితి ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *