mt_logo

తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత భీమిరెడ్డి

భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారకోపన్యాస సభ 9 మే నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి , శ్రీ చుక్కా రామయ్య (శాసన మండలి సభ్యులు ) , శ్రీ జితేందర్‌బాబు ( దక్కన్ ఆర్కియలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) .శ్రీ జూలూరి గౌరీ శంకర్ (తెలంగాణ రచయితల వేదిక ) స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ చెన్నమనేని రాజేశ్వర్‌రావు, మల్లు స్వరాజ్యం, శ్రీ కందిమల్ల ప్రతాప్‌డ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఐ నాయకులు శ్రీ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) నేత కోటయ్య, మాజీ ఎంపీ సోలిపేట రామ చంద్రారెడ్డి , ప్రముఖ రచయిత సుద్దాల అశోక్‌తేజ, పలువురు స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. వీరితో పాటు బి యన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సభికులు ముందుగా బియన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే ఒక్క నిమిషం మౌనం పాటించారు.

శ్రీ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ బియన్ రెడ్డి స్మారక ఉపన్యాస నిర్వహించడంపై బియన్ రెడ్డి తనయుడు ప్రభాకర్ రెడ్డి ని అభినందించారు. పోరాటాల స్ఫూర్తి ప్రదాత బియన్ రెడ్డి సార్మకోపన్యాస కార్యక్రమాలను ప్రభుత్వాలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. బియన్ రెడ్డి స్మారక కేంద్రాలు, రిసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పినా మంత్రులు ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, తెలంగాణ వీరులు, పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

శ్రీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రత్యేక్షంగా పరోక్షంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతునప్పుడు తనకు ఇరవై ఏండ్లు అని గుర్తుచేశారు. గూడూర్, బొమ్మెర, పాలకుర్తి వంటి గ్రామాలలో బియన్ గారు తిరిగారు అని చెప్పారు . బియన్ లాంటి సమరయోధుడిని చూడడానికి ప్రతి గ్రామములో జనాలు తండోపతండాలుగా వచ్చేవారని అన్నారు. బియన్ జీవితమే తెలంగాణ గాధ అన్నారు. చరిత్రను సృష్టించిన ఆ యోధుడు తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తిదాయకమన్నారు. బియన్ రెడ్డి నీ తెలంగాణ చేగువేరా అని ఆయన అభివర్ణించారు.

ముఖ్య అతిధి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బియన్ రెడ్డి మరియు వారి సహచరులు కలిసి నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. ఆ పోరాటం ద్వారా ప్రజలు జమిందార్ల దగర నుంచి భూమి పొంధగాలిగారన్నారు.

తమ ఆకాంక్ష నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ప్రజలు 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం దారుణమన్నారు.తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం సిద్ధంగా లేనట్లు కనిపిస్తుందన్నారు. అహింసాయుత మార్గంలో తమ ఆకాంక్షను నెర వేరక ప్రజలు పోరాటాలు చేసినా ప్రభుత్వాలు స్పందించనిపక్షంలో ఆ పోరాటాలు సాయుధ పోరాటాలుగా రూపాంతరం చెందుతాయన్నారు. ప్రజలే తమ పోరాట మార్గాలను ఎంచుకుంటారని, ప్రభుత్వాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిజాం నిరంకుశ సర్కారుకు వ్యతిరేకంగా, అన్యాయాలు, అక్రమాలపై సాయుధ పోరాటం చేసిన బియన్ రెడ్డి గారిని స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే ప్రజలు పదిహేను లక్షల ఎకరాల భూమిని సొంతం చేసుకోగలిగారు అని అన్నారు . నాటి పోరాటయోధుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. పోరాటయోధులు, అమరవీరుల చిత్రపటాలతో కూడిన మ్యూజియంను ఏర్పాటు చేసుకోవాలని, పాఠ్యపుస్తకాల్లో వారి చరిత్రలో చేర్చాలని డిమాండ్ చేశారు. భూసంస్కరణలు తీసుకువచ్చిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *