mt_logo

బోధపడని రెండు విషయాలు

By: టంకశాల అశోక్

పలువురి నోట వినవస్తున్నవి, మనకు బోధపడనివి రెండు విషయాలున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘన విజయం సాధించగలమని అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వీలైనన్ని ఇతర పార్టీలతో చేతులు కలిపేందుకు ఎందుకింత తాపత్రయపడుతున్నది? బోధపడని రెండు విషయాల్లో ఇది ఒకటి కాగా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధమని పదే పదే ప్రకటించినవారు, ఇప్పుడు ముందస్తు రాకుండా చూసేందుకు ఎందుకింత ప్రయాస పడుతున్నట్లు?

తెలంగాణలో టీడీపీ కొనసాగటం చారిత్రక అవసరం అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గతవారమే మరొకమారు హైదరాబాద్ నుంచే ప్రకటించారు. తమకు తమ రాష్ట్రం ఒకటి సకల స్వేచ్ఛలతో ఉండగా, తెలంగాణలో కొనసాగవలసిన చారిత్రక అవసరం అంటే ఏమిటో, అది ఎందుకో ఆయన ఇంతవరకు ఒక్కసారి అయినా, రేఖామాత్రంగానైనా వివరించలేదు.

తమకు ఎదురయ్యే వివిధ ప్రశ్నలను ఇది నిజం కాదు, అది నిజం కాదు అంటూ కాంగ్రెస్ నాయకత్వం కొట్టివేస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నలు వాస్తవం అయినప్పటికీ ఇబ్బందికరం అయినప్పుడు, సమాధానాలు చెప్పలేనివి అయినపుడు వారు ఆ పని చేస్తారని తెలిసిందే. అదే పద్ధతిలో, పైన పేర్కొన్న విషయాలు ఏవీ అసత్యాలు కావు. ఒంటరిగానే పోటీ చేసి ఘన విజయం సాధించగలమని వారు అనటం అసత్యం కాదు. రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ నాయకుడు అదే మాట అన్నారు. ఢిల్లీ నాయకులు అదే అన్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు ఆ పార్టీ ఒకేసారి పిల్లమొగ్గ వేసి వీలైనన్ని ఇతర పార్టీలతో స్నేహానికి తాపత్రయ పడుతుండటం అసత్యం కాదు. అందులో భాగంగా ఒక మోస్తరు పార్టీల నుంచి మొదలుకొని, గోడ రాతల్లో మినహా క్షేత్రస్థాయి లో కనిపించనైనా కన్పించని ఇంటి పార్టీ వంటి సోకాల్డ్ పార్టీల వరకు అందరి మీదా ఆశలు పెట్టుకుంటున్నారు. పోతే, పైన అనుకున్నట్లు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధమని కాంగ్రెస్‌వాదులు ధీమాగా ప్రకటించి సవాళ్లు చేయటం అసత్యం కాదు. పైగా, సభను వెంటనే రద్దుపరుచాలంటూ రెచ్చగొట్టినట్లు మాట్లాడారు. ఇదెంత అసత్యం కాదో, తీరా అసెంబ్లీ రద్దు కావటం, ముందస్తు సన్నాహాలు మొదలుకావటంతో, ఏదో ఒకటి చేసి ఎన్నికలు ఇప్పట్లో రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటం కూడా అంత అసత్యం కాదు.

కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అయినందున దాన్ని కేంద్రం చేసుకొని మాట్లాడుతున్నాము గాని, వాస్తవానికి ఇది-అది అని కాకుండా ప్రతి ఒక్క ప్రతిపక్షం ఇదేవిధంగా వ్యవహరిస్తున్నది. టీడీపీ, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టులు, టీజేఎస్‌లలో దేనికీ దీనినుంచి మినహాయింపు లేదు. ఆ విధంగా పై ప్రశ్నలు నాలుగింటిని, వాటి విషయమై కాంగ్రెస్ సహా ఈ పార్టీలన్నింటి తీరును గమనించినప్పుడు చివరకు తేలుతున్నదేమిటి? ఒంటరిగా పోటీచేసి గెలువగలమన్న నమ్మకం వీరిలో ఏ ఒక్కరికీ లేదు. గెలువటం మాట అట్లుంచి, అసలు ఆ విధంగా పోటీచేసే సాహసమైనా ఏ ఒక్కరికీ లేదు. తేలుతున్న మొదటి విషయం ఇది కాగా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమని కొంతకాలం పాటు అంటూ వచ్చింది కేవలం మేకపోతు గాంభీర్యమన్నమాట. లేనట్లయితే, తీరా సభ రద్దయిన వెనుక, అందుకు వ్యతిరేకంగా ఇన్నిన్ని మాటలు, ఎన్నికలను ఆపే చేష్టలు దేనికి?

మొత్తానికి ఈ విధంగా ఎన్నికలకు ముందే తమ బలహీనతలను అన్ని విధాలుగా బయటపెట్టుకుంటున్న కాంగ్రెస్ తదితర పార్టీలు, తమ గురించి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతున్నదో తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాయా? చివరికి గెలుస్తారా లేదా అన్నది వేరే ప్రశ్న. కానీ పార్టీ నాయకత్వాలన్నవి తమ గురించి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ఆ పని దశలు దశలుగా జరుగాలి. అందుకు తగిన సమాధానాలను కనుగొని ఆ ప్రకారం వ్యవహరించాలి. కనుగొనే అభిప్రాయాలను బయటకు వెల్లడించకపోవచ్చుగాక. కానీ వాస్తవాలేమిటో తమకు తెలియాలి. ఈ రోజున వాస్తవం ఏమంటే, పై బలహీనతల కారణంగా, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ అయినా వెలువడకముందే ప్రతిపక్షాలు తేలికైపోయాయి. తమను తామే తేలిక చేసుకున్నాయి. ఆ విధంగా వారు మొదటి కీలక దశలో దెబ్బతిన్న తర్వాత, ఇక రెండవ కీలక దశలో ఏమీ చేయగలరన్నది జన సామాన్యం వేచిచూస్తున్న విషయం.

అది ఎన్నికల పొత్తుల మాట. తిరిగి ఇందులోనూ రెండు విషయాలున్నాయి. పొత్తులు ఎవరెవరి మధ్య అన్నది ఒకటి. అవి ఏ విధంగా కుదరబోతున్నాయనేది రెండు. వీటిలో మొదటిది ఆయా పార్టీల సిద్ధాంతా లు, స్వభావాలు, గత చరిత్రలు, వర్తమాన వైఖరులకు సంబంధించిన ప్రశ్న. రెండవది కేవలం కూడికలు, తీసివేతలు, అంకెల ప్రశ్న. పైన మొద ట చెప్పుకున్న నాలుగు అంశాలు రాజకీయపు మాటలకు సంబంధించినవి. ఈ రెండు విషయాలు పోటీకి సంబంధించిన ఆచరణాత్మకమైనది. ఆ విధంగా చూసినప్పుడు మొదటి నాలుగింటికన్న ఈ రెండింటికి విలు వ, ప్రభావం ఎక్కువ. ఇందుకు సంబంధించి జరుగుతున్నదేమిటో గమనించినట్లయితే, అసలు మొదటి ప్రశ్నే గజిబిజిగా మారింది. అట్లా మారటాన్ని చూసి ఆయా పార్టీల అనుచరుల మాటలట్లున్నా సాధారణ ప్రజలకు మాత్రం తగినంత ఆశ్చర్యాలు కలుగుతున్నాయి. పార్టీల నాయకులకు, అనుచరులకు కావలసింది ఎన్నికల్లో ఏదోవిధంగా గెలిచి అధికారాన్ని అనుభవించటం గనుక సిద్ధాంతాలు, గత చరిత్రలు, వర్తమాన వైఖరుల వంటివి లెక్కలోకి రాకపోవటం సహజమే గాని, సాధారణ ప్రజల పరిస్థితి అది కాదు గదా.

ఆ విధంగా కొద్ది విషయాలను గమనించండి. టీడీపీ వంటి పార్టీకి గల కొద్ది ఓట్ల కోసమని వారితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లకు ఎటువంటి సంకోచాలు లేనట్లు అర్థమవుతున్నది. కొన్ని ఇతర పరిస్థితుల వల్ల బెడిసింది కానీ లేనట్లయితే బీజేపీకి కూడా సందేహం ఉండేది కాదు. అనగా, తెలంగాణకు చారిత్రకంగా, విభజన సమయంలో ఎన్నెన్ని నష్టాలు చేసినప్పటికీ, ప్రస్తుతం తమ అధికార రాజకీయాల కోసం దానినంతా ఈ పార్టీలు విస్మరిస్తున్నాయన్నమాట. తెలంగాణలో టీడీపీ కొనసాగటం చారిత్రక అవసరం అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గతవారమే మరొకమారు హైదరాబాద్ నుంచే ప్రకటించారు. తమకు తమ రాష్ట్రం ఒకటి సకల స్వేచ్ఛలతో ఉండగా, తెలంగాణలో కొనసాగవలసిన చారిత్రక అవసరం అంటే ఏమిటో, అది ఎందు కో ఆయన ఇంతవరకు ఒక్కసారి అయినా, రేఖామాత్రంగానైనా వివరించలేదు. అటువంటి అవసరం తెలంగాణ ప్రజలకా, తనకా అన్నది కూడా చెప్పలేదు. అది పక్కకు ఉంచి విషయమేమంటే, తెలంగాణ పార్టీ లు తమ అధికార అవసరమనే సంకుచిత ప్రయోజనం కోసం టీడీపీ వంటి పార్టీ చారిత్రక అవసరం కోసం ఉపయోగపడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నమాట.

అదే పద్ధతిలో సీపీఐ, సీపీఎంలకు తమ వామపక్ష సంఘీభావాల కన్న ఇతరులు ముఖ్యమవుతున్నారు. వీరిస్థితి మరొకవిధంగా దయనీయమైనది. 2014 ఎన్నికల్లో మొదటి ఐదు స్థానాలు వీరు బూర్జువా పార్టీలంటూ ఎంతో ప్రేమగా పిలిచే ఇతర పార్టీలవి. కేవలం చెరొక సీటు తో వారు ఆరవ స్థానంలో జాయింట్ విన్నర్స్ ఘనత సాధించారు. తర్వాత నాలుగు నెలలకు అక్టోబర్‌లో మొత్తం డజను వామపక్షాలతో ఆర్భాటపు సమావేశం జరిపి 2019లో అధికారపక్షానికి ప్రత్యామ్నాయంగా ఎదుగగలమని ప్రతిజ్ఞలు చేశారు. కానీ పట్టుమని ఒక సంవత్సరమైనా కలిసి నడువలేకపోయారు. సీపీఐని బూర్జువా అయస్కాంత శక్తి ఆకర్షించగా, తెలంగాణ ప్రజలను, దళిత బహుజనులను బోల్తా కొట్టించి గెలిచేందుకు సీపీఎం నిజాయితీ లేని ఎత్తుగడలు వేస్తున్నది. తాము తెలంగాణ రైతాంగ పోరాటంలో తుపాకులు మోసాము గనుక, ఈ రోజున రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది దళిత బహుజనులు గనుక, అందరూ తమ ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకతను, రాష్ట్రం ఏర్పడిందనే కొత్త వాస్తవాన్ని తాము నేటికీ ఎండార్స్ చేయటం లేదనే చేదు నిజాన్ని మరిచిపోయి ప్రజలు తమను గెలిపించగలరని భ్రమ పడుతున్నది.

సీపీఎంను పక్కన ఉంచితే, తక్కినవారంతా పైన పేర్కొన్న రకరకాల వైరుధ్యాలతో ఒక మహా కిచిడీ వండి వార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయమన్నది ఒక్కోసారి వన్ ప్లస్ వన్ లెక్కలు మాత్రమే కావచ్చు. కానీ అంతమాత్రమే కాదని పలుమార్లు రుజువైంది కూడా. ప్రజల్లో విశ్వసనీయత అన్నింటికన్నా ముఖ్యం. ఈ కూటమికి అటువంటి విశ్వసనీయత ఉందా?

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *