mt_logo

బతుకమ్మ పండుగ దినాల్లో మహిళా ఉద్యోగులకు పనివేళల్లో మార్పు

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ పది జిల్లాలకు కలిపి పదికోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమై బతుకమ్మ వేడుకలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వీలుగా మహిళా ఉద్యోగులకు ఈనెల 23 నుండి వచ్చే నెల 2 వ తేదీవరకు మధ్యాహ్నం రెండుగంటల వరకే విధులు నిర్వహించే వీలు కల్పిస్తూ పనివేళల్లో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్ సెక్రటేరియట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకోవాలని, తెలంగాణ కార్యాలయాలన్నింటిలో పండుగ సంబరాలు ఉట్టిపడాలని సీఎం వారికి సూచించారు. సెక్రటేరియట్ లో మహిళా ఉద్యోగుల బతుకమ్మ పండుగకు 5 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ మహిళా ఉద్యోగుల బతుకమ్మ పండుగను పర్యవేక్షించే బాధ్యతను సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ కు సీఎం అప్పగించారు. పండుగ నిర్వహణ కోసం సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులతో ఐదు బృందాలను వివిధ జిల్లాల పర్యటనకు పంపించనున్నట్లు, వారి పర్యటన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *