mt_logo

బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం – రెడ్యానాయక్

టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. మొన్న టీడీపీ నుండి తుమ్మల, నిన్న తీగల, తలసాని, గంగాధర్ గౌడ్, ఈరోజు కాంగ్రెస్ మాజీ మంత్రి రెడ్యా నాయక్.. వరంగల్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య, రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవిత తదితరులు గురువారం సీఎం కేసీఆర్ ను కలిసి పార్టీలో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. సీఎంను కలిసిన అనంతరం రెడ్యానాయక్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలనాదక్షత, పట్టుదల చూసి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు, బంగారు తెలంగాణ కోసం సీఎం పట్టుదలతో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కీర్తించారు.

ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైనా కాకముందే కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు చెప్పినట్లు నడిచే తెలంగాణ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై రెడ్యా నాయక్ మండిపడ్డారు. జనాభాలో 10 శాతం ఉన్న లంబాడా గిరిజనుల కోసం ఇన్నేళ్ళూ ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని, కేసీఆర్ అధికారంలోకి రాగానే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయితీలుగా మారుస్తానన్న వాగ్దానం నచ్చిందని చెప్పారు. నల్గొండ జిల్లాలోని తండాల్లో ఇప్పటికీ అమ్మాయిలను విక్రయిస్తున్నారని, అలాంటి వారికి నేనున్నానని, గిరిజన ఆడపిల్లల పెళ్ళికి రూ. 51 వేలు ఇచ్చేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఇవన్నీ తాను టీఆర్ఎస్ లో చేరేలా ప్రేరేపించాయని, త్వరలోనే ముఖ్యమంత్రితో సమయం తీసుకుని పార్టీలో చేరతామని, తనతో పాటు ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది రావాల్సి ఉందని పేర్కొన్నారు. చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ, చేవెళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *